జూన్ 2 నాటికి.. టిమ్స్ రెడీ చేయాలె..మూడు టిమ్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు ఒకే రిక్రూట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌మెంట్

జూన్ 2 నాటికి..  టిమ్స్ రెడీ చేయాలె..మూడు టిమ్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు ఒకే రిక్రూట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌మెంట్
  • నిమ్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో బెడ్లు లేకపోతే సనత్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌నగర్ టిమ్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు
  • టిమ్స్ పాలనకు గ్రూప్–1 ఆఫీసర్లు
  • హౌస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కీపింగ్ పర్యవేక్షణకు విశ్రాంత సైనికాధికారులు
  • వచ్చే డిసెంబర్ నాటికి ఉస్మానియా కొత్త బిల్డింగ్
  • ఆరోగ్య రంగానికి బడ్జెట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో 4.8% నిధులు
  • మూడేండ్లలో 13,401 కొలువుల భర్తీ
  • డాక్టర్లు, సిబ్బంది హాజరుకు ఏఐ టెక్నాలజీ
  • వైద్యారోగ్య శాఖపై సీఎం రేవంత్ సమీక్ష 

హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో పేదలకు అత్యాధునిక కార్పొరేట్ స్థాయి వైద్య సేవలు మరింత చేరువ చేయడమే లక్ష్యంగా చేపట్టిన ఆస్పత్రుల నిర్మాణ పనులను యుద్ధప్రాతిపదికన పూర్తి చేయాలని సీఎం రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. ఎంసీఆర్ హెచ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఆర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌డీలో గురువారం వైద్యారోగ్య శాఖపై మంత్రి దామోదర రాజనర్సింహతో కలిసి నిర్వహించిన ఉన్నతస్థాయి సమీక్షలో సీఎం మాట్లాడారు.

 వచ్చే ఏడాది జూన్ 2 నాటికి అల్వాల్, ఎల్బీనగర్ టిమ్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లతో పాటు వరంగల్ సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రి, నిమ్స్ విస్తరణ పనులు పూర్తి చేసి తీరాలని డెడ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లైన్ విధించారు. వచ్చే ఏడాది డిసెంబర్ నాటికి ఉస్మానియా ఆస్పత్రి కొత్త భవన నిర్మాణం పూర్తి చేసి అందుబాటులోకి తేవాలన్నారు. కొత్త దవాఖానల నిర్మాణాలు, అత్యాధునిక వైద్య పరికరాల కొనుగోలు, డాక్టర్లు, నర్సులు, పారామెడికల్ సిబ్బంది నియామకాలు ఏకకాలంలో పూర్తి కావాలని స్పష్టం చేశారు. 

రాజీవ్ ఆరోగ్యశ్రీ పరిమితిని రూ.5 లక్షల నుంచి రూ.10 లక్షలకు పెంచామని, మూడేండ్లలోనే 9 మెడికల్ కాలేజీలు, 16 నర్సింగ్ కాలేజీలు, 28 పారామెడికల్ కాలేజీలు ఏర్పాటు చేశామని గుర్తుచేశారు. ప్రజారోగ్యం కోసం ఎంత మొత్తమైనా విడుదల చేసేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని తేల్చిచెప్పారు.

మూడు టిమ్స్‌‌‌‌కు ఏకీకృత నియామకం

సనత్‌‌‌‌నగర్, అల్వాల్, ఎల్బీనగర్ టిమ్స్‌‌‌‌లలో ఏకీకృత నియామక విధానం పక్కాగా అమలు చేయాలని సీఎం ఆదేశించారు. రోగుల రద్దీకి తగ్గట్టు మూడు టిమ్స్ మధ్య డాక్టర్లు, సిబ్బంది అంతర్గత బదిలీలు జరిగేలా నిబంధనలు రూపొందించాలన్నారు. నిమ్స్‌‌‌‌లో సర్జరీలకు వెయిటింగ్ పీరియడ్ ఎక్కువగా ఉన్నందున సనత్‌‌‌‌నగర్ టిమ్స్ సేవలను తక్షణమే పూర్తిస్థాయిలో వినియోగంలోకి తేవాలని చెప్పారు.

 నిమ్స్‌‌‌‌లో బెడ్లు ఖాళీ లేకపోయినా, సర్జరీలు ఆలస్యమైనా రోగులను సనత్‌‌‌‌నగర్ టిమ్స్‌‌‌‌కు మళ్లించేలా వైద్యారోగ్య శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ, నిమ్స్, టిమ్స్ డైరెక్టర్లు నిత్యం సమన్వయం చేసుకోవాలని సూచించారు. టిమ్స్‌‌‌‌లో శాశ్వత డాక్టర్ల నియామకం పూర్తయ్యేదాకా బయటి నుంచి తాత్కాలిక డాక్టర్లను తీసుకోవాలని, అందుకు నిధులు వెంటనే విడుదల చేస్తామని హామీ ఇచ్చారు.

పాలనకు గ్రూప్–1 ఆఫీసర్లు

దవాఖానల నిర్వహణ, పాలనా వ్యవహారాల్లో డాక్టర్ల జోక్యం తగ్గించి, వాళ్లు పూర్తిగా రోగుల సంరక్షణపైనే దృష్టి పెట్టేలా సీఎం పరిపాలనా సంస్కరణలు ప్రకటించారు. టిమ్స్ సాధారణ పరిపాలన, పర్యవేక్షణ బాధ్యతలను గ్రూప్–1 అధికారులకు అప్పగించనున్నట్లు తెలిపారు. ఔట్‌‌‌‌సోర్సింగ్‌‌‌‌లో చేపట్టే శానిటేషన్, హౌస్‌‌‌‌కీపింగ్ పనుల పర్యవేక్షణకు విశ్రాంత సైనికాధికారులను నియమిస్తామని ప్రకటించారు.

 ప్రభుత్వ దవాఖానల్లో డాక్టర్లు, సిబ్బంది సమయపాలన పాటించేలా ఏఐ టెక్నాలజీతో కూడిన బయోమెట్రిక్ హాజరు విధానాన్ని కచ్చితంగా అమలు చేయాలన్నారు. ఇప్పటికే 16 కొత్త డయాలసిస్ సెంటర్లు ప్రారంభించామని, నిర్మాణంలో ఉన్న మరో 79 సెంటర్లను త్వరగా పూర్తి చేసి కిడ్నీ రోగులకు స్థానికంగానే చికిత్స అందేలా చూడాలని ఆదేశించారు.