‘క్వాంటమ్‌‌‌‌ స్కేప్’ ప్రతినిధులతో భట్టి భేటీ

‘క్వాంటమ్‌‌‌‌ స్కేప్’ ప్రతినిధులతో భట్టి భేటీ
  •     అమెరికాలో సాలిడ్ - స్టేట్ బ్యాటరీ సాంకేతికతపై చర్చలు జరిపిన డిప్యూటీ సీఎం

హైదరాబాద్, వెలుగు: వేగంగా చార్జ్ అవుతూ, ఎక్కువ శక్తి నిల్వ సామర్థ్యం గల ‘సాలిడ్ -స్టేట్ లిథియం- మెటల్’ బ్యాటరీల సాంకేతికతపై డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క చర్చలు జరిపారు. అమెరికా పర్యటనలో భాగంగా భట్టి సోమవారం సాన్ జోస్‌‌‌‌లోని ప్రముఖ బ్యాటరీ సాంకేతిక సంస్థ ‘క్వాంటమ్‌‌‌‌ స్కేప్’ ప్రధాన కార్యాలయాన్ని సందర్శించారు. సంస్థ అధ్యక్షుడు, సీఈఓ డాక్టర్ శివ శివరామ్ తోపాటు కంపెనీ ఉన్నతాధికారులతో భేటీ అయ్యారు. బ్యాటరీ సాంకేతికతలు, గ్లోబల్ సప్లై చైన్ సిస్టం, పెట్టుబడుల అవకాశాలపై సుదీర్ఘంగా చర్చించారు. ప్రయోగశాల స్థాయి పరిశోధనలను వాణిజ్యపరంగా భారీ స్థాయిలో తీసుకెళ్లడంలో ఎదురవుతున్న సవాళ్లను, సంస్థ సాధించిన ప్రగతిని డాక్టర్ శివరామ్ డిప్యూటీ సీఎంకు వివరించారు. 

గ్లోబల్ సప్లై చైన్ – భవిష్యత్ మార్పులు, కీలక ఖనిజాల లభ్యత, అధునాతన విడిభాగాల తయారీ, సెల్ మ్యానుఫ్యాక్చరింగ్ అండ్​ ఎలక్ట్రిక్ వెహికిల్స్​ వినియోగంపై ఇరువురు తమ భిప్రాయాలు పంచుకున్నారు. తెలంగాణలో  వేగంగా విస్తరిస్తున్న ఎలక్ట్రిక్ మొబిలిటీ వ్యవస్థ, అత్యుత్తమ ఇంజనీరింగ్ ప్రతిభ, స్వచ్ఛ ఇంధన రంగానికి ప్రభుత్వం ఇస్తున్న ప్రోత్సాహాన్ని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ప్రస్తావించారు. ఆర్‌‌‌‌ అండ్ డీ విడిభాగాల తయారీ, భవిష్యత్​లో ఈ సాంకేతికతను భారత్‌‌‌‌లోనే లోకలైజేషన్​ చేసే దిశగా తెలంగాణలో విస్తరణ అవకాశాలను పరిశీలించాలని క్వాంటమ్‌‌‌‌ స్కేప్‌‌‌‌ ప్రతినిధులను ఆయన కోరారు.