- జిల్లాలో ఉత్సాహంగా క్రికేట్, వాలీబాల్, కబడ్డీ ఆటలు
- మున్సిపాలిటీల పరిధిలోని గ్రామాల్లో సైతం
వెలుగు, నెట్వర్క్ : ఉమ్మడి నిజామాబాద్, కామారెడ్డి జిల్లాల్లో భోగి సంబరాలు, ముందస్తు సంక్రాంతి వేడుకలు అంబరాన్నంటాయి. భోగి మంటలు, ఆధ్యాత్మిక పూజలు, ఆటపాటలతో పండుగ వాతావరణం నెలకొంది. రంగురంగుల ముగ్గులు, డూడూ బసవన్నల విన్యాసాలు, పిండివంటల ఘుమఘుమలతో పల్లెలు, పట్టణాలు కొత్తకళను సంతరించుకున్నాయి. బుధవారం భోగి మంటలతో ప్రారంభమైన ఈ వేడుకల్లో భాగంగా జిల్లాలోని ప్రతి గ్రామంలో క్రీడా పోటీల్లో యువత ఉత్సాహంగా పాల్గొంటున్నారు.
పండుగ సెలవులకు సొంతూళ్లకు చేరుకున్న ఉద్యోగులు, విద్యార్థులతో గ్రామాలు కిక్కిరిసిపోయాయి. తాడ్వాయి, సదాశివనగర్, బాన్సువాడ, ఎల్లారెడ్డి సహా అన్ని మండలాల్లో యువజన సంఘాలు, ఉద్యోగులు క్రీడలను నిర్వహిస్తున్నారు. రాబోయే ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని రాజకీయ నాయకులు, స్థానిక ప్రజాప్రతినిధులు స్పాన్సర్లుగా వ్యవహరిస్తూ పోటీలు నిర్వహిస్తున్నారు. కొన్నిచోట్ల దివంగత యువజన నేతల జ్ఞాపకార్థం స్మారక పోటీలు నిర్వహిస్తుండటం విశేషం.
రెండు రోజుల పాటు సాగిన క్రికెట్ టోర్నమెంట్లలో విజేతలకు నగదు బహుమతులు, షీల్డులతో పాటు బెస్ట్ బ్యాటర్, బౌలర్లకు ప్రత్యేక బహుమతులు అందజేస్తున్నారు. మహిళల కోసం ప్రత్యేకంగా రంగవల్లుల పోటీలు నిర్వహిస్తున్నారు. ప్రతి గ్రామంలో సుమారు 10 నుంచి 15 వేల రూపాయల వ్యయంతో పలు రకాల పోటీలు నిర్వహిస్తున్నారు.
పూజలు.. భోగి మంటలు..
ఆర్మూర్‌లోని అయ్యప్ప మందిర ఆవరణలో పండుగ సందర్భంగా గణపతి హోమం భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. అటు బాన్సువాడ నియోజకవర్గంలోని బీర్కూర్‌లో ప్రజలు ఉత్సాహంగా భోగి మంటలు వేసి సంక్రాంతి వేడుకలను ప్రారంభించారు. కామారెడ్డి జిల్లా పోలీస్ కార్యాలయంలో ఎస్పీ రాజేష్ చంద్ర, అడిషనల్ ఎస్పీ నరసింహారెడ్డి, ఏఎస్పీ చైతన్యారెడ్డి భోగి మంటలు వెలిగించి వేడుకల్లో పాల్గొన్నారు. పోలీసు అధికారులు, సిబ్బంది తమ కుటుంబ సభ్యులతో కలిసి ఈ సంబరాల్లో పాలుపంచుకున్నారు.
అనంతరం ఎస్పీ రాజేష్ చంద్ర స్వయంగా గాలిపటాలు ఎగురవేసి అందరినీ ఉత్సాహపరిచారు. బెల్లాల్ గ్రామంలో మహిళలకు ముగ్గుల పోటీలు నిర్వహించి విజేతలకు బహుమతులు అందజేశారు. బీర్కూర్ మండలం రైతు నగర్‌లో చిన్నారులు సంప్రదాయ ఆటలతో అలరించారు. టెకిర్యాల్‌లో వాలీబాల్, రామారెడ్డి మండలంలో క్రికెట్ పోటీలు నిర్వహించగా, యువత భారీ సంఖ్యలో పాల్గొని తమ నైపుణ్యాన్ని ప్రదర్శించారు.
