కరోనా వైరస్ వ్యాప్తిని అరికట్టడంలో తెలంగాణ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందన్నారు సీఎల్పీ నేత భట్టి విక్రమార్క. కరోనా నియంత్రణ కోసం సీనియర్ ఐఏఎస్ లతో మానిటరింగ్ కమిటీ ఏర్పాటు చేయాలన్నారు. అంతేకాదు వెంటనే కరోనాను ఆరోగ్యశ్రీలో చేరాలని డిమాండ్ చేశారు. రాష్ట్రంలో కరోనా కేసులు పెరగడానికి అసలు కారణం కేసీఆరే అని ఆరోపించారు భట్టి. రాష్ట్రమంతటా అతలాకుతలం అవుతుంటే ప్రభుత్వం ఏ మాత్రం పట్టించుకోకుండా ప్రజలను గాలికొదిలేసరన్నారు. రాబోయే విపత్కర పరిస్థితులను అసెంబ్లీలో ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లినా కేసీఆర్ పట్టించుకోలేదని విమర్శించారు.
వరంగల్, ఖమ్మం జిల్లాల్లో ఎన్నికల తర్వాత భారీగా కేసులు, మరణాలు పెరిగాయన్నారు భట్టి . వ్యాక్సినేషన్, కరోనా టెస్టులు, ట్రీట్ మెంట్, బెడ్స్, ఆక్సిజన్ వంటివి మానిటరింగ్ చేసేలా కమిటీని ఏర్పాట్లు చేయాలని డిమాండ్ చేశారు. కొవిడ్ పరిస్థితులను ప్రజలు ఎప్పటికప్పుడు తెలుసుకునేందుకు ఢిల్లీ తరహాలో ఒక యాప్ ను కూడా అందుబాటులోకి తీసుకురావాలన్నారు.
గత ప్రభుత్వాలు మసూచీ, కలరా, పోలియో వంటివి రాకుండా ఉండేందుకు ఉచితంగా వ్యాక్సిన్లను వేయించాయన్నారు భట్టి. కరోనా వ్యాక్సినేషన్ విషయంలో తెలంగాణ ప్రభుత్వం పూర్తిగా విఫలమైంది. వ్యాక్సిన్ ల ధర విషయంలోనూ కేంద్రాన్ని రాష్ట్ర ప్రభుత్వం ప్రశ్నించడం లేదన్నారు.
