- 5 కోఆప్షన్ పదవులు బీజేపీకే
- ఓటింగ్ కు కాంగ్రెస్ దూరం.
కరీంనగర్, వెలుగు: కరీంనగర్ మున్సిపల్ కార్పొరేషన్ లో ఐదు కో ఆప్షన్ పదవులను బీజేపీ కైవసం చేసుకుంది. బీజేపీ మద్దతుదారులకు నలుగురు బీఆర్ఎస్ కార్పొరేటర్లు జై కొట్టారు. బీజేపీకి 34 మంది సభ్యుల బలం ఉండగా.. నలుగురు బీఆర్ఎస్ కార్పొరేటర్లు తోడవ్వడంతో ఐదుగురు అభ్యర్థులకు 38 ఓట్ల చొప్పున వచ్చాయి. కాంగ్రెస్ కార్పొరేటర్లు ఓటింగ్ కు దూరంగా ఉన్నారు. ఎంఐఎం కార్పొరేటర్లు ఓటింగ్ కు హాజరైనా ఎవరికీ మద్దతివ్వలేదు. ఐదు కో ఆప్షన్ పదవులకు 45 మంది పోటీపడగా బీజేపీ మద్దతుదారులు కన్న కృష్ణ, చిగిరి వెంకటమ్మ, ఎలగందుల నందకుమార్, మైనారిటీ కోటాలో బల్బీర్ సింగ్, అఫీజాబేగం ఎన్నికయ్యారు. మేయర్ కొలగాని శ్రీనివాస్ ఆధ్వర్యంలో ప్రమాణ స్వీకారం చేశారు. గెలిచిన అభ్యర్థులకు మేయర్, డిప్యూటీ మేయర్ యాదగిరి సునీల్ రావు అభినందించారు.
మాజీలకు ఓటేయని బీఆర్ఎస్ కార్పొరేటర్లు
66 మంది కార్పొరేటర్లతో పాటు కరీంనగర్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్, మానకొండూర్ ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ, ఎంపీ బండి సంజయ్ ఓట్లతో కలిపి మొత్తం 69 ఓట్లు ఉన్నాయి. బీజేపీకి చెందిన 34 మంది , ముగ్గురు ఎంఐఎం, 10 మంది బీఆర్ఎస్ సభ్యులు మీటింగ్ కు హాజరయ్యారు. కాగా బీఆర్ఎస్ కు చెందిన 16 మంది మాజీ కార్పొరేటర్లు, మాజీ కౌన్సిలర్లు పోటీ చేయగా, 10 మంది కార్పొరేటర్లలో ఒక్కరూ ఓటు వేయలేదు.
ఫలించిన సంజయ్ వ్యూహం..
కో ఆప్షన్ ఎన్నికల్లో కేంద్ర మంత్రి బండి సంజయ్ వ్యూహం ఫలించింది. మంత్రి సూచనలను డిప్యూటీ మేయర్ సునీల్ రావు పక్కాగా అమలు చేశారు. బీఆర్ఎస్ కార్పొరేటర్ల మద్దతు కూడగట్టడంలో సక్సెస్ అయ్యారు. కాగా అభ్యర్థుల ఎంపికలోనూ కేంద్ర మంత్రి జాగ్రత్తలు తీసుకున్నారు. మైనార్టీ విభాగంలో పార్టీని నమ్ముకొని పని చేస్తున్న ముజీబ్ తల్లి అఫీజా బేగంకు ప్రాధాన్యమిచ్చారు.
మైనార్టీ విభాగంలో మరో సీటులో బల్బీర్ సింగ్ కు అవకాశమిచ్చారు. అలాగే బొమ్మకల్ లో ఉండడానికి సరైన ఇల్లు కూడా లేని ఎలగందుల నందన్ కుమార్ ను, ఎస్సీ మహిళా విభాగంలో చిగురు రవి తల్లి చిగురు వెంకటమ్మను ఎంపిక చేశారు. వైశ్య సామాజిక వర్గం నుంచి కన్న కృష్ణకు అవకాశమిచ్చారు.

