
- భూ భారతి పోర్టల్‌కు సర్వే మ్యాప్‌ను లింక్ చేసేలా ఏర్పాట్లు
- అధికారులతో సమావేశంలో మంత్రి పొంగులేటి వెల్లడి
హైదరాబాద్, వెలుగు: ప్రజలకు మెరుగైన సేవలు అందించేందుకు రెవెన్యూ, స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్, సర్వే విభాగాలను అనుసంధానం చేస్తూ ఒకే సాఫ్ట్‌వేర్‌ను రూపొందిస్తున్నామని రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తెలిపారు. రిజిస్ట్రేషన్లకు సర్వే మ్యాప్‌ను జతచేయాలని 'భూ భారతి' చట్టం నిర్దేశించిందని, దీనిని దృష్టిలో పెట్టుకొని భూ భారతి పోర్టల్‌కు సర్వే మ్యాప్‌ను లింక్ చేసేలా ఈ సాఫ్ట్‌వేర్‌ను అభివృద్ధి చేస్తున్నామని చెప్పారు. సోమవారం సెక్రటేరియెట్‌లో రెవెన్యూ, రిజిస్ట్రేషన్, సర్వే విభాగాలతో పాటు ఎన్ఐసీ అధికారులతో మంత్రి సమీక్షా సమావేశం నిర్వహించారు.
మంత్రి మాట్లాడుతూ భూ భారతి పోర్టల్‌లో ఎలాంటి సాంకేతిక సమస్యలు రాకుండా నిర్వహణను సులభతరం చేయాలన్నారు. కొత్తగా అభివృద్ధి చేసే సాఫ్ట్‌వేర్‌లో కోర్టు కేసుల మానిటరింగ్ వ్యవస్థ ఉండేలా చూడాలన్నారు. అలాగే, నక్షాలు లేని ఐదు గ్రామాల్లో రీ-సర్వే పూర్తయిన నేపథ్యంలో, మిగిలిన 408 గ్రామాల్లో త్వరలోనే రీ-సర్వే ప్రారంభిస్తామని మంత్రి తెలిపారు.