
హైదరాబాద్, వెలుగు: తెలంగాణలో భట్టి విక్రమార్క చేపట్టిన పీపుల్స్ మార్చ్ పాదయాత్రకు ఏడాది పూర్తయింది. ఈ సందర్భంగా శనివారం హైదరాబాద్‌లోని మహాత్మా జ్యోతిరావు ఫూలే ప్రజా భవన్‌లో ‘పాదయాత్ర యాదిలో’సంబురాలు ఘనంగా జరిగాయి. కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ చేపట్టిన హాత్ సే హాత్ జోడో యాత్ర స్ఫూర్తితో భట్టి విక్రమార్క రాష్ట్రంలో ఈ పాదయాత్ర చేశారు. భట్టిని కలవడానికి రాష్ట్రవ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున ప్రజా భవన్‌కు తరలివచ్చారు. ఆదిలాబాద్ నుంచి ఖమ్మం వరకు సాగిన పాదయాత్ర విషయాలను, విశేషాలను ఈ సందర్భంగా గుర్తుచేసుకున్నారు. అనంతరం కార్యకర్తలు, నాయకులతో కలిసి భట్టి కేక్ కట్ చేసి అందరికి ధన్యవాదాలు తెలిపారు. ఈ సందర్భంగా పార్టీ శ్రేణులు ఆయనను ఘనంగా సన్మానించారు. వైరా ఎమ్మెల్యే మాలోతు రాందాసు నాయక్, మాజీ ఎమ్మెల్యే కేఎల్‌ఆర్, స్థానిక సంస్థల ఎమ్మెల్సీ అభ్యర్థి రాయల నాగేశ్వరరావు, పీసీసీ అధికార ప్రతినిధి లోకేశ్ యాదవ్, పార్టీ నాయకులు పాల్గొన్నారు.