ఖమ్మం టౌన్, వెలుగు : వచ్చే విద్యా సంవత్సరానికి గురుకులాలు పూర్తిస్థాయిలో సిద్ధం కావాలని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క సూచించారు. ఖమ్మం కలెక్టరేట్ లో బుధవారం ఆయన కలెక్టర్ దివాకర, అడిషనల్ కలెక్టర్ పి.శ్రీజ, సీపీ సునీల్ దత్, ఇతర ఆఫీసర్లతో కలిసి గురుకుల, సంక్షేమ వసతి విద్యాసంస్థలపై సమీక్షించారు.సీట్లు పూర్తిగా భర్తీ కాని రెసిడెన్షియల్స్పై అధ్యయనం చేసి కారణాలు గుర్తించి సమస్య పరిష్కరించాలన్నారు. జూన్ 12 నుంచి స్కూల్స్ ప్రారంభంకానున్న నేపథ్యంలో అన్ని హాస్టళ్లు పూర్తిస్థాయిలో సిద్ధంగా ఉండాలని తెలిపారు.
ప్రస్తుతం నిర్మాణంలో ఉన్న 5 యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూల్ భవనాల పనులను వేగవంతం చేయాలన్నారు. ప్రాంతీయ సమన్వయకర్తలు 12 రోజుల్లో అన్ని పాఠశాలలను చెక్‌లిస్ట్ ప్రకారం పరిశీలించి సమగ్ర నివేదిక సమర్పించాలని ఆదేశించారు. విద్యా సంస్థలకు ఉచిత విద్యుత్ అందుతున్న నేపథ్యంలో సొంత భవనాల్లో కొనసాగుతున్న గురుకులాల్లో సోలార్ ప్యానెల్‌ల ఏర్పాటు కోసం కార్యాచరణ ప్రణాళిక సిద్ధం చేయాలన్నారు. అంతకుముందు జవహర్ లాల్ నెహ్రు వర్ధంతి సందర్భంగా ఖమ్మం కాంగ్రెస్ ఆఫీస్లో నెహ్రూ ఫొటోకు పూలమాల వేసి నివాళులర్పించారు.
