
రాహుల్ గాంధీ చేపట్టిన భారత్ జోడో యాత్ర దేశంలో రాజ్యాంగాన్ని, ప్రజాస్వామ్యాన్ని తిరిగి తెస్తుందని కాంగ్రెస్ నేత మల్లు రవి అన్నారు. ప్రజాస్వామ్యం ప్రకారం చట్టబద్ధమైన పాలనను తిరిగి తీసుకురావడానికే రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్ర చేపట్టారని పేర్కొన్నారు. కేంద్రంలోని బీజేపీ నేతృత్వంలోని ఎన్‌డీఏ ప్రభుత్వం, తెలంగాణలో టీఆర్‌ఎస్ ప్రభుత్వం రెండింటికీ ముప్పుందని చెప్పారు. వాక్ స్వాతంత్య్రం, ప్రభుత్వాన్ని ప్రశ్నించే స్వేచ్ఛ లేదని రాహుల్‌గాంధీ ఇప్పటికే ఎన్నోసార్లు పార్లమెంటులో ప్రస్తావించినప్పటికీ కేంద్రంలో ఎలాంటి మార్పూ రాలేదన్నారు. టీఆర్‌ఎస్ వైఖరిలోనూ ఏ మార్పు రాకపోవడంతో రాహుల్‌గాంధీ భారత్ జోడో యాత్రను ప్రారంభించారని మల్లు రవి స్పష్టం చేశారు.
రాహుల్ గాంధీ యాత్ర తమిళనాడు, కేరళలో పూర్తి చేసుకుని ఇప్పుడు కర్ణాటకలో ప్రవేశించి 23న ఉదయం కృష్ణా వంతెన వద్ద తెలంగాణలోకి ప్రవేశిస్తారని మల్లు రవి తెలిపారు. రెండు రోజుల విరామం తర్వాత మళ్లీ అక్టోబర్ 26 నుంచి యాత్రను ప్రారంభిస్తారని చెప్పారు. కేంద్రంలోని విభజన రాజకీయాలను ఎదుర్కోవడానికి, ఆర్థిక అసమానతలు, సామాజిక ధ్రువణత, రాజకీయ కేంద్రీకరణ వంటి వాటి నుండి దేశ ప్రజలను మేల్కొల్పడానికి ' భారత్ జోడో యాత్ర ' నిర్వహిస్తున్నట్లు చెప్పుకొచ్చారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ ఘోర పరాజయాన్ని చవిచూడడంతో రాబోయే ఎన్నికలపై కాంగ్రెస్ దృష్టి సారించింది. అందులో భాగంగా పార్టీ శ్రేణులను సమీకరించే ప్రయత్నమే ఈ యాత్రను ప్రారంభించారని సమాచారం.