ముగిసిన ఈఎన్సీ హరిరాం ఏసీబీ కస్టడీ

ముగిసిన ఈఎన్సీ హరిరాం ఏసీబీ కస్టడీ
  • మళ్లీ చంచల్‌‌‌‌‌‌‌‌గూడ జైలుకు తరలింపు

హైదరాబాద్, వెలుగు: ఆదాయానికి మించిన అక్రమ ఆస్తుల కేసులో కాళేశ్వరం ప్రాజెక్టు ఇంజినీర్ -ఇన్ -చీఫ్ భూక్యా హరిరాంకు విధించిన 5 రోజుల ఏసీబీ కస్టడీ మంగళవారంతో ముగిసింది. ఈ నెల 2 నుంచి 6 వర కు హరిరాంను కస్టడీలో ఉంచి విచారించేందుకు ఏసీబీ అధికారులకు నాంపల్లి కోర్టు ఇటీవల అనుమతిచ్చింది. ఈ  నేపథ్యంలో హరిరాంను చంచల్‌‌‌‌‌‌‌‌గూడ జైలు నుంచి కస్టడీలోకి తీసుకుని, బంజారాహిల్స్‌‌‌‌‌‌‌‌లోని ఏసీబీ ఆఫీస్​కు తరలించారు. 5 రోజుల పాటు హైదరాబాద్‌‌‌‌‌‌‌‌లోని షేక్‌‌‌‌‌‌‌‌పేట, కొండాపూర్, శ్రీనగర్, నార్సింగి, మాదాపూర్‌‌‌‌‌‌‌‌లలో ఆయనకు చెందిన విల్లాలు, ప్లాట్లు, అమరావతిలో వాణిజ్య స్థలం, సిద్దిపేటలో 28 ఎకరాల వ్యవసాయ భూమి, బొమ్మల రామారంలో 6 ఎకరాల ఫామ్‌‌‌‌‌‌‌‌హౌస్‌‌‌‌‌‌‌‌తో సహా రూ. 200 కోట్ల విలువైన అక్రమ ఆస్తుల గురించి ప్రశ్నించారు.

 సోమవారం హరిరాం బ్యాంకు లాకర్లను తెరిచి తనిఖీ చేసిన ఏసీబీ అధికారులు.. బంగారు ఆభరణాలు, బ్యాంకు డిపాజిట్ల వివరాలను సేకరించారు. హరిరాంకు చెందిన మరికొన్ని ఆస్తులు బినామీల పేరిట ఉండొచ్చని ఏసీబీ అధికారులు అనుమానిస్తున్నారు. మంగళవారంతో కస్టడీ ముగియడంతో బంజారాహిల్స్‌‌‌‌‌‌‌‌ ఏసీబీ కేంద్ర కార్యాలయం నుంచి హరిరాంను మళ్లీ చంచల్‌‌‌‌‌‌‌‌గూడ జైలుకు తరలించారు. అయితే, మరికొంత కీలక సమాచారం రాబట్టేందకు ఆయనను మరోసారి కస్టడీకి అప్పగించాలని కోర్టును కోరే అవకాశం ఉన్నట్టు సమాచారం.