భూ భారతి సర్వర్ మొరాయింపు..రాష్ట్రవ్యాప్తంగా నిలిచిన రిజిస్ట్రేషన్లు

భూ భారతి సర్వర్ మొరాయింపు..రాష్ట్రవ్యాప్తంగా నిలిచిన రిజిస్ట్రేషన్లు
  • తహసీల్దార్ కార్యాలయాల వద్ద జనం బారులు

హైదరాబాద్, వెలుగు:  రాష్ట్రవ్యాప్తంగా సోమవారం భూముల రిజిస్ట్రేషన్లు  నిలిచిపోయాయి. భూ రికార్డుల నిర్వహణకు సంబంధించిన భూ భారతి పోర్టల్​ సర్వర్ మొరాయించడంతో రాష్ట్రంలోని అన్ని తహసీల్దార్ కార్యాలయాల్లో (జాయింట్ సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలు) రిజిస్ట్రేషన్ ప్రక్రియ నిలిచిపోయింది. దీంతో ఉదయం నుంచే రిజిస్ట్రేషన్ల కోసం కార్యాలయాలకు చేరుకున్న ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొన్నారు.

స్టేట్ డేటా సెంటర్‌‌లో చేసిన అప్‌‌డేట్ కారణంగా భూ భారతి పోర్టల్‌‌లో రిజిస్ట్రేషన్లకు అంతరాయం ఏర్పడిందని సమాచారం. వివిధ మార్పులు, చేర్పులు చేస్తుండటంతో సర్వర్ సమస్య ఏర్పడినట్టు తెలుస్తున్నది. ఎన్ఐసీకి ముందస్తు సమాచారం ఇవ్వకుండా స్టేట్​ డేటా సెంటర్​లో చేసిన టెక్నికల్​ ఇష్యూతో రిజిస్ట్రేషన్ల ప్రక్రియకు ఇబ్బంది ఏర్పడింది.  దీంతో ఉదయం నుంచి సాయంత్రం దాకా తీవ్రమైన ఎండలోనూ ప్రజలు రిజిస్ట్రేషన్ల కోసం తహసీల్దార్ కార్యాలయాల వద్ద పడిగాపులు కాశారు. 

గంటల తరబడి వేచి ఉన్నప్పటికీ రిజిస్ట్రేషన్లు కాకపోవడంతో వారు అసహనానికి గురయ్యారు. సంగారెడ్డి జిల్లా ఝరాసంగం మండలంలో పరిస్థితి మరింత దారుణంగా ఉంది. అక్కడ సోమవారం 25 రిజిస్ట్రేషన్ స్లాట్లు బుక్ కాగా, ఒక్క రిజిస్ట్రేషన్ కూడా జరగలేదు. ఈ విషయంపై అధికారులు స్పందిస్తూ.. సర్వర్ సమస్యను పరిష్కరించామని తెలిపారు. మంగళవారం నుంచి రాష్ట్రవ్యాప్తంగా రిజిస్ట్రేషన్లు యధావిధిగా కొనసాగుతాయని చెప్పారు.