అస్సాంలో బీజేపీ ఫస్ట్ లిస్టు విడుదల

అస్సాంలో బీజేపీ ఫస్ట్ లిస్టు విడుదల

    88 మంది అభ్యర్థులతో తొలి జాబితా

న్యూఢిల్లీ: అస్సాంలో అసెంబ్లీ ఎన్నికలు జరుగనున్న వేళ బీజేపీ పార్టీ 88 మంది అభ్యర్థులతో కూడిన తొలి జాబితాను గురువారం విడుదల చేసింది. సీఎం హిమంత బిశ్వ శర్మ వరుసగా ఆరోసారి జలుక్‌బారి నియోజకవర్గం నుంచి పోటీ చేయనున్నారు. గత ఐదు అసెంబ్లీ ఎన్నికల్లో జలుక్‌బారి నుంచి విజయం సాధించిన బిశ్వ శర్మ ఆ నియోజకవర్గాన్ని కంచుకోటగా మార్చుకున్నారు. ఇక బుధవారమే కాంగ్రెస్ నుంచి బీజేపీలో చేరిన కీలక నేత ప్రద్యుత్ బోర్డోలోయ్ పేరు కూడా ఈ జాబితాలో ఉంది.

ఇదివరకు నాగావ్ నియోజకవర్గం నుంచి పోటీ చేసిన ఆయన ఇప్పుడు గౌహతి లోక్‌సభ పరిధిలోని దిస్పూర్ అసెంబ్లీ స్థానం నుంచి పోటీ చేయనున్నారు. 32 ఏండ్ల పాటు కాంగ్రెస్​తో పనిచేసి పార్టీలో విభేదాల కారణంగా కొన్ని వారాల కింద రాజీనామా చేసి బీజేపీలో చేరిన కాంగ్రెస్ రాష్ట్ర మాజీ అధ్యక్షుడు భూపేన్ బోరా పేరు కూడా జాబితాలో ఉంది. గత రెండు ఎన్నికల్లో ఓడిపోయిన బిహ్పురియా స్థానం నుంచి ఈసారి బీజేపీ అభ్యర్థిగా పోటీ చేయనున్నారు.