
కాంగ్రెస్ పునర్వైభవం, ప్రజలతో మమేకమే లక్ష్యంగా కాంగ్రెస్ నేత రాహుల్‌గాంధీ చేపట్టిన ‘భారత్ జోడో ఉత్సాహంగా కొనసాగుతోంది. తమిళనాడులోని నాగర్ కోయిల్ లో మూడో రోజు భారత్ జోడో యాత్ర ఘనంగా ప్రారంభమైంది. స్థానిక స్కాట్ క్రిస్టియన్ కళాశాలలో రాహుల్ గాంధీ జాతీయ జెండాను ఎగురవేసి యాత్రను ప్రారంభించారు. అనంతరం ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద గతంలో జరిగిన రైతుల ఆత్మహత్యలను సూచిస్తూ..పుర్రెలతో నిరసన తెలిపిన తమిళనాడు అన్నదాతలతో ఆయన మాట్లాడారు. మూడో యాత్రలో భాగంగా రాహుల్ గాంధీ మధ్యాహ్నం 1 గంటకు మీడియా సమావేశం నిర్వహించనున్నారు. ఇక రేపటి దాకా రాహుల్ గాంధీ యాత్ర తమిళనాడులోనే సాగనుంది. ఇక సెప్టెంబర్ 11న కేరళ రాష్ట్రంలోని కలియిక్కవిలాలోకి భారత్ జోడో యాత్ర ప్రవేశించనుంది.
Tamil Nadu | Congress begins its third day of the 'Bharat Jodo Yatra', led by party MP Rahul Gandhi, in Nagercoil pic.twitter.com/riOVLibBqQ
— ANI (@ANI) September 9, 2022
రెండో రోజు యాత్ర విశేషాలు..
భారత్ జోడో యాత్రలో భాగంగా రాహుల్ గాంధీ రెండో రోజు 20 కిలో మీటర్లు నడిచారు. కన్యాకుమారి అగస్తీశ్వరం నుంచి రెండో రోజు యాత్ర ప్రారంభించి..నాగర్ కోయిల్ వరకు యాత్ర కొనసాగించారు. వివేకానంద పాలిటెక్నిక్ కాలేజీ నుంచి రెండో రోజు ఆరంభమైన ఈ పాదయాత్రలో రాహుల్ గాంధీతో పాటు రాజస్థాన్ ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్, ఛత్తీస్‌గఢ్ ముఖ్యమంత్రి భూపేష్ బఘేల్ పాల్గొన్నారు. కాంగ్రెస్ కార్యకర్తలు ఆయనకు దారిపొడవునా స్వాగతం పలికారు. పలువురితో సంభాషించారు. ఈ సందర్భంగా యువత రాజకీయాల్లోకి రావాలని ఆయన పిలుపునిచ్చారు. యాత్రలో భాగంగా స్వాతంత్య్ర పోరాట సమయంలో గాంధీజీ సందర్శించిన సుచింద్రంలోని ఎస్ఎంఎస్ఎం హయ్యర్ సెకండరీ స్కూల్ ను సందర్శించారు. జవహార్ బాల్ మంచ్ సభ్యులతో మాట్లాడారు. పెయింటింగ్ లో ప్రతిభ చూపిన బాలలకు ప్రైజులు అందజేశారు. భారత్ జోడో ప్రత్యేక సంచికను ఆవిష్కరించారు. స్కూళ్లో మొక్కలు నాటిన రాహుల్..రైతు సమస్యలపై పోరాడుతున్న పౌరసమాజం సభ్యులతో భేటీ అయ్యారు.
విద్వేష రాజకీయాలను ఓడించాలన్న సంకల్పంతో..
దేశంలోని ప్రజలందరినీ సంఘటితం చేసి విద్వేష రాజకీయాలను ఓడించాలన్న సంకల్పంతో రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్రకు సెప్టెంబర్ 8వ తేదీన శ్రీకారం చుట్టారు. తమిళనాడులోని కన్యాకుమారిలో తమిళనాడు సీఎం స్టాలిన్ తో కలిసి ఆయన ఈ యాత్రను ప్రారంభించారు. యాత్ర ప్రారంభోత్సవంలో రాజస్థాన్ సీఎం అశోక్ గెహ్లాట్, చత్తీస్ గఢ్ సీఎం భూపేశ్ బాఘేల్, కాంగ్రెస్ నేతలు చిదంబరం, దిగ్విజయ్ సింగ్, మల్లికార్జున ఖర్గే తదితరులు పాల్గొన్నారు. అంతకుముందు శ్రీపెరంబుదూర్‌లోని మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ స్మారక స్థలాన్ని రాహుల్ సందర్శించారు. అక్కడ ఒక మొక్కను నాటిన తర్వాత రాజీవ్ ఫొటో వద్ద నివాళి అర్పించారు. ఆ తర్వాత కామరాజ్ మెమోరియల్‌ను సందర్శించారు. ఆపై మహాత్మాగాంధీ మండపం వద్ద ప్రార్థనలో పాల్గొని యాత్రను లాంఛనంగా ప్రారంభించారు.
ఎన్ని కిలో మీటర్లు..
కాంగ్రెస్ పార్టీకి పునరుత్తేజం కోసం రాహుల్ గాంధీ కన్యాకుమారి టు కశ్మీర్ వరకు భారత్ జోడో యాత్ర చేపట్టారు. ఈ యాత్ర 12 రాష్ట్రాలు.. 2 కేంద్రపాలిత ప్రాంతాల మీదుగా 68 లోక్‌సభ స్థానాలు, 203 అసెంబ్లీ నియోజకవర్గాల్లో 3 వేల 571 కిలోమీటర్ల పాదయాత్ర చేయబోతున్నారు ఐదు నెలల పాటు యాత్ర కొనసాగుతుంది.