భగాయత్ ప్లాట్ల వాయిదాలు చెల్లించట్లే

భగాయత్ ప్లాట్ల వాయిదాలు చెల్లించట్లే
  • ప్లాట్లను కొన్న బిడ్డర్లు వాయిదాలు చెల్లించట్లే
  • రెండు సార్లు గడువు పెంచినా స్పందనలేదు 
  • హెచ్​ఎండీఏకు రూ. 50 కోట్ల వరకు పెండింగ్​

హైదరాబాద్, వెలుగు: ఉప్పల్ భగాయత్​లో హెచ్​ఎండీఏ అమ్మిన ప్లాట్లకు బకాయిలు వస్తలేవు. కొన్నవారు గతేడాది  కరోనా, లాక్ డౌన్ నుంచి చెల్లించట్లేదు. బిడ్డింగ్ లో ప్లాటు దక్కించుకుంటే ఏడాది లోపు కిస్తీలుగా చెల్లించాలనే నిబంధన ఉంది.  అయిన ఆఖరు దశలోని  చెల్లింపులే ఆగిపోయినట్లు హెచ్ఎండీఏ వర్గాలు చెబుతున్నాయి. మరోసారి గడువు పెంచుతరా? లేదా రూల్స్​ ప్రకారం వడ్డీతో కలిపి వసూలు చేస్తరా..? అనేది దానిపై స్పష్టత లేదు. రెండేళ్ల కిందట హెచ్ఎండీఏ ఉప్పల్​లోని భగాయత్​ భూములను ప్లాట్లుగా చేసి ఈ– వేలం ద్వారా  అమ్మింది. 2019 డిసెంబర్ లో   రెండు సార్లు వేలం వేసింది. మొదటిసారి 67  , రెండోసారి 127 ప్లాట్లను విక్రయించింది. దీంతో వెయ్యి కోట్ల ఆదాయం వచ్చింది. అయితే కొనుగోలు చేసిన వారి నుంచి బకాయిలు ఆగిపోయాయి. కరోనా తర్వాత ప్లాట్ల ఓనర్లు కట్టకపోతుండగా  దాదాపు రూ. 50 కోట్ల వరకు పెండింగ్  ఉన్నాయని తెలిసింది. 

రెండు సార్లు గడువు ఇచ్చినా..
ప్లాట్లు దక్కించుకున్న బిడ్డర్లు వాయిదాలు  2020 డిసెంబర్ 31లోపు చెల్లించాల్సి ఉంది. కరోనా కారణంగా రియల్ బిజినెస్​కు బ్రేక్​లు పడ్డా యి. దీంతో కట్టడం లేదు.   పరిస్థితిని చూసి హెచ్​ఎండీఏ రెండు సార్లు గడువు పెంచింది. ఈ ఏడాది మార్చి 31 వరకు ఒకసారి పొడిగించింది. అయినా పేమెంట్లు రాకపోవడంతో  రెండోసారి జూన్ వరకు అవకాశమిచ్చింది. అయినా బిడ్డర్ల నుంచి ఎలాంటి స్పందన ఉండడం లేదు.  డీ ఫాల్టర్లుగా ఉన్న 28 మంది బిడ్డర్లపై హెచ్ఎండీఏ ఎలా  చర్యలు తీసుకుంటుందనేది చర్చనీయాంశంగా మారింది. మరోవైపు వాయిదాలు సకాలంలో కట్టకపోవడంతో బిల్లుల భారం హెచ్​ఎండీపైనే పడింది. 

నోటీసులు ఇస్తరా.. లేక.. 
గడువు మరోసారి పెంచినా బిడ్డర్ల నుంచి స్పందన లేదు. బకాయి పడిన మొత్తానికి 15శాతం వడ్డీతో హెచ్ఎండీఏ వసూలు చేయాలనే నిబంధన ఉంది. పెండింగ్​పడిన 28 మంది బిడ్డర్లకు నోటీసులు ఇస్తారా లేదా మరోసారి గడువు పెంచుతారా.. అనేది హెచ్ఎండీఏ ఉన్నతాధికారులు నిర్ణయించాల్సి ఉంది.  రెండుసార్లు జరిగిన ఈ - వేలంలో ప్లాట్లు కొన్నవారిలో 8 మంది రెండోసారి కూడా ప్లాట్లు దక్కించుకున్నట్టు తెలిసింది.