అమరావతి: పాస్ పోర్టు ఇష్యూలో వైసీపీ అధినేత, ఏపీ మాజీ సీఎం వైఎస్ జగన్కు హైకోర్టులో భారీ ఊరట దక్కింది. జగన్ పాస్ పోర్టును ఐదేళ్ల పాటు రెన్యూవల్ చేసేందుకు హైకోర్టు అనుమతించింది. ఈ మేరకు సంబంధిత అధికారులకు హై కోర్టు ఆదేశాలు జారీ చేసింది. కాగా, ఈ ఏడాది మే నెలలో జరిగిన ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో వైసీపీ ఓటమి పాలు కావడంతో జగన్ సీఎం సీటు పోయింది. దీంతో వీఐపీలకు ఇచ్చే డిప్లోమాట్ పాస్ పోర్ట్ రద్దు అయ్యింది. చేసేదేమిలేక జగన్ ఐదేళ్ల పాటు సాధారణ పాస్ పోర్టు కోసం దరఖాస్తు చేసుకున్నారు. పాస్ పోర్టు జారీలో అవాంతరాలు ఎదురు కావడంతో జగన్ విజయవాడ కోర్టును ఆశ్రయించారు.
ALSO READ : అనిత తన బిడ్డలతో వస్తే.. నేను నా బిడ్డలతో వస్తా.. నందిగామ సురేష్ భార్య బేబీలత సవాల్
అయితే, విజయవాడ కోర్టు కేవలం ఒక ఏడాది మాత్రమే పాస్ పోర్టు జారీ చేసేందుకు పర్మిషన్ ఇచ్చింది. దీంతో విజయవాడ కోర్టు ఆదేశాలను జగన్ ఏపీ హైకోర్టులో సవాల్ చేశారు. తన పాస్ పోర్టును ఐదేళ్ల పాటు రెన్యూవల్ చేసేలా ఆదేశాలు ఇవ్వాలంటూ పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్ పై ఇవాళ (సెప్టెంబర్ 11) విచారణ చేపట్టిన హైకోర్టు.. జగన్ కు ఐదేళ్లు పాస్ పోర్టు రెన్యూవల్ చేయాలని ఆదేశాలు జారీ చేసింది. పాస్ పోర్టు ఇష్యూలో కోర్టు నుండి క్లియరెన్స్ రావడంతో జగన్ విదేశీ పర్యటనలకు వెళ్లనున్నట్లు సమాచారం.