ఈఎన్సీ మురళీధర్​ బీఆర్ఎస్ ఏజెంట్: భట్టి

ఈఎన్సీ మురళీధర్​ బీఆర్ఎస్ ఏజెంట్:  భట్టి

హైదరాబాద్, వెలుగు :  రాయలసీమ లిఫ్ట్​ స్కీం టెండర్లు పూర్తయి, ఆ ప్రాజెక్టు నిర్మాణం చేపట్టేలా సహకరించేందుకే కేసీఆర్​ కేంద్రం పిలిచినా అపెక్స్​ కౌన్సిల్​సమావేశానికి వెళ్లలేదని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అన్నారు. రాయలసీమ ఎత్తిపోతలను తాము అడ్డుకున్నామని ఇరిగేషన్ ​మాజీ మంత్రి హరీశ్​రావు సోమవారం అసెంబ్లీలో చెప్పడంతో భట్టి జోక్యం చేసుకున్నారు. 

కేంద్రం 2020 ఆగస్టు 5న అపెక్స్​ కౌన్సిల్​సమావేశానికి రావాలని లేఖ రాస్తే ఆ రోజు ముందే నిర్ణయించిన కార్యక్రమాలు ఉన్నందున 20వ తేదీ తర్వాత మీటింగ్​ఏర్పాటు చేయాలని కోరుతూ కేంద్రానికి లేఖ రాశారని తెలిపారు. అదే నెల పదో తేదీన రాయలసీమ టెండర్లు పూర్తయితే 20వ తేదీ తర్వాత మీటింగ్​పెట్టాలని కోరడం అంటే ఆ ప్రాజెక్టుకు సహకరించడమే కదా అన్నారు. కృష్ణా నీళ్లలో హక్కులు సాధించుకోవడం కన్నా తెలంగాణ ముఖ్యమంత్రికి ఇంకా ఇంపార్టెంట్​పనులు ఏముంటాయని ప్రశ్నించారు. 

ఈఎన్సీ మురళీధర్​ బీఆర్ఎస్​ ఏజెంట్​అని.. ఆయనతో తమ ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడించారని తెలిపారు. ఆయన కాంగ్రెస్​ ప్రభుత్వ ఆదేశాలు పాటించడం కన్నా తెరవెనుక బీఆర్ఎస్ ముఖ్యనేతలు చెప్పినట్టు పని చేస్తూ తమ ప్రభుత్వాన్ని అప్రతిష్ట పాలు చేసేందుకు కుట్ర చేశారన్నారు. అందుకే ఆయన తట్టాబుట్టా సర్దుకొని వెళ్లిపోయేలా చేశామన్నారు. ఇంకా ప్రభుత్వంలో మీ ఏజెంట్లు చాలా మంది ఉన్నరని.. వాళ్లు రాష్ట్రానికి ఎంతో నష్టం చేస్తున్నరని.. వాళ్లందరినీ ఇంటికి పంపిస్తామన్నారు. కేఆర్ఎంబీకి ప్రాజెక్టులు అప్పగించేది లేదని సీఎం, ఇరిగేషన్ ​శాఖ మంత్రి సభలో చెప్తున్నారని, దానిపైనే తీర్మానం ప్రవేశ పెట్టామని తెలిపారు. ఈ తీర్మానానికి బీఆర్ఎస్​మద్దతు తెలుపుతుందో లేదా చెప్పాలన్నారు.