
బిగ్ బాస్ హౌస్ లో మామూలుగానే ఒకరిపై ఒకరు ఫైర్ అయిపోతున్నారు కంటెస్టెంట్లు. ఇక టాస్కుల విషయంలో ఎలా ఉంటారో ప్రత్యేకంగా చెప్పాలా? నిప్పులు చెరుగుతున్నారు. తప్పులు ఎంచుతున్నారు. తొండి చేస్తున్నారు. మొండిగా వాదిస్తున్నారు. దాంతో హౌస్ మొత్తం రచ్చ రచ్చే.
చంటికే మొదటి చాన్స్
ఈవారం కెప్టెన్సీ పోటీదారుల్ని ఎంపిక చేయడం కోసం ఓ టాస్క్ పెట్టాడు బిగ్ బాస్. అందరికీ ఒక్కో బొమ్మని ఇచ్చాడు. ఎవరి బేబీని వాళ్లు జాగ్రత్తగా చూసుకోవాలి. ఒక్కొక్కళ్ల బేబీ ఒక్కోసారి ఏడుస్తుంది. డైపర్ మార్చమంటుంది. ఆకలేస్తోంది బువ్వ పెట్టమంటుంది. ఏమైనా అడుగుతుంది. అది అడిగినవన్నీ దాని యజమాని చేయాలి. ఒక్కక్షణం కూడా దాన్ని విడిచిపెట్టకూడదు. ప్రతిక్షణం కాపాడుకోవాలి. పొరపాటున దాన్ని పక్కన పెట్టినప్పుడు ఎవరైనా తీసుకెళ్లి బిగ్‌బాస్ కేటాయించిన స్పెషల్ ప్లేస్‌లో పెట్టారా.. ఇక వాళ్లు పోటీకి అనర్హులు. అలాగే మధ్యమధ్యలో టాస్కులు పెడుతుంటారు. బజర్ మోగగానే ఏ ఐదుగురు ముందుగా వెళ్లి తమ బేబీస్‌ని స్ట్రోలర్స్ లో వేస్తారో వాళ్లు ఆ టాస్క్ లో పోటీపడతారు. గెలిచినవారు కెప్టెన్సీ పోటీకి అర్హులవుతారు. మొదటి టాస్క్.. బోర్డ్ లో ఉన్న ఖాళీల్లో వాటికి తగిన సింబల్స్ ని తీసుకొచ్చి ఫిక్స్ చేయాలి. అయితే మామూలుగా కాదు. కాళ్లకి గోనెసంచుల్ని కట్టుకుని, ఎగురుకుంటూ వెళ్లి ఆ పని చేయాలి. అందరి కంటే ఫాస్ట్ గా రేవంత్ ఆడాడు. అయితే అతనికి కావలసిన చివరి సింబల్‌ను ఫైమా తన బోర్డులో పెట్టేసుకుంది. అది తనది కాదని తెలిసి కూడా ఆమె తీయకుండా అలా ఉంచేసింది. రేవంత్ ఎంత బతిమాలినా కూడా తీసి ఇవ్వలేదు. దాంతో రేవంత్ ఓడిపోయాడు. చంటి గెలిచాడు. మొదటి కెప్టెన్సీ పోటీదారుడు అయ్యాడు. రెండో టాస్క్ కోసం బజర్ నొక్కినప్పుడు కాలు బెణికిన ఫైమా తరఫున రేవంత్ ఆడాడు. ఆమె బేబీని రైట్ టైమ్‌లో ప్లేస్ చేశాడు. మరి రేపు పోటీలో ఫైమా పాల్గొంటుందో, అది కూడా రేవంతే ఆడతాడో.
బేబీల పోరు.. గీతూ జోరు
ఎవరైనా తమ బేబీని ఒంటరిగా వదిలేసినపుడు.. ఇంకొకరు దాన్ని తీసుకెళ్లి బిగ్‌బాస్ కేటాయించిన స్పెషల్ ప్లేస్‌లో పెడితే ఇక వాళ్లు పోటీకి అనర్హులనే పాయింట్ గీతూకి తెగ నచ్చేసింది. ఎవరైనా కాస్త ఏమరుపాటుగా ఉంటే చాలు.. వాళ్ల బొమ్మను తీసుకెళ్లి అక్కడ పడేయడం మొదలుపెట్టింది. ఈ విషయంలో ఆమె తెలివిని మెచ్చుకోవాల్సిందే. రేవంత్ టాస్క్ ఆడి అలసిపోయి కూర్చున్నాడు. అది గమనించి అతని బొమ్మను తీసుకెళ్లిపోయింది. మొదట అది తప్పు అని రేవంత్ తన బొమ్మని తెచ్చేసుకున్నా, ఆ తర్వాత తీసుకెళ్లి అక్కడే పెట్టేశాడు. అసలే తిండి ప్రియురాలు కావడంతో ఫుడ్ చూడగానే శ్రీసత్య తన బేబీని పక్కన పెట్టింది. అంతే గీతూ దాన్ని ఎత్తేసింది. అభినయశ్రీ కూడా తన బొమ్మను పక్కన పెట్టి ఏదో ఆలోచిస్తూ ఉండటంతో దాన్నీ తీసుకుపోయింది. అది బేబీని వదిలేయడం కాదని అభినయశ్రీ వాదించడంతో కెప్టెన్ బాలాదిత్య తన బొమ్మని తనకి ఇచ్చేశాడు. అలా కుదరదని, బొమ్మను స్టోర్ రూమ్‌లో పెట్టేయమని బిగ్‌బాస్ చెప్పడంతో గీతూ ఎగిరి గంతులేసింది. మరికొన్ని బొమ్మలు ఎత్తుకుపోవడానికి ఎత్తులు వేస్తోంది. అయితే ఇవాళ బిగ్‌బాస్ గీతూని ఒక ఆట ఆడుకున్నాడు. మాటిమాటికీ గీతూ దగ్గరున్న బేబీని ఏడిపించి డైపర్లు మార్పించాడు. తానెప్పుడూ పిల్లల్ని చూసుకోలేదని గీతూ మొత్తుకునేకొద్దీ కావాలని ఆమెని విసిగించడంతో మిగతా హౌస్మేట్స్ అంతా తెగ ఎంజాయ్ చేశారు.
అప్పుడే కోపం.. అప్పుడే ప్రేమ
రేవంత్ మూడ్ స్వింగ్స్ ఇంకా అలాగే ఉన్నాయి. అప్పుడే అరుస్తున్నాడు. అప్పుడే కూల్ అవుతున్నాడు. బాలాదిత్య ఆల్రెడీ తనకి క్లాస్ తీసుకున్నాడు. నీ ఫ్రస్ట్రేషన్ అంతా మాటల్లోనే తెలిసిపోతుంది, ఎందుకలా, కూల్‌గా ఉండొచ్చు కదా అని చెప్పాడు. అయినా కూడా ఇవాళ చాలాసార్లు సహనం కోల్పోయాడు రేవంత్. ఫైమా స్ట్రాటజీతో ఆడటంతో మండి పడ్డాడు. నన్ను మామూలుగా ఓడించడం కష్టం కనుక ఇలాంటి దొంగాటలు ఆడుతున్నారంటూ పదే పదే అన్నాడు. నిన్ను గెలిపించడానికి నేనెందుకన్నా ఆడటం అంటూ ఫైమా కంటతడి పెట్టుకుంది. ఆ తర్వాత కూల్ అయ్యి ఆమెను దగ్గరకు తీసుకున్న రేవంత్.. మనసులో ఏదీ పెట్టుకోవద్దని చెప్పాడు. ఆ తర్వాత అదే ఫైమా తరఫున ఆడాడు కూడా. అయితే బాలాదిత్య ఓ సమయంలో కన్ఫ్యూజ్ అయ్యి.. ఫైమా తరఫున రేవంత్ ఆడటం చెల్లదు అన్నాడు. ముందు ఓకే అని ఇప్పుడెలా కాదంటావ్ అని క్వశ్చన్ చేసే క్రమంలో.. సంచాలకురాలైన నేహ ఆ పాయింట్ ఎందుకు చెప్పలేదు అని అడిగాడు రేవంత్. దానికి నేహ హర్ట్ అయిపోయింది. అంత చిన్న మాటకే తనపై నింద వేశాడంటూ నానా యాగీ చేసింది. రేవంత్ కన్విన్స్ చేయాలని ప్రయత్నించినా ఆమె వినకపోవడంతో మరోసారి ఫైర్ అయ్యాడు. ఇక గీతూ తన బేబీని తీసుకెళ్లిపోయినప్పుడు గర్భవతి అయిన తన భార్యను, పుట్టబోయే బిడ్డను తలచుకుని చాలా ఎమోషనల్ అయ్యాడు. ఆ బొమ్మని స్టోర్ రూమ్‌లో పెట్టేయమని బిగ్‌బాస్ చెప్పినప్పుడు కూడా భారమైన మనసుతోనే ఆ పని చేశాడు. మొత్తంగా తనొక కన్ఫ్యూజ్డ్ స్టేట్‌లో కనిపిస్తున్నాడు. అందరూ తనని టార్గెట్ చేయడం అతనిని బాధిస్తోంది. అందుకే సీరియస్ అయిపోతున్నాడు. క్షణాల్లో తప్పు తెలుసుని కూల్ అయిపోతున్నాడు. గీతూ తన బొమ్మని తీసుకుపోకుండా కీర్తి చాలా అడ్డు పడిందని తెలిశాక ఆమెని పిలిచి హగ్ ఇచ్చాడు రేవంత్. శ్రీసత్యని కూడా అందరితో కలిసి ఉండమని చెప్పాడు. కామెడీ చెయ్యి గానీ నిన్ను కామెడీగా తీసుకునే చాన్స్ ఎవరికీ ఇవ్వొద్దు అని ఫైమాని మోటివేట్ చేశాడు. అతని మనసు మంచిదే కానీ ఎమోషన్స్ కంట్రోల్ చేసుకోవడం రావడం లేదని వీటన్నింటిని బట్టి అర్థమవుతోంది.
ఎవరి తీరు వారిది
తన భర్త తనను పట్టించుకోవట్లేదంటూ తెగ ఫీలైపోయే మెరీనా.. ఇవాళ అతనితో కలిసి మంచి ఫుటేజే ఇచ్చింది. ఎపిసోడ్ స్టార్టింగ్‌లోనే ఇద్దరూ రొమాంటిక్‌గా కనిపించారు. అప్పుడే రూమ్‌లోకి వచ్చిన నేహ అది చూసి కాస్త షాకయ్యింది. దాన్ని గమనించిన మెరీనా.. మేం రొమాన్స్ చేసుకోవాలి నువ్వు వెళ్లు అని చెప్పేయడంతో ఎలా రియాక్టవ్వాలో తెలియక నవ్వేసిన నేహ.. నాకూ వెంటనే పెళ్లి చేసుకోవాలనిపిస్తోంది అంటూ ఓ డైలాగ్ కూడా కొట్టింది. గీతూకి అందరూ దూరంగా పారిపోతుంటే ఆదిరెడ్డి మాత్రం ఆమెతో తెగ ముచ్చట్లు పెడుతున్నాడు. టాస్క్ లో ఒకరినొకరు తోసేసుకుంటున్నారని, తాను అలా చేయలేనని ఇదైపోతుంటే.. ఆటలో ఆడా మగా లేదు తోసి పారేయ్ అంటూ గీతూ సలహా ఇస్తోంది. ఇక హౌస్‌లో దొంగల గురించి పెద్ద చర్చే నడిచింది. ముందు రోజు సూర్య, ఫైమా, ఆరోహి అందరూ నిద్రపోయాక తమకు నచ్చినవి వండుకుని తినేశారు. అయితే ఇవాళ అదే సూర్య తాను దాచుకున్న ఉల్లిగడ్డలు, ఆలుగడ్డలు ఎవరో కొట్టేశారని తెగ ఫీలైపోయాడు. ఆ తర్వాత సూర్య, ఆరోహిలు బాలాదిత్య గురించి డిస్కస్ చేశారు. అతను చాలా తెలివైనవాడని, ఎక్కడా దొరకడం లేదని ఆరోహి నెగిటివ్ కామెంట్లు చేస్తుంటే.. దొరుకుతాడు అంటూ సూర్య ఆమె మాటల్ని సమర్థించాడు.
మొత్తానికి ఇలా ఎవరికి నచ్చిన తీరులో వారు ఉంటున్నారు. ఎవరి దోస్తులతో వాళ్లు ముచ్చట్లు పెట్టుకుంటున్నారు. కానీ ఆట సమయంలో ఒకరినొకరు వేటాడుతున్నారు. టైమ్ అయిపోవడంతో ఇవాళ్టికి టాస్క్ ఆపేసిన బిగ్‌బాస్.. తర్వాతి ఎపిసోడ్లో కంటిన్యూ చేయబోతున్నాడు. అయితే అది మరిన్ని ఇష్యూస్ క్రియేట్ చేయబోతుందని ప్రోమో ద్వారా అర్థమయ్యింది. ఎందుకంటే నిద్రపోతున్న వారి చేతుల్లోంచి లాక్కుని మరీ గీతూ బొమ్మల్ని ఎత్తుకుపోతోంది. లేచి చూశాక వాళ్లు ఎలా రియాక్టవుతారో..ఈ తొండి ఆటను బిగ్‌బాస్ యాక్సెప్ట్ చేస్తాడో లేదో.. వేచి చూడాల్సిందే.