- ఇప్పుడు మొసలి కన్నీళ్లు ఎందుకు ?
- తమపై ఎదురుదాడి చేస్తామంటే చూస్తూ ఊరుకోమని హెచ్చరిక
హైదరాబాద్, వెలుగు: పదేండ్లు సింగరేణి విస్తరణను పట్టించుకోకుండా, కొత్త బొగ్గు బ్లాకులు రాకుండా చేసినవారే.. ఇప్పుడు సంస్థకు నష్టం జరుగుతోందంటూ విమర్శించడం విడ్డూరంగా ఉందని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అన్నారు. 40 లక్షల టన్నుల బొగ్గు మాయమైందని, సంస్థకు భవిష్యత్తు లేదని ప్రచారం చేసేవారు గతంలో ఏం చేశారో సమాధానం చెప్పాలని ప్రశ్నించారు. తమపై ఎదురుదాడి చేస్తామంటే చూస్తూ ఊరుకోమని హెచ్చరించారు.
సింగరేణిని కాపాడేందుకు తమ ప్రభుత్వం కొత్త గనుల అభివృద్ధికి చర్యలు తీసుకుంటోందని స్పష్టం చేశారు. హైదరాబాద్‌లోని ప్రజాభవన్‌లో ఆదివారం సింగరేణి కాలరీస్‌కు చెందిన 66 మంది జనరల్ మేనేజర్లతో నిర్వహించిన ప్రత్యక్ష ఇంటరాక్షన్ కార్యక్రమంలో డిప్యూటీ సీఎం మాట్లాడారు. సింగరేణి సీఎండీ డాక్టర్ బుద్ధ ప్రకాష్ జ్యోతి అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో సంస్థ పనితీరు, బొగ్గు ఉత్పత్తి, రవాణా, కొత్త గనుల అభివృద్ధి, భవిష్యత్తు విస్తరణ, ఉత్పత్తి వ్యయ నియంత్రణ తదితర అంశాలపై సమగ్రంగా చర్చించారు.
పదేండ్లు అధికారంలో ఉన్న పార్టీ నాయకులే సింగరేణికి కొత్త బొగ్గు బ్లాకులు రాకుండా అడ్డుపడ్డారని విమర్శించారు. 42 వేల మంది శాశ్వత ఉద్యోగులు, మరో 36 వేల మంది కాంట్రాక్టు, ఔట్‌సోర్సింగ్ సిబ్బంది ఆధారపడిన సంస్థను కాపాడటం ప్రభుత్వ బాధ్యతని పేర్కొన్నారు. గతంలో కేటాయించిన బ్లాకులను మళ్లీ వేలం వేయాల్సిన పరిస్థితి ఏర్పడిందని తెలిపారు. ఈ అంశంపై కేంద్ర బొగ్గు మంత్రిత్వ శాఖ అధికారులతో చర్చించామని, సింగరేణి భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని జనరల్ మేనేజర్లు, కార్మిక సంఘాలతో సంప్రదించిన తర్వాతే కీలక నిర్ణయాలు తీసుకున్నామని చెప్పారు.
కొత్త గనులను అభివృద్ధి చేస్తం
సింగరేణి సంస్థను బలోపేతం చేసి, భవిష్యత్తు తరాలకు ఉపాధి భద్రత కల్పించేలా సమగ్ర కార్యాచరణ ప్రణాళికతో ముందుకు సాగాలని భట్టి విక్రమార్క సూచించారు. బొగ్గు ఉత్పత్తి వ్యయం తగ్గించడం, ఉత్పాదకత పెంచడం, కొత్త గనులను అభివృద్ధి చేయడంతోపాటు కీలక ఖనిజాల అన్వేషణలోకి విస్తరించాలని అధికారులకు దిశానిర్దేశం చేశారు.
అవసరమైన బొగ్గు కేటాయింపులు లేకుండానే విద్యుత్ ప్రాజెక్టులకు సరఫరా బాధ్యతలను సింగరేణిపై వేయడం వల్ల సమస్యలు తలెత్తాయని వివరించారు. బొగ్గు సరఫరాపై సంస్థను విమర్శించడం సరికాదన్నారు. ఈ సందర్భంగా 2023 డిసెంబర్ నుంచి ఇప్పటివరకు సాధించిన ప్రగతి నివేదికను ప్రదర్శించారు. అలాగే సంస్థ సాధించిన ప్రగతి, చేపడుతున్న కార్యక్రమాలను అధికారులు వీడియో రూపంలో ప్రదర్శించారు
