భారత్ సమిట్‌‌‌‌ షురూ..

భారత్ సమిట్‌‌‌‌ షురూ..
  • నేడు, రేపు ప్రజాస్వామ్యం, ఆర్థిక న్యాయం, వాతావరణ మార్పులపై చర్చలు
  • తెలంగాణ రైజింగ్‌‌‌‌పై స్పెషల్ డిస్కషన్లు
  • ఆర్థికవేత్త థామస్ పికెట్టి, విదేశీ నేతల హాజరు
  • 14న రాహుల్ గాంధీ, ఖర్గే కీలక ప్రసంగాలు

హైదరాబాద్, వెలుగు: ప్రజాస్వామ్య వ్యవస్థల పరిరక్షణ, ఆర్థిక న్యాయం, వాతావరణ మార్పులు సహా ప్రపంచం ఎదుర్కొంటున్న సవాళ్లపై చర్చించేందుకు ప్రగతిశీల శక్తులన్నీ ఒకే వేదికపైకి వచ్చాయి. హైదరాబాద్‌‌‌‌లో ‘భారత్ సమిట్–2026 తెలంగాణ రైజింగ్’ అంతర్జాతీయ సదస్సు గురువారం ప్రారంభమైంది. ఈ నెల 14 వరకు హెచ్‌‌‌‌ఐసీసీ, హైటెక్స్ ప్రాంగణాల్లో జరిగే రెండో ఎడిషన్ సమ్మిట్‌‌‌‌లో అంతర్జాతీయ నేతలు, ఆర్థికవేత్తలు, నిపుణులు పాల్గొంటున్నారు. నవంబర్ 14న ముగింపు సభలో ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, లోక్‌‌‌‌సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ కీలక ప్రసంగాలు చేయనున్నారు.

నేడు కీలక అంశాలపై చర్చలు

13న ‘న్యూ వరల్డ్ ఆర్డర్’ ప్లీనరీతో ప్యానెల్ చర్చలు ప్రారంభమవుతాయి. సల్మాన్ ఖుర్షీద్, పుష్పరాజ్ దేశ్‌‌‌‌పాండే ప్రసంగిస్తారు. కాంగ్రెస్ చరిత్ర, రాజ్యాంగ పరిరక్షణ, ఆర్టీఐ, ఉపాధి హామీ, విద్యా హక్కు చట్టాలు, రాష్ట్ర ప్రభుత్వ పథకాలతో ఎక్స్‌‌‌‌పో ఏర్పాటు చేశారు. మంత్రి శ్రీధర్ బాబు, నిపుణులు ‘ఫ్యూచర్ సిటీ–పట్టణీకరణ’పై, పీసీసీ చీఫ్ మహేశ్ గౌడ్, ఎంపీ కడియం కావ్య ‘ఆర్థిక న్యాయం’పై చర్చిస్తారు. సంక్షేమ విధానాలపై మంత్రులు వివేక్ వెంకటస్వామి, అడ్లూరి లక్ష్మణ్, ప్రొఫెసర్ శాంతా సిన్హా మాట్లాడతారు. 

‘ఏఐ–క్లౌడ్ క్యాపిటలిజం’పై సుప్రియా శ్రీనేత్ సమన్వయంలో మంత్రి శ్రీధర్ బాబు, అంతర్జాతీయ నిపుణులు చర్చిస్తారు. ప్రపంచ ఆర్థిక వ్యవస్థపై థామస్ పికెట్టి, జయతీ ఘోష్ ప్రసంగిస్తారు. మెక్సికో, బ్రెజిల్ యువ నేతలతో భవిష్యత్ రాజకీయాలు, దక్షిణార్థ గోళ దేశాల సహకారం, బహుళజాతి సంస్థల సంస్కరణలు, వాతావరణ మార్పులపై చర్చలు జరగనున్నాయి. మహిళా సాధికారత, జెండర్ జస్టిస్‌‌‌‌పై ఎంపీలు రేణుకా చౌదరి, జోథిమణితోపాటు బ్రిటన్, ట్యునీషియా ప్రతినిధులు మాట్లాడతారు. 

మంత్రులు పొన్నం ప్రభాకర్, సీతక్క, ప్రొఫెసర్ కంచ ఐలయ్య ఆధ్వర్యంలో ‘తెలంగాణ రైజింగ్–సామాజిక న్యాయం’పై ప్రత్యేక సెషన్ ఉంటుంది. సంక్షేమ విధానాలపై అడ్లూరి లక్ష్మణ్, ప్రొఫెసర్ శాంతా సిన్హా, కేకే రాజు, కోట నీలిమ మాట్లాడతారు. సాయంత్రం డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రులు శ్రీధర్ బాబు, ఉత్తమ్ కుమార్ రెడ్డితో ఇంటరాక్టివ్ సెషన్ నిర్వహిస్తారు.

రేపు రాహుల్, ఖర్గే హాజరు

14న సమాఖ్య వ్యవస్థ పరిరక్షణపై మంత్రి ఉత్తమ్, ఎంపీ చామల కిరణ్, ఝార్ఖండ్ మంత్రి శిల్పీ నేహా తిర్కీ నేతృత్వంలో చర్చ జరుగుతుంది. తెలంగాణ సమాజం, సంస్కృతిపై ప్రొఫెసర్ కోదండరాం, ప్రొఫెసర్ అపూర్వానంద్, సీమా చిస్తీ మాట్లాడతారు. క్రీడలు, యువజన వికాసంపై మంత్రి అజారుద్దీన్, రెజ్లర్, ఎమ్మెల్యే వినేశ్ ఫొగాట్, ఎంపీ గడ్డం వంశీకృష్ణ అనుభవాలు పంచుకుంటారు. ఎన్నికల వ్యవస్థల పారదర్శకతపై అంజలి భరద్వాజ్, ఎల్‌‌‌‌ఎస్‌‌‌‌ఈ ప్రొఫెసర్ ముకులిక బెనర్జీ, ఎంపీ శశికాంత్ సెంథిల్‌‌‌‌తో నిఖిల్ డే గోష్ఠి నిర్వహిస్తారు. అంతర్జాతీయ శాంతి, ప్రపంచ పోకడలు, మీడియా భవిష్యత్తుపై కర్నాటక మంత్రి ప్రియాంక్ ఖర్గే, సచిన్ పైలట్, పవన్ ఖేరా చర్చిస్తారు. 

సాయంత్రం ముగింపు సభలో సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క స్వాగతోపన్యాసం చేస్తారు. ఖర్గే, రాహుల్ గాంధీ కీలక ప్రసంగాలు చేస్తారు. అమెరికా, థాయ్‌‌‌‌లాండ్, జపాన్, ఐవరీ కోస్ట్, నెదర్లాండ్స్ మాజీ మంత్రులు, నేతలు ప్రపంచ న్యాయం, ప్రజాస్వామ్య పరిరక్షణపై మాట్లాడతారు. అంతర్జాతీయ విధానాల రూపకల్పన కోసం మరియా రోడ్రిగ్స్, ఖుర్షీద్ ఆధ్వర్యంలో ‘అవర్ వరల్డ్ ఇన్‌‌‌‌స్టిట్యూట్’ను ప్రారంభిస్తారు. ప్రజాస్వామిక విలువలు, ఆర్థిక సమానత్వం, గ్లోబల్ జస్టిస్ లక్ష్యంగా ఏకగ్రీవ తీర్మానం ఆమోదించి, ఫ్యామిలీ ఫొటోతో సదస్సును ముగిస్తారు. 

ఏఐతో సమాచార వ్యవస్థకు పెను ముప్పు: ఎంపీ శశిథరూర్

మొదటిరోజు విదేశీ ప్రతినిధులు అసెంబ్లీ, ఉపాధి హామీ పనులను పరిశీలించడంతోపాటు ఫీల్డ్ స్టడీలు చేపట్టారు. సాయంత్రం నిర్వహించిన వెల్‌‌‌‌కమ్ డిన్నర్‌‌‌‌లో సల్మాన్ ఖుర్షీద్, శామ్ పిట్రోడా, ఎంపీ శశిథరూర్, ప్రణితి షిండే ప్రసంగించారు. ‘ఫోర్జింగ్ ఏ న్యూ వరల్డ్’ సదస్సులో మాట్లాడిన శశిథరూర్.. ఏఐ ప్రపంచ ఆర్థిక వ్యవస్థలను వేగంగా మారుస్తోందని, సమాచార విశ్వసనీయత, సమగ్రతకు పెను సవాళ్లు ఎదురవుతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. తప్పుడు ప్రచారాల ముప్పు నుంచి సమాచార వ్యవస్థలను కాపాడుకోవాలని సూచించారు. మహిళా నేతల భేటీ, డెమోక్రసీ వర్కింగ్ గ్రూప్, యూత్ లీడర్స్ మీటింగ్స్, డయాస్పోరా కనెక్ట్ పేరిట అమెరికా, బ్రిటన్, కెనడా, నెదర్లాండ్స్, ఖతార్, ఆస్ట్రేలియా ప్రతినిధులతో రౌండ్ టేబుల్ సమావేశాలు నిర్వహించారు.