- ట్రిపుల్ ఆర్కు ‘హడ్కో’ రుణం : డిప్యూటీ సీఎం భట్టి
- రూ. లక్ష కోట్లకు పైగా నిధులతో రాష్ట్రంలో రహదారుల నిర్మాణం
- ఎడ్యుకేషన్, హెల్త్‌కు అత్యధిక ప్రయారిటి: డిప్యూటీ సీఎం భట్టి
- వరి స్థానంలో పామ్ ఆయిల్, పప్పు ధాన్యాలు సాగుకు ప్రాధాన్యం
- విద్యార్థులు, టీచింగ్ స్టాఫ్ కు బయోమెట్రిక్ అమల్లోకి
- సెక్రటేరియెట్‌లో ప్రీ బడ్జెట్ రివ్యూ
హైదరాబాద్, వెలుగు: రాష్ట్ర ప్రభుత్వం విద్య, ఆరోగ్యానికి అత్యంత ప్రాధాన్యం ఇస్తుందని.. ఈ శాఖల కోసం ఎన్ని నిధులైన ఖర్చు చేసేందుకు వెనుకాడబోదని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క తెలిపారు. బుధవారం సెక్రటేరియెట్‌లో మైనారిటీ వెల్ఫేర్, బీసీ వెల్ఫేర్, రోడ్డు రవాణా, నీటిపారుదల శాఖ, సివిల్ సప్లయిస్, రోడ్లు భవనాలు, సినిమాటోగ్రఫీ శాఖలకు సంబంధించి డిప్యూటీ సీఎం ప్రీ బడ్జెట్ రివ్యూ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రాధాన్యతలను గుర్తించి బడ్జెట్ ప్రతిపాదనలు సిద్ధం చేయాలని అధికారులకు సూచించారు.
నియోజకవర్గ కేంద్రాల్లో అంబేద్కర్ నాలెడ్జ్ సెంటర్లు ప్రారంభించే ఆలోచనలో రాష్ట్ర ప్రభుత్వం ఉందని వివరించారు. దేశంలో, రాష్ట్రంలో అత్యుత్తమ టీచర్లను గుర్తించి హైదరాబాద్ నుంచి ఆన్ లైన్లో పాఠాలు బోధిస్తారని తెలిపారు. లోయర్ ట్యాంక్ బండ్, కాచిగూడ కేంద్రంలో ఎస్సీ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో ఉన్న స్థలాల్లో భవంతులు నిర్మించాలని మంత్రి అడ్లూరి లక్ష్మణ్ ప్రతిపాదించగా డిప్యూటీ సీఎం సానుకూలంగా స్పందించారు. సంక్షేమ వసతి గృహాలు, హాస్టళ్లలో మోడల్ కిచెన్లు ఏర్పాటు చేసే ఆలోచనను పరిశీలించాలని అధికారులకు డిప్యూటీ సీఎం సూచించారు.
వసతి గృహాలుపై సోలార్ పవర్
విద్యార్థులు, టీచింగ్ స్టాఫ్ కు బయోమెట్రిక్ విధానం అమలులోకి తేవాలని భట్టి ఆదేశించారు. వసతి గృహాలు, రెసిడెన్షియల్ బిల్డింగ్ లపై సోలార్ పవర్ ఏర్పాటుకు చర్యలు చేపట్టాలన్నారు. సోలార్ ద్వారా ఆదాయం సృష్టించుకోవచ్చని తెలిపారు.
ఈసారి బడ్జెట్ లో బీసీ లలో ఉపాధి అవకాశాలు మెరుగుపర్చడానికి వారి ఆర్థిక వృద్ధి సాధించడానికి ప్రత్యేక పథకాలు ప్రారంభించాలని కోరినట్టు బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. త్వరలోనే ఆర్టీసీ లో ప్రయాణించే మహిళలకు మహా లక్ష్మీ కార్డులను అందిస్తామని తెలిపారు.
ఏడాది పొడవునా కల్చరల్ యాక్టివిటీ
వరి సాగు పెద్ద ఎత్తున చేయడం, బాయిల్డ్ రైస్ ను తమిళనాడు వంటి రాష్ట్రాలు కొనుగోలు చేసే పరిస్థితి లేకపోవడం నేపథ్యంలో భవిష్యత్తులో రాష్ట్ర రైతాంగం ఇబ్బందులు ఎదుర్కొనే పరిస్థితి ఉన్న నేపథ్యంలో పంట మార్పిడికి అవకాశాలను పరిశీలించాలని నీటిపారుదల శాఖ సమావేశంలో మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి సూచించారు.
వరి స్థానంలో పామ్ ఆయిల్, పప్పు ధాన్యాలు సాగు చేస్తూ, పంట నిలువల సామర్థ్యాన్ని రాష్ట్రంలో పెంచాల్సిన అవసరం ఉందని డిప్యూటీ సీఎం తెలిపారు. లక్ష కోట్లకు పైగా నిధులతో రాష్ట్రంలో రహదారుల నిర్మాణం జరుగుతుందని భట్టి తెలిపారు. హ్యామ్, ట్రిపుల్ఆర్, హైదరాబాద్ =- విజయవాడ, ఫ్యూచర్ సిటీ నుంచి బందర్ పోర్టు, రావిర్యాల నుంచి శ్రీశైలం వరకు రహదారుల నిర్మాణం పనులు వివిధ దశలలో ఉన్నాయన్నారు.
రాష్ట్రంలో రీజినల్ రింగ్ రోడ్డు నిర్మాణానికి హడ్కో నుంచి రుణం తీసుకునేందుకు డిప్యూటీ సీఎం, ఆర్థిక శాఖ మంత్రి భట్టి విక్రమార్క ప్రీ బడ్జెట్ సమావేశంలో సంతకం చేసి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినందుకు మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి అభినందనలు తెలిపారు. రాష్ట్రంలో, ప్రధానంగా హైదరాబాద్ కేంద్రంలో సంవత్సరం పొడవునా కల్చరల్ యాక్టివిటీ కొనసాగేలా సినిమాటోగ్రఫీ శాఖలో ప్రణాళిక రూపొందించాలని డిప్యూటీ సీఎం ఆదేశించారు. ఈ సమావేశంలో వివిధ శాఖల ఉన్నతాధికారులు పాల్గొన్నారు.
