అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మధ్యప్రాచ్యంలో శాంతి స్థాపన కోసం సరికొత్త సంచలన వ్యూహాలను తెరపైకి తెస్తున్నారు. అందులో ప్రధానమైనది గాజాలో శాంతి పరిరక్షణ కోసం పాకిస్థాన్ సైన్యాన్ని మోహరించడం. ఈ ప్రతిపాదన వినడానికి ఈజీగా కనిపించినా.. పాక్ ఆర్మీ చీఫ్ జనరల్ అసిమ్ మునీర్‌కు ఇది ఒక అగ్నిపరీక్ష లాంటిదని అంతర్జాతీయ విశ్లేషకులు అంటున్నారు.
గాజాలో యుద్ధం ముగిసిన తర్వాత అక్కడ శాంతిని నెలకొల్పడానికి ఇజ్రాయెల్ సైన్యం ఉండకూడదని అరబ్ దేశాలు కోరుతున్నాయి. అదే సమయంలో పాలస్తీనా గ్రూపులను నమ్మడానికి ఇజ్రాయెల్ సిద్ధంగా లేదు. ఈ ప్రతిష్టంభనను తొలగించడానికి.. ఒక ముస్లిం మెజారిటీ దేశం, అందులోనూ న్యూక్లియర్ ఆయుధ శక్తి కలిగిన బలమైన సైన్యం ఉన్న పాకిస్థాన్‌ను అక్కడ మోహరించడం ద్వారా అటు అరబ్ దేశాలను, ఇటు ఇజ్రాయెల్‌ను సంతృప్తి పరచవచ్చని ట్రంప్ ప్లాన్ చేస్తున్నారు.
పాకిస్థాన్‌కు కలిగే లాభాలు..
పాకిస్థాన్ ప్రస్తుతం తీవ్ర ఆర్థిక సంక్షోభంలో ఉంది. అమెరికా కోరిక మేరకు గాజాకు తన సైన్యాన్ని పంపిస్తే ఎలాంటి ప్రయోజనాలు ఉంటాయో గమనిస్తే:
* ఆర్థిక ప్యాకేజీలు: అమెరికా నుండి భారీగా ఆర్థిక సాయం, ఐఎంఎఫ్ రుణాల విషయంలో వెసులుబాటు లభిస్తుంది.
* అంతర్జాతీయ గుర్తింపు: ఇస్లామిక్ ప్రపంచంలో పాకిస్థాన్ తన ప్రాముఖ్యతను మళ్లీ చాటుకునే అవకాశం దక్కుతుంది.
* అమెరికాతో సంబంధాలు: గత కొంతకాలంగా దెబ్బతిన్న పాక్-అమెరికా సంబంధాలు తిరిగి మెరుగుపడతాయి.
అయితే పాకిస్థాన్ కు లాభాల కంటే నష్టాలే ఎక్కువగా ఉండే అవకాశం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ముందుగా పాక్ ప్రజల్లో ఇజ్రాయెల్, అమెరికాపై తీవ్ర వ్యతిరేకత ఉంది. ఇజ్రాయెల్ ప్రయోజనాల కోసం పాక్ సైన్యం గాజాలో పనిచేస్తోందనే ప్రచారం జరిగితే దేశంలో అంతర్యుద్ధం వచ్చే ప్రమాదం ఉందని మునీర్ కూడా భయపడుతున్నట్లు సమాచారం. గాజాలో శాంతి స్థాపన పేరుతో హమాస్‌ను అణచివేయాలని చూస్తే.. అటు హమాస్ ఇటు ఇరాన్ పాకిస్థాన్‌ను శత్రువుగా చూస్తాయి. ఇది సరిహద్దుల్లో పాక్‌కు కొత్త తలనొప్పులు తెచ్చిపెడతాయి. గతంలో అఫ్గానిస్థాన్ అనుభవం దృష్ట్యా తెలియని భూభాగంలో గెరిల్లా పోరాటాన్ని ఎదుర్కోవడం పాక్ సైన్యానికి భారీ ప్రాణనష్టాన్ని మిగిల్చవచ్చని నిపుణులు అంటున్నారు.
అసిమ్ మునీర్ ముందున్న సవాలు..
పాక్ జనరల్ అసిమ్ మునీర్‌కు ఇది 'ముందు నుయ్యి వెనుక గొయ్యి' లాంటి పరిస్థితి. అమెరికాను కాదంటే ఆర్థిక సాయం అందదు. అలా అని చెప్పినదానికి సరేనంటే దేశీయంగా ఇమ్రాన్ ఖాన్ మద్దతుదారులు, మతపరమైన గ్రూపులు సైన్యంపై తిరగబడే అవకాశం ఉంది. ఈ క్రమంలో ట్రంప్ ప్రతిపాదనకు 'యెస్' చెప్పడం ద్వారా వచ్చే డాలర్ల కంటే.. దాని వల్ల దేశం చెల్లించాల్సిన రాజకీయ, సామాజిక మూల్యం చాలా ఎక్కువగా ఉంటుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. అయితే ఈ విషయంలో మునీర్ ఎలా ముందుకు సాగుతారన్నదే ప్రస్తుతం పెద్ద ప్రశ్న.
