పురుగు మందుల పంజాలో.. సీతాకోక చిలుకలు! ..పదేండ్లలో సగం మాయం

పురుగు మందుల పంజాలో..  సీతాకోక చిలుకలు! ..పదేండ్లలో సగం మాయం
  • పెస్టిసైడ్స్​, కాంక్రీట్ జంగిల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌తో కనుమరుగు
  • అవి లేకపోతే మన కంచానికీ ముప్పే
  • బాల్కనీలో పూల కుండీ పెడితే మళ్లీ వాలుతయ్

హైదరాబాద్, వెలుగు: చిన్నప్పుడు పొలం గట్ల మీద రంగురంగుల సీతాకోకచిలుక కనిపిస్తే చాలు, దాని వెనకాలే పరుగులు. పట్టుకుందామని దగ్గరికెళ్తే తుర్రుమని ఎగిరిపోయేది. ఇంటి ముందు మందార, గన్నేరు చెట్ల చుట్టూ పదుల సంఖ్యలో తిరిగేవి. ఇప్పుడు ఆ దృశ్యం గుర్తుందా? చివరిసారి సీతాకోక చిలుకను ఎప్పుడు చూశారో ఒక్కసారి ఆలోచించండి! పల్లెల్లోనే కాదు, అడవుల్లోనూ ఈ రంగుల రెక్కల సందడి తగ్గిపోతోంది. గడిచిన పదేండ్లలో రాష్ట్రంలో సీతాకోకచిలుకల సంఖ్య 40 నుంచి 50 శాతం తగ్గిపోయిందని అటవీ శాఖ తాజా అధ్యయనంలో తేలింది. వీటిని కాపాడుకునేందుకు చర్యలు తీసుకోవాలని ప్రభుత్వానికి నివేదించింది.

మన దగ్గర 160 రకాలు

రాష్ట్రంలో దాదాపు 150 నుంచి 160 రకాల సీతాకోక చిలుకలను గుర్తించారు. అమ్రాబాద్, కవ్వాల్, పాకాల, ఏటూరునాగారం అడవులతో పాటు సిటీలోని కేబీఆర్ పార్క్, పోచారం, అనంతగిరి గుట్టలు వీటికి అడ్డాలు. పొలాల్లో ఎగిరే పసుపు రంగు ‘కామన్ గ్రాస్ ఎల్లో’, జిల్లేడు చెట్ల మీద వాలే పులి చారల ‘ప్లెయిన్ టైగర్’, నల్లటి రెక్కల మీద తెల్ల మచ్చలుండే ‘కామన్ మోర్మాన్’, నిమ్మ చెట్ల చుట్టూ తిరిగే ‘లైమ్ బటర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఫ్లై’.. ఇవన్నీ నిన్నమొన్నటి దాకా ఊరూరా కనిపించేవి. 

పంటలపై విచ్చలవిడిగా చల్లుతున్న పురుగుమందులకు సీతాకోకచిలుకల గుడ్లు, గొంగళి పురు గులు అక్కడికక్కడే చనిపోతున్నాయని నిపుణులు చెబుతున్నారు. అవి గుడ్లు పెట్టే జిల్లేడు, ఉత్తరేణి, తుమ్మ, అడవి గడ్డిని కలుపు మొక్కల పేరుతో పీకేస్తున్నాం. సిటీల్లో చెట్లు కొట్టేసి భవనాలు కడుతుండటం, పార్కుల్లో అందం కోసమే విదేశీ మొక్కలు పెంచుతుండటంతో వాటికి తేనె దొరకడం లేదు. పెరుగుతున్న ఎండలు, అకాల వానలు కూడా వాటి చిన్న జీవితాన్ని దెబ్బతీస్తున్నాయి.

పర్యావరణ థర్మామీటర్లు

సీతాకోకచిలుకలు అందం కోసమే కాదు. తేనెటీగల తర్వాత ఎక్కువగా పరపరాగ సంపర్కం చేసేవి ఇవేనని, మనం తినే కూరగాయలు, పండ్లు, పప్పులు, నూనెగింజల దిగుబడి వీటిపైనా ఆధారపడి ఉంటుందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. పక్షులు, కప్పలు, బల్లులకు వీటి గొంగళి పురుగులే ఆహారం. కాలుష్యం పెరిగితే మొదట తట్టుకోలేనివి ఇవే కాబట్టి వీటిని ‘పర్యావరణ థర్మామీటర్లు’ అంటారు.

కాళ్లతోనే రుచి చూస్తాయ్

సీతాకోకచిలుకలు కాళ్లతో రుచి చూస్తాయి! కాళ్లకు ఉండే సెన్సార్లతోనే ఆకు తినదగినదో కాదో, గుడ్లు పెట్టొచ్చో లేదో తెలుసుకుంటాయి. చాలా జాతులు బతికేది 20 నుంచి 40 రోజులే, కానీ ఆ కొద్ది రోజుల్లోనే వేల మొక్కల్లో పరాగ సంపర్కం చేస్తాయి. 

మళ్లీ రప్పిద్దాం ఇలా

హైదరాబాద్ సంజీవయ్య పార్కులోని బటర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఫ్లై గార్డెన్ తరహాలో అన్ని మున్సిపల్ పార్కుల్లో, పట్టణ ప్రకృతి వనాల్లో ప్రత్యేక తోటలు పెంచాలని నిపుణులు సూచిస్తున్నారు. రోడ్డు డివైడర్లలో విదేశీ మొక్కలకు బదులు గన్నేరు, నందివర్ధనం, నిమ్మ, కరివేపాకు, జిల్లేడు, మందార, సంపెంగ వంటి మన మొక్కలు నాటాలంటున్నారు. 

రైతులు సేంద్రియ సాగు వైపు మళ్లాలని, ఇంట్లో బాల్కనీలో తేనెనిచ్చే పూల కుండీలు పెడితే చాలు, సీతాకోకచిలుకలు మళ్లీ వస్తాయని చెబుతున్నారు. మహారాష్ట్ర ‘బ్లూ మోర్మాన్’ను, కర్నాటక ‘సదరన్ బర్డ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌వింగ్’ను రాష్ట్ర సీతాకోకచిలుకలుగా ప్రకటించి సంరక్షిస్తున్నాయని, మన రాష్ట్రమూ అలాంటి కార్యాచరణ చేపట్టాలని పర్యావరణ ప్రేమికులు కోరుతున్నారు.