కేడర్ మారదు.. సీనియారిటీ తగ్గదు ..ఇంటర్ విలీనమైనా ఉద్యోగులకు నో టెన్షన్

 కేడర్ మారదు.. సీనియారిటీ తగ్గదు ..ఇంటర్ విలీనమైనా ఉద్యోగులకు నో టెన్షన్
  • పాఠశాల స్టాఫ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌తో ఇంటర్ ఉద్యోగుల మెర్జింగ్ ఉండదు 
  • ప్రస్తుత సర్వీస్ రూల్సే భవిష్యత్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లోనూ అమలు.. ఉన్నతాధికారుల స్పష్టత 
  • మోడల్ స్కూల్స్, కేజీబీవీల మాదిరిగానే ‘ఇంటర్ విభాగం’ 

హైదరాబాద్, వెలుగు:  సీఎం రేవంత్​రెడ్డి ఆదేశాలతో ఇంటర్ బోర్డు, కమిషనరేట్‌‌ను స్కూల్ ఎడ్యుకేషన్ లో విలీనం చేసే ప్రక్రియ వేగవంతమైంది. ఈ విలీనంతో ఇంటర్ విద్యలో పనిచేసే ఉద్యోగులకు ఎలాంటి నష్టం వాటిల్లదని ఉన్నతాధికారులు చెప్తున్నారు. ఇంటర్ ఉద్యోగుల సీనియారిటీ, విధులు, అధికారాలు యథాతథంగా ఉంటాయని, స్కూల్ ఎడ్యుకేషన్ సిబ్బందితో ఇంటర్ ఉద్యోగుల కేడర్‌‌ మెర్జింగ్ ఉండబోదని అంటున్నారు. వచ్చే విద్యాసంవత్సరం నుంచి ఇంటర్ బోర్డు, ఇంటర్ కమిషనరేట్ విభాగాలు స్కూల్ ఎడ్యుకేషన్ విభాగంలో కొనసాగనున్నాయి. దేశవ్యాప్తంగా తెలంగాణ, ఏపీ సహా ఏడు రాష్ట్రాల్లో మాత్రమే ఇంటర్​బోర్డులున్నాయి. మిగిలిన అన్ని రాష్ట్రాల్లో ఇప్పటికే 11, 12 తరగతులు హైస్కూల్​లో భాగంగా కొనసాగుతున్నాయి. 

పాత పద్ధతిలోనే ప్రమోషన్లు

విలీనం తర్వాత ఇంటర్ బోర్డు, కమిషనరేట్లలో పనిచేస్తున్న నాన్ టీచింగ్, టీచింగ్ ఉద్యోగుల సర్వీసు నిబంధనలకు ప్రభుత్వం పూర్తి రక్షణ కల్పించనుందని ఉన్నతాధికారులు అంటున్నారు. ప్రస్తుతం వారికి ఏయే సర్వీస్ రూల్స్ వర్తిస్తున్నాయో, భవిష్యత్‌‌లోనూ అవే కొనసాగుతాయని పేర్కొంటున్నారు. ప్రమోషన్లు, సీనియారిటీ జాబితాలు కూడా పాత పద్ధతిలోనే అమలవుతాయని చెప్తున్నారు. కేవలం పరిపాలనాపరమైన మానిటరింగ్ బాధ్యతలను మాత్రమే స్కూల్ ఎడ్యుకేషన్ శాఖ చూస్తుందని అంటున్నారు. 

ఓపెన్ స్కూల్ విభాగం, మోడల్ స్కూల్స్, ఎడ్యుకేషన్ సొసైటీ గురుకులాలు, కేజీబీవీల తరహాలోనే.. ‘ఇంటర్మీడియట్ వింగ్’ కూడా స్కూల్ ఎడ్యుకేషన్‌‌లో ఓ ప్రత్యేక విభాగంగా కొనసాగనుంది. ఒక విభాగంగా మారినప్పటికీ దాని అంతర్గత వ్యవస్థ, ఉద్యోగుల బాధ్యతలు స్వతంత్రంగానే ఉంటాయని అధికారులు స్పష్టం చేస్తున్నారు. భవనాలు, ఆస్తులు మాత్రం స్కూల్ ఎడ్యుకేషన్ కిందికి రానున్నాయి.  

పేద విద్యార్థుల ఉన్నత చదువులకే..

1971 నాటి తెలంగాణ ఇంటర్మీడియట్ విద్యా చట్టాన్ని రద్దు చేసి, 1982 నాటి విద్యా చట్టానికి అవసరమైన సవరణలు చేసేందుకు వీలుగా ప్రభుత్వం త్వరలోనే ఆర్డినెన్స్ తీసుకురానున్నట్లు తెలిసింది. వచ్చే 2027–28 విద్యాసంవత్సరం నుంచి ఇంటర్మీడియట్ రద్దయి.. 11, 12 తరగతులు హైస్కూల్ పరిధిలోకి రానున్నాయి. టెన్త్ తర్వాత కాలేజీలకు వెళ్లలేక డ్రాపవుట్లుగా మారుతున్న గ్రామీణ విద్యార్థులు, ప్రధానంగా పేద వర్గాల బాలికలకు ఉన్నత చదువులను చేరువ చేసేందుకే ఈ సంస్కరణలు తెస్తున్నామని ఇప్పటికే  సర్కారు వెల్లడించింది.  

11వ తరగతికి ఎగ్జామ్స్​ ఉండవు 

ఎస్సెస్సీ, ఇంటర్ బోర్డులను కలిపి సీనియర్ సెకండరీ బోర్డుగా మార్చాలని సర్కారు భావిస్తోంది. ఇకపై 10, 12వ తరగతులకు మాత్రమే పబ్లిక్ పరీక్షలు ఉండనున్నాయి. 11వ తరగతికి ఉండవు. ఆయా క్లాసులను  ఇంటర్ ఫస్టియర్, సెకండియర్ పేర్లతో పిలవరు. ప్రస్తుతం జూనియర్ కాలేజీలను పర్యవేక్షిస్తున్న డీఐఈవోలు వారి విధులను కొనసాగిస్తారని ఆఫీసర్లు చెప్తున్నారు. 

కాగా, జూనియర్ కాలేజీలు లేని చోట్ల హైస్కూళ్లలోనే 11, 12 క్లాసులను దశలవారీగా ప్రారంభించాలని సర్కారు నిర్ణయించింది. ఇప్పటికే తెలంగాణ పబ్లిక్ స్కూళ్లు, తెలంగాణ ఇంటిగ్రేటెడ్ స్కూళ్లలో ఇంటర్ దాకా అమలు చేస్తున్నారు. ఇంకా కొన్ని అంశాలపై స్పష్టత రావాల్సి ఉందని, త్వరలోనే వీటిపై నిర్ణయం తీసుకుంటామని విద్యాశాఖ ఉన్నతాధికారి ఒకరు చెప్పారు.