కాంగ్రెస్​ ఫస్ట్ లిస్ట్​లో 50 మంది గెలిచెటోళ్లకే టికెట్లు: భట్టి విక్రమార్క

కాంగ్రెస్​ ఫస్ట్ లిస్ట్​లో 50 మంది  గెలిచెటోళ్లకే టికెట్లు: భట్టి విక్రమార్క
  •     ఢిల్లీలో కాంగ్రెస్ స్క్రీనింగ్ కమిటీ భేటీ 
  •     ఇయ్యాల మరోసారి సమావేశం

న్యూఢిల్లీ, వెలుగు: పార్టీ గెలుపే ప్రధాన అంశంగా అభ్యర్థుల ఎంపిక ఉంటుందని, ఫస్ట్ ఫేజ్​లో 50–55 స్థానాలకు అభ్యర్థుల ప్రకటన ఉంటుందని సీఎల్పీ నేత భట్టి విక్రమార్క తెలిపారు. బుధవారం ఢిల్లీలోని కాంగ్రెస్ వార్ రూమ్​లో తెలంగాణ అభ్యర్థుల ఎంపికపై స్క్రీనింగ్ కమిటీ భేటీ జరిగింది. అనంతరం యధుయాష్కీతో కలిసి భట్టి మీడియాతో మాట్లాడారు. స్క్రీనింగ్ కమిటీ సమావేశం మధ్యలో ఆగిందని, అయినప్పటికీ అభ్యర్థుల ఎంపికపై చాలా వరకు చర్చ జరిగిందని ఆయన చెప్పారు. ‘‘టికెట్ల కేటాయింపులో సర్వేలు, పార్టీతో అభ్యర్థులకు ఉన్న అనుబంధం రెండింటినీ పరిగణనలోకి తీసుకుంటాం. కాంగ్రెస్ సిద్ధాంతాలతో నడిచే వారిని వదులుకోం. అదే టైమ్​లో గెలిచే సత్తా ఉంటే కొత్త వారికి అవకాశం ఇస్తాం. టికెట్ రాని వారికి ఏదో విధంగా సర్దుబాటు చేస్తాం” అని భట్టి పేర్కొన్నారు. ఉత్తర తెలంగాణ నుంచి మొదలుపెట్టి, రాష్ట్రవ్యాప్తంగా బస్సు యాత్ర చేపట్టాలని నిర్ణయించామని వెల్లడించారు. యాత్ర ఎప్పుడు ప్రారంభించేది త్వరలోనే ప్రకటిస్తామని తెలిపారు. అందులో తాను, రేవంత్, ఇతర సీనియర్ నేతలు పాల్గొంటారని చెప్పారు. లెఫ్ట్ పార్టీలతో పొత్తు అంశం హైకమాండ్ చూసుకుంటుందన్నారు. అభ్యర్థుల ఎంపికలో సామాజిక సమతుల్యం పాటిస్తామని మధుయాష్కీ అన్నారు. 

మధ్యలోనే ఆగిన మీటింగ్.. 

కాంగ్రెస్ స్ర్కీనింగ్ కమిటీలో భేటీలో మాణిక్ రావ్ ఠాక్రే, జిగ్నేష్ మేవానీ, రేవంత్, భట్టి విక్రమార్క, మధుయాష్కీ గౌడ్, కోమటిరెడ్డి వెంకట్​రెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డి పాల్గొన్నారు. సాయంత్రం 7 గంటలకు మొదలైన సమావేశం.. దాదాపు 45 నిమిషాల పాటు సాగింది. అభ్యర్థుల ఎంపిక, బస్సుయాత్ర, ఎన్నికల వ్యూహాలు, ఇతర అంశాలపై చర్చించారు. అయితే ఇదే టైమ్​లో మహిళా రిజర్వేషన్ల బిల్లుపై పార్లమెంట్ లో ఓటింగ్ జరగడంతో కమిటీ చైర్మన్ కె.మురళీధరన్ అక్కడే ఉండిపోయారు. ఎంపీలు రేవంత్, ఉత్తమ్, కోమటిరెడ్డి మాత్రం కాంగ్రెస్ వార్ రూమ్ లో ఉన్నారు. తెలంగాణ కాంగ్రెస్ ఎంపీలు ఓటింగ్ కు దూరంగా ఉన్నారని బ్రేకింగ్ రావడంతో, ఉన్నపళంగా సమావేశం మధ్యలో నుంచి పార్లమెంట్ కు వెళ్లారు. దీంతో ముఖ్య నేతలు లేని కారణంగా గురువారం మరోసారి సమావేశం నిర్వహించాలని నిర్ణయించారు. కాగా, కోమటిరెడ్డి, మధుయాష్కీకి కొత్తగా కమిటీలో హైకమాండ్ చోటు కల్పించిందని భట్టి వెల్లడించారు. 

షర్మిల పార్టీ విలీనంపై తెలీదు: ఠాక్రే 

కాంగ్రెస్​లో వైఎస్సార్​టీపీ విలీనంపై తన దగ్గర ఎలాంటి సమాచారం లేదని పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్​చార్జ్ మాణిక్ రావ్ ఠాక్రే తెలిపారు. బుధవారం ఏఐసీసీ హెడ్ క్వార్టర్స్​లో ఠాక్రేతో రేవంత్, భట్టి, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, రాంరెడ్డి దామోదర్ రెడ్డి, జి.వినోద్ సమావేశమయ్యారు. ఈ భేటీలో ఉమ్మడి ఖమ్మం, నల్గొండ జిల్లాల్లోని కొన్ని స్థానాల్లో అభ్యర్థుల ఎంపికపై చర్చించారు. అనంతరం ఠాక్రే మీడియాతో మాట్లాడుతూ.. షర్మిల కాంగ్రెస్​లో చేరే అంశం తన దృష్టికి రాలేదన్నారు.