మమ్మల్ని ఎవరూ ఆపలేరు

మమ్మల్ని ఎవరూ ఆపలేరు

కాంగ్రెస్ పార్టీ ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ‘భారత్ జోడో యాత్ర’ ఇటీవలే కర్ణాటకకు చేరుకుంది. పాదయాత్రకు ప్రాతినిథ్యం వహిస్తూ, ఉత్సాహంగా ముందుకు వెళ్తున్న కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ ఆదివారం మైసూర్ లో యాత్రను కొనసాగించారు. ఈ క్రమంలో ఓ బహిరంగ సభలో రాహుల్ ప్రసంగించారు. ఈ సమయంలో భారీ వర్షం వచ్చింది. అయినా జోరు వానను కూడా లెక్కచేయకుండా ఆయన ప్రసంగాన్ని కొనసాగించడం అందర్నీ ఆకట్టుకుంది. ఈ వర్షంలోనే పార్టీలో చేరికల గురించి, నేతలంతా కలిసి అభివాదం చేయడం వంటివన్నీ జరిగిపోయాయి. దీనికి సంబంధించిన ఓ వీడియోను రాహుల్ గాంధీ ట్విట్టర్ లో షేర్ చేశారు.

భారత్ ను ఏకం చేయడంలో మమ్మల్ని ఎవరూ ఆపలేరని ఈ బహిరంగ సభలో రాహుల్ గాంధీ అన్నారు. కన్యాకుమారి నుంచి కశ్మీర్ వరకు తాము చేపట్టిన భారత్ జోడో యాత్రను ఎవరూ ఆపలేరు అని నొక్కి చెప్పారు. అంతకుముందు ఖాదీ గ్రామోదయ కేంద్రంలో మహాత్మా గాంధీకి ఆయన నివాళులర్పించారు.సెప్టెంబర్ 29న కేరళలో పూర్తయిన ఈ యాత్ర.. ప్రస్తుతం కర్ణాటకలో కొనసాగుతోంది. మైసూర్ నుంచి ఈ యాత్రను ప్రారంభించగా... ఈ నెల 6న  యాత్రలో సోనియా గాంధీ పాల్గొనే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.