
రంగారెడ్డి కలెక్టరేట్, వెలుగు: జిల్లాలోని పోలింగ్ కేంద్రాల్లో అన్ని వసతులు ఉండేలా అధికారులు చర్యలు తీసుకోవాలని రంగారెడ్డి జిల్లా కలెక్టర్ భారతి హోళికేరి సూచించారు. శుక్రవారం కొంగరకలాన్‌లోని రంగారెడ్డి కలెక్టరేట్లోని సమావేశం మందిరంలో ఎన్నికల సెక్టోరల్ అధికారులతో ఆమె సమావేశమయ్యారు. కలెక్టర్ మాట్లాడుతూ.. పోలింగ్ జరిగే రోజున జిల్లాలోని 8 సెగ్మెంట్లలోని పోలింగ్ కేంద్రాల్లో ఓటర్లకు, అధికారులకు, సిబ్బందికి తాగునీరు, ఫర్నిచర్, ఇతర వసతులు ఉండేలా చూసుకోవాలన్నారు. ప్రతి పోలింగ్ కేంద్రంలో ర్యాంప్‌లను తప్పనిసరిగా ఏర్పాటు చేయాలన్నారు. సమావేశంలో జిల్లా డీఈవో సుశీందర్ రావు, సెక్టోరల్ అధికారులు పాల్గొన్నారు.
జిల్లాకు ఇద్దరు కేంద్ర ఎన్నికల పరిశీలకులు
అసెంబ్లీ ఎన్నికలను పర్యవేక్షించేందుకు కేంద్ర ఎన్నికల సంఘం జిల్లాకు వ్యయ పరిశీలకులను నియమించింది. రంగారెడ్డి జిల్లాలో కేంద్ర ఎన్నికల వ్యయ పరిశీలకులుగా వారణాసికి చెందిన ఐఆర్ఎస్ ప్రియరంజన్ శ్రీవాస్తవ, ఐఆర్ఎస్ వినోద్ కుమార్ అహిర్వార్ను కేంద్ర ఎన్నికల కమిషన్ నియమించిందని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ భారతి హోళికేరి తెలిపారు.