India vs Bangladesh: సెప్టెంబర్ 3వ తేదీ నుంచి షురూ కావాల్సిన భారత్ vs బంగ్లాదేశ్ సిరీస్‌పై మల్లా పెద్ద పంచాయితీ మొదలైంది. 3 వన్డేలు, 3 టీ20ల ఈ టూర్ ఇంకోసారి ఆగిపోతదా ఏంది అని ఫ్యాన్స్ గిప్పుడు ఫుల్ టెన్షన్ పడుతున్నారు. పోయినేడే (గత సంవత్సరం) జరగాల్సిన ఈ పర్యటన సెక్యురిటీ కారణంగా ఆగిపోతే, గిప్పుడు మళ్లా రీషెడ్యూల్ పై జోరుగా చర్చ నడుస్తోంది. కేకేఆర్ నుంచి ముస్తాఫిజుర్‌ను తప్పించడంతో టీ20 వరల్డ్ కప్‌కి బంగ్లా టీమ్ రానని అనడంతో ఇరు దేశాల బోర్డుల మధ్య కిరికిరి స్టార్ట్ అయింది. జూన్‌లో తమీమ్ ఇక్బాల్ బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు ప్రెసిడెంట్ అయ్యాక సీన్ మొత్తం మారిపోయిందనుకుంటే, గిప్పుడు మళ్లా షెడ్యూల్ పై ఫుల్ రచ్చ కొనసాగుతుంది. మరి మన ఆటగాళ్లు బంగ్లాదేశ్ విమానం ఎక్కుతారా లేక ఈ సిరీస్ మళ్లా పోస్ట్‌పోన్ అవుతుందా అనేదే ఇప్పుడు హాట్ టాపిక్.
మిర్పూర్ గ్రౌండ్‌లో లోకల్ టోర్నీ:
భారత్ తో సిరీస్ స్టార్ట్ కావడానికి ఇంకో రెండు వారాలే టైమ్ ఉందనగా, బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు చీఫ్ తమీమ్ ఇక్బాల్ గేమ్ డెవలప్‌మెంట్ ట్రోఫీ అని ఓ లోకల్ టోర్నమెంట్ షెడ్యూల్ రిలీజ్ చేసిండు. ఆగస్టు 28 నుంచి సెప్టెంబర్ 9 వరకు అన్ని మ్యాచ్‌లు మిర్పూర్ స్టేడియంలోనే పెడుతున్నట్లు అనౌన్స్ చేసేసరికి జనాలు షాక్ అయ్యిర్రు. టీమిండియాతో మ్యాచ్‌లు జరిగే టైమ్‌లోనే ఈ టోర్నీ ఏంది భాయ్? అంటే సిరీస్ ఆగిపోయినట్లేనా? అని మీడియా అడిగితే.. తమీమ్ వెంటనే స్పందిస్తూ క్లారిటీ ఇచ్చిండు. రెండు బోర్డుల నడుమ డేట్ల గురించి ఇంకా చర్చ నడుస్తుంది, మ్యాచ్ డేట్లు కొంచెం అటుఇటు అయ్యే ఛాన్స్ ఉందని చెప్పుకొచ్చాడు. ఇండియన్ బోర్డు సిరీస్ డేట్స్ ఫైనల్ కాగానే, ఈ లోకల్ మ్యాచ్‌లను రెండు నిమిషాల్లో వేరే స్టేడియానికి మార్చేస్తామని, తమకి భారత జట్టుతో జరిగే సిరీసే ముఖ్యం అని తేల్చి చెప్పిండు.
భారత గవర్నమెంట్ గ్రీన్ సిగ్నల్ కోసం వెయిటింగ్:
ఈ సిరీస్ డేట్లపై బీసీసీఐ, బీసీబీ ఒక నిర్ణయానికి వచ్చినా కూడా, అసలైన క్లియరెన్స్ మాత్రం భారత ప్రభుత్వం నుంచే రావాల్సి ఉంది. బంగ్లాదేశ్‌లో సెక్యురిటీ పరిస్థితులు ఎట్లున్నయో కంప్లీట్‌గా చెక్ చేసిన తర్వాతే కేంద్ర ప్రభుత్వం టీమిండియా పర్యటనకు పచ్చజెండా ఊపుతుంది. కానీ బంగ్లాదేశ్ మస్తు సేఫ్ కంట్రీ అని, ఇండియా టీమ్ కచ్చితంగా వస్తుందనే ఆశతో ఉన్నామని తమీమ్ ధీమా వ్యక్తం చేసిండు. జర్నలిస్టులు, ఫ్యాన్స్, ప్లేయర్స్ అందరూ ఈ మ్యాచ్‌ల కోసం ఫుల్ ఈగర్‌గా వెయిట్ చేస్తున్నారని, భద్రత విషయంలో తమ వైపు నుంచి ఎలాంటి లోటూ రానివ్వమని మాటిచ్చిండు.
మ్యాచ్ మళ్లా వాయిదా పడుతుందా?:
మొత్తానికి సెప్టెంబర్ 3వ తేదీ దగ్గరపడుతున్నాప్పటికీ, ఈ సిరీస్ కి సంబంధించి ఆఫీషియల్ తేదీల పైన స్పష్టత రాకపోవడంతో క్రికెట్ లవర్స్‌లో టెన్షన్ పీక్స్‌కి చేరింది. ఒకవేళ కేంద్ర ప్రభుత్వం నుంచి పర్మిషన్ లభించి రెండు బోర్డులు ఒప్పందం చేసుకుంటే ఈ క్రేజీ సిరీస్ మైదానంలో సెన్సేషన్ సృష్టిస్తుంది. లేదంటే వరుసగా రెండోసారి కూడా ఈ పర్యటన రద్దయి అభిమానులకు నిరాశే మిగులుతుంది. మరి ఇండియన్ గవర్నమెంట్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో చూడాలి మరీ.
