ఖర్గే పేరుతో బీజేపీకి భయం

ఖర్గే పేరుతో బీజేపీకి భయం

హైదరాబాద్, వెలుగు: మహాత్మాగాంధీ స్వచ్ఛత, సమానత్వానికి ఎంతో ప్రాధాన్యతనిచ్చారు.. కానీ ప్రస్తుత కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల పాలన మాత్రం అందుకు అనుగుణంగా లేదని సీఎల్పీ నేత భట్టి విక్రమార్క అన్నారు. హైదరాబాద్​లో అనేక బస్తీలు అభివృద్ధికి దూరంగా ఉన్నాయని, త్వరలో సీఎల్పీ తరఫున బస్తీ పర్యటనలు చేపడతామని చెప్పారు. తొందరలోనే షెడ్యూల్ ఖరారు చేస్తామని తెలిపారు. ఆయన ఆదివారం ఆసెంబ్లీలోని మీడియా హాల్​లో మాట్లాడుతూ హైదరాబాద్ బస్తీ జనం కనీస సౌలత్​లు లేక, విద్య, వైద్యం అందని పరిస్థితుల్లో దుర్భరంగా బతుకుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. జాతిపిత గాంధీజీ స్వేచ్ఛ, స్వాతంత్ర్యం, సమానత్వం, సౌభ్రాతృత్వం, లౌకికవాదం గురించి ఉద్బోధించారని, దురదృష్టవశాత్తు కేంద్రంలో బీజేపీ, రాష్ట్రంలో టీఆర్ఎస్ ఇందుకు భిన్నమైన పాలన సాగిస్తున్నాయన్నారు. గాంధీని పూజిస్తున్నామని చెబుతున్న ఈ పాలకులు ఆయన ఆశయాలను ఒక్కటి కూడా అమలుపర్చడం లేదన్నారు.

ఏఐసీసీ అధ్యక్ష అభ్యర్థిగా మల్లికార్జున్ ఖర్గే పేరు తెర మీదకు రావడంతో బీజేపీలో భయం పట్టుకుందని భట్టి విక్రమార్క అన్నారు. దాంతో ఆయనను ఒక కులానికి పరిమిత చేసే ప్రయత్నం చేస్తున్నారన్నారు. అనుభవజ్ఞుడైన ఖర్గే కాంగ్రెస్ అధ్యక్ష పదవికి పోటీ పడడాన్ని స్వాగతిస్తున్నామన్నారు. శశిథరూర్ పోటీ నుంచి విరమించుకొని ఖర్గేకు మద్దతు పలికి అధ్యక్ష పదవి ఎంపికను ఏకగ్రీవం చేయాలని కోరారు.