
హైదరాబాద్, వెలుగు: అధికారంలోకి రాగానే ఇచ్చిన మాట ప్రకారం ఉచిత కరెంట్ ఫైల్‌పై సంతకం చేసిన లీడర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి అని సీఎల్పీ నేత భట్టి విక్రమార్క అన్నారు. ‘రైతులకు ఫ్రీ కరెంట్.. కాంగ్రెస్ పార్టీకే పేటెంట్’ అని అన్నారు. శనివారం వైఎస్ వర్ధంతి సందర్భంగా హైదరాబాద్ పంజాగుట్ట సర్కిల్ లోని వైఎస్ విగ్రహానికి, గాంధీభవన్, సీఎల్పీలో వైఎస్ చిత్రపటానికి నివాళులర్పించారు. అనంతరం మాట్లాడుతూ.. ఫ్రీ కరెంట్గురించి మాట్లడే అర్హత ఇతర ఏ పార్టీకీ లేదన్నారు.
పేదలు గుడిసెల్లో ఉండొద్దన్న ఉద్దేశంతో ఇందిరమ్మ పథకం పేరిట ఇండ్లు కట్టించిన ఘనత వైఎస్ సొంతమన్నారు. కానీ, బీఆర్ఎస్ సర్కారు డబుల్ బెడ్రూమ్ ఇండ్లంటూ మాయమాటలు చెప్పి ఇందిరమ్మ ఇండ్లు లేకుండా చేసిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. వైఎస్ ప్రారంభించిన ఇందిర రాజీవ్ సాగర్, ప్రాణహిత ప్రాజెక్టులను బీఆర్ఎస్ సర్కారు పూర్తి చేసుంటే 24 లక్షల ఎకరాలకు సాగునీరందేదన్నారు. మహిళల కోసం వైఎస్ తెచ్చిన పావలా వడ్డీ రుణ పథకాన్నీ బీఆర్ఎస్ సర్కార్ అటకెక్కించిందన్నారు.
ఫీజు రీయింబర్స్మెంట్, ఆరోగ్య శ్రీ వంటి గొప్ప పథకాలు పేదలకు ఉపయోగపడ్డాయన్నారు. ప్రతి తెలుగు వ్యక్తి వైఎస్‌కు నివాళులర్పిస్తున్నారని, ప్రభుత్వ ఫలాలు ప్రజలకు అందజేయాలన్న తపనే ఆయన్ను అందరూ అభిమానించేలా చేసిందని సీడబ్ల్యూసీ మెంబర్ రఘువీరా రెడ్డి అన్నారు. మాజీ ఎంపీ కేవీపీ రామచంద్రరావు, ఏపీసీసీ చీఫ్ గిడుగు రుద్రరాజు, ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి, పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ మహేశ్ కుమార్ గౌడ్ పాల్గొన్నారు.