బోలెడంత ఉత్కంఠతో మొదలైన బిగ్ బాస్

బోలెడంత ఉత్కంఠతో మొదలైన బిగ్ బాస్

బిగ్ బాస్ మొదలైంది. రాత్రి పదయ్యేసరికి టెలివిజన్‌ సెట్లకు అతుక్కుపోయేవారి సంఖ్య పెరిగింది. గత ఐదు సీజన్లలో ఏదో ఒక్క సీజన్ తప్ప మిగతావన్నీ మంచి టీఆర్పీలు రాబట్టడంతో యాజమాన్యం షోని ప్రెస్టీజియస్‌గా తీసుకుంది. కొత్త కొత్త ఎత్తులతో గేమ్‌ను డిజైన్ చేసింది. ఎవరు ఎవరిని చిత్తు చేస్తారో చూసేందుకు ప్రేక్షకలోకమూ సిద్ధంగా ఉంది. బోలెడంత ఉత్కంఠ మధ్య  మొదటి ఎపిసోడ్  ఆదివారం ప్రసారమయ్యింది. 

అప్పుడే మొదలు

బిగ్‌ బాస్ హౌస్‌ అంటేనే గొడవలకు కేరాఫ్ అని ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. నలుగురైదుగురు ఒకచోట ఉంటేనే ఏదో ఒక మాట తేడా వస్తుంది. అలాంటిది ఇరవయ్యొక్క మందిని లోపలికి నెట్టి తాళం వేశారు. ఇక ఎలా ఉంటుంది? అందుకే మొదటి రోజే రభస మొదలైంది. స్నానాలు చేసినవాళ్లు తల వెంట్రుకలు తీయలేదని గీతూ రాయల్‌కి కోపమొచ్చింది. అసలే సీమ టపాకాయ్ కదా. కాస్త స్మూత్‌గా అడగాల్సింది పోయి సూటిగా ప్రశ్నించింది. కొందరు కూల్‌గానే రియాక్టయ్యారు. ఇనయా సుల్తానాకి మాత్రం చిర్రెత్తుకొచ్చింది. ఇంతమంది ఉండగా నన్నే  ఎందుకడుగుతున్నావ్ అని రివర్స్ అయ్యేసరికి గీతూ తిక్కదానా అంటూ ఏదేదో అనేసింది. దాంతో నిప్పు రాజుకుంది. 

ఇది చాలదన్నట్టు అంతలోనే  బిగ్‌బాస్ ఓ వెరైటీ స్కిట్టుకు తెరతీశాడు. క్లాస్, మాస్, ట్రాష్ అంటూ మూడు గ్రూపులుగా హౌస్‌మేట్స్ ని  విడిపొమ్మన్నాడు. క్లాస్‌ వాళ్లు ఏ పనీ చేయక్కర్లేదు. బాల్కనీలో కూర్చుని తింటూ తాగుతూ ఎంజాయ్ చేయొచ్చు. అందరితో అన్ని పనులూ చేయించుకోవచ్చు. వీరికి నామినేషన్ ఉండదు. డైరెక్ట్ కెప్టెన్సీ పోటీకి అర్హులు కూడా అవుతారు. ట్రాష్‌ గ్రూపులో వాళ్లు ఎవరేం చెప్పినా చేయాలి. వీళ్లు డైరెక్ట్ గా నామినేట్ అవుతారు. కొన్ని స్కిట్స్ గెలవడం ద్వారా కెప్టెన్సీ పోటీకి అర్హత సంపాదించొచ్చు. క్లాస్ గ్రూప్‌లోకి కూడా చేరిపోవచ్చు. ఈ రెండింటికీ చెందని వారు మాస్ గ్రూపులో ఉండాలి. వీరికి పెద్ద నష్టాలూ ఉండవు, లాభాలూ ఉండవు. ఎవరు ఏ గ్రూప్‌లోకి వెళ్తారో వారినే డిసైడ్ చేసుకోమని చెప్పి  బిగ్‌బాస్ సైలెంట్‌గా తప్పుకున్నాడు. అందరూ ఓట్లు వేశాక బాలాదిత్య, సూర్య, శ్రీహాన్‌ క్లాస్‌ గ్రూపులోకి వెళ్లారు. ఇనయా, గీతూ, రేవంత్ ట్రాష్‌లోకి వెళ్లారు. మిగతా వారంతా మాస్‌లో ఉండిపోయారు. అందరితోనూ కలిసిపోయి అన్ని పనులూ చేసిన తనని ట్రాష్‌లో వేసినందుకు రేవంత్ కాస్త నొచ్చుకున్నాడు. ఓ చిన్న టాస్క్ లో ఇనయాతో పోటీపడి ఆదిరెడ్డి క్లాస్‌ గ్రూపులో చేరిపోయాడు. ఆ గ్రూప్‌ నుంచి శ్రీహాన్‌ బైటికి వచ్చేశాడు. 

ఎమోషనల్ రైడ్

ట్రాష్ టీమ్‌లో ఉన్నవారికి  బిగ్‌బాస్ ఓ పని చెప్పాడు. తాము ట్రాష్ కాదని, స్టార్స్మని నిజంగా నమ్మేవారి గురించి చెప్పి, వారి పేరు పేపర్‌ ‌మీద రాసి ఓ బాటిల్‌లో పెట్టి స్విమ్మింగ్‌ పూల్‌లో వేయమన్నాడు. మొదట ఇనయా మాట్లాడింది. రెండేళ్ల క్రితం చనిపోయిన తన తండ్రి గురించి చెప్పి ఏడ్చింది. ఆ తర్వాత రేవంత్ తన మనసు విప్పాడు. తండ్రి చిన్నప్పుడే చనిపోయిన విషయం తనకి చాలాకాలం తెలీదని, ఎక్కడో అమెరికాలో ఉన్నాడు, బాగా చదివితే అక్కడికి వెళ్లొచ్చని చెబితే నిజమనుకున్నానని చెప్పి కదిలించాడు. ఆ తర్వాత గీతూ కూడా తన ఫీలింగ్స్ షేర్ చేసుకుంది. అయితే ఇనయా మాట్లాడుతున్నప్పుడు ‘మనసిచ్చి చూడు’ సీరియల్ ఫేమ్ కీర్తి గట్టిగా ఏడ్చేసింది. దానికి కారణం ఆమె గతం. ఓ యాక్సిడెంట్‌లో తన ఫ్యామిలీ మెంబర్స్ అందరూ చనిపోయారు. కీర్తి మూడు నెలల పాటు కోమాలోనే ఉండిపోయింది. బయటికి వచ్చేసరికి బంధువులంతా ఆస్తిపాస్తులు లాగేసుకున్నారు. ఆమెని రోడ్డు మీద వదిలేశారు. ఎలాగో కష్టపడి ఈ స్థాయికి చేరుకుంది. ఇనయా తన తండ్రిని తలచుకుని ఏడ్చేసరికి తనవాళ్లంతా గుర్తొచ్చి కీర్తి ఏడ్చేసింది. దాంతో ఒక భారమైన ఫీల్‌ అందరికీ కలిగింది. ఇది చూస్తుంటే ఈ సీజన్ ఓ ఎమోషనల్ రైడ్‌లా ఉండొచ్చనిపిస్తోంది.

కాస్త ఎక్కువైందే!

ఈ ఎపిసోడ్ చూసిన  వారెవరికైనా విసుగొచ్చే విషయం ఉందంటే అది గీతూ చేసిన హంగామానే. మొదట బాత్రూముల గురించి ఆమె మాట్లాడిన పద్ధతే కాస్త అతిగా అనిపించిందంటే.. తన లైఫ్‌లో ఇంపార్టెంట్ పర్సన్ గురించి చెప్పమన్నప్పుడు చేసిన హడావుడి మరింత విసిగించింది. ఇనయా తర్వాత గీతూని చెప్పమన్నాడు రేవంత్. దానికామె నేను చెప్పలేను, నాకు ఏడుపొస్తోంది అంటూ గొడవ చేసింది. పైగా లోపలికి వెళ్లిపోయి అతను చెప్పొచ్చు కదా, నన్ను చెప్పమంటాడేంటి అంటూ కాస్త నెగిటివ్ కామెంట్స్ చేసింది. రేవంత్ మాట్లాడుతుంటే కూడా లోపలికి వెళ్లిపోయింది. తర్వాత మళ్లీ వచ్చి తన గురించి చెప్పింది. నిజానికి ఆమె మాటల్లో ఎమోషనల్ అయిపోయేంత విషయం లేదు. ఆమె మాటలకి, హావభావాలకి, హడావుడికి ఉన్న ఫీల్ కాస్తా పోయిందనే చెప్పాలి. గలాటా గీతూ అనే తన పేరుకి ఆమె అచ్చంగా న్యాయం చేసింది ఈ ఎపిసోడ్‌లో. తను కనుక ఇలాగే ఉంటే ముందు ముందు హౌస్‌లో చాలామందితో గొడవలు వచ్చే చాన్స్ లేకపోలేదు. మొత్తానికి ఈ ఎపిసోడ్‌ కాస్త హాట్‌గాను, కాస్త ఎమోషనల్‌గాను సాగింది. మధ్యలో కీర్తితో సూర్య మాట కలుపుతూ, ఆమెకి బిస్కట్లు వేస్తూ కనిపించడంతో రొమాంటిక్ టచ్ కూడా ఇచ్చినట్టయ్యింది. ముందు ముందు ఇంకెన్ని జరుగుతాయో.. అవి ఎటువైపు దారి తీస్తాయో చూడాల్సిందే!