హైదరాబాద్, వెలుగు: తెలంగాణ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను ఉచితాలుగా చూడటం సరికాదని, అవి మానవ వనరుల వికాసానికి, రాష్ట్ర జీఎస్‌డీపీ వృద్ధికి దోహదపడే దీర్ఘకాలిక పెట్టుబడులని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అన్నారు. బుధవారం కేరళలోని కొచ్చిలో నిర్వహించిన ‘ఇండియా టుడే సౌత్ కాన్‌క్లేవ్’లో ఆయన మాట్లాడారు. పన్నుల పంపిణీలో దక్షిణాది రాష్ట్రాలకు జరుగుతున్న తీవ్ర అన్యాయాన్ని ఎండగట్టారు. జీఎస్టీ రూపంలో తెలంగాణ నుంచి కేంద్రానికి రూపాయి పన్ను వెళ్తుంటే రాష్ట్రానికి కేవలం 43 పైసలే తిరిగి వస్తున్నాయని.. అదే బీజేపీ పాలిత బిహార్‌కు ఏకంగా రెండు రూపాయలు ఇస్తున్నారని లెక్కలతో సహా వివరించారు.
డబుల్ ఇంజిన్ సర్కార్లకే ప్రాధాన్యమిస్తూ కేంద్రం సమాఖ్య స్ఫూర్తిని దెబ్బతీస్తోందన్నారు. వైఎస్సార్ తెచ్చిన ఫీజు రీయింబర్స్‌మెంట్ ద్వారానే హైదరాబాద్‌లో బలమైన టాలెంట్ పూల్ ఏర్పడిందని, ఉత్తమ మౌలిక వసతుల వల్లే ఏఐ, సెమీకండక్టర్ల రంగాల్లో గ్లోబల్ కంపెనీలకు తెలంగాణ అడ్డాగా మారిందన్నారు.
మళ్లీ బ్యాలెట్ పేపర్ల విధానం తేవాలి..
ఎన్నికల వ్యవస్థపై దేశ ప్రజల్లో విశ్వాసం సన్నగిల్లుతున్న తరుణంలో ఎన్నికల సంఘం తన నిష్పాక్షికతను నిరూపించుకోవాలని, ఇందుకు సీఈసీ జ్ఞానేశ్ కుమార్ తక్షణమే పదవికి రాజీనామా చేయాలని భట్టి డిమాండ్ చేశారు. స్వతంత్రంగా పనిచేయాల్సిన ఈసీని రాజకీయ అవసరాల కోసం వాడుకుంటున్నందుకు కేంద్ర ప్రభుత్వం దేశ ప్రజలకు క్షమాపణ చెప్పాలన్నారు. ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మళ్లీ బ్యాలెట్ పేపర్ల విధానాన్ని అమలు చేయాలని భట్టి స్పష్టం చేశారు. సోషల్ మీడియా ద్వారా ఓటర్ల రాజకీయ మొగ్గును విశ్లేషించి, కేంద్రీకృత పద్ధతిలో ఫారమ్-7 ద్వారా ప్రతిపక్ష మద్దతుదారుల ఓట్లను పథకం ప్రకారం తొలగిస్తున్నారని ఆయన ఆరోపించారు. ‘సర్’ పేరిట తన సొంత నియోజకవర్గంతో పాటు మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్ వంటి సీనియర్ నేతల ఓట్లను కూడా అనుమానాస్పదంగా మార్చారని చెప్పారు.
జగన్, మమత, శరద్ పవార్ తిరిగి రావాలి..
రాష్ట్ర ప్రభుత్వంలో సీఎం రేవంత్ రెడ్డితో కలిసి తాను100 శాతం సమన్వయంతో పని చేస్తున్నానని, తమ మధ్య ఎలాంటి విభేదాలు లేవని భట్టి విక్రమార్క తేల్చిచెప్పారు. ఇద్దరం నిరంతరం చర్చించుకుంటూ, ఆలోచనలు పంచుకుంటూ మంత్రివర్గ సహచరులతో కలిసి కాంగ్రెస్ సిద్ధాంతాలను పక్కాగా అమలు చేస్తున్నామని తెలిపారు. కాంగ్రెస్ పార్టీలో నాయకులను కుల ప్రాతిపదికన చూడరని, అధిష్ఠానం ప్రజాస్వామ్య పద్ధతిలో తీసుకునే నిర్ణయాలకు అందరం కట్టుబడి ఉంటామని దళిత సీఎం అనే ప్రశ్నకు బదులిచ్చారు. దేశ సమగ్రతను, అన్ని వర్గాలను ఐక్యంగా ఉంచే సత్తా కాంగ్రెస్ సిద్ధాంతానికే ఉందని స్పష్టం చేశారు. గతంలో పార్టీని వీడి వెళ్లిన వైఎస్ జగన్ మోహన్ రెడ్డి, మమతా బెనర్జీ, శరద్ పవార్ సహా పాత నాయకులంతా తిరిగి కాంగ్రెస్ గూటికి రావాలని పిలుపునిచ్చారు.
