చిన్నారుల అక్రమ దత్తతపై హైకోర్టు సీరియస్‌‌

చిన్నారుల అక్రమ దత్తతపై హైకోర్టు సీరియస్‌‌
  • సుమొటోగా ప్రజాహిత వ్యాజ్యం

హైదరాబాద్‌‌, వెలుగు: రాష్ట్రంలో చిన్నారుల అక్రమ దత్తత, మానవ అక్రమ రవాణా జరుగుతున్న తీరు ఆందోళన కలిగిస్తోందని హైకోర్టు పేర్కొంది. ఒక చిన్నారి దత్తత వ్యవహారంపై మహిళా శిశు సంక్షేమశాఖ, హోంశాఖ, రాష్ట్ర న్యాయసేవాధికార సంస్థ సమర్పించిన నివేదికలను పరిశీలించిన ధర్మాసనం.. దత్తత పేరుతో దూరమైన పిల్లలతోపాటు వారి కన్న తల్లిదండ్రుల ఆచూకీ కూడా తెలియని పరిస్థితి ఉందని తెలిపింది. ఈ అంశం విస్తృత ప్రజాప్రయోజనంతో ముడిపడి ఉన్నందున సుమోటో ప్రజాహిత వ్యాజ్యంగా స్వీకరించింది.

హోంశాఖ, మహిళా శిశు సంక్షేమశాఖ ముఖ్యకార్యదర్శులు, ఆ శాఖ డైరెక్టర్‌‌, రాష్ట్ర లీగల్‌‌ సర్వీసెస్‌‌ అథారిటీ మెంబర్‌‌ సెక్రటరీ, డీజీపీలను ప్రతివాదులుగా చేర్చింది. సీనియర్‌‌ న్యాయవాది బి.మయూర్‌‌రెడ్డిని అమికస్‌‌ క్యూరీగా నియమించింది. ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌‌ అపరేశ్‌‌ కుమార్‌‌ సింగ్‌‌, జస్టిస్‌‌ వాకిటి రామకృష్ణారెడ్డిల ధర్మాసనం ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది.

2023లో దత్తత తీసుకున్న చిన్నారిని పోలీసులు స్వాధీనం చేసుకుని మహిళా శిశు సంక్షేమశాఖకు అప్పగించడాన్ని సవాలు చేస్తూ నల్గొండ జిల్లా సూరారం మండలానికి చెందిన ఎం.వెంకన్న దంపతులు హైకోర్టును ఆశ్రయించారు. సింగిల్‌‌ జడ్జి పిటిషన్‌‌ను కొట్టివేయడంతో వారు అప్పీల్‌‌ దాఖలు చేశారు. ఈ వ్యవహారంలో సమర్పించిన నివేదిక ప్రకారం.. అక్రమ దత్తత, రవాణాకు సంబంధించి 61 మంది పిల్లలు ఉన్నట్లు, 31 ఎఫ్‌‌ఐఆర్‌‌లు నమోదు కాగా 176 మందిని నిందితులుగా చేర్చి దర్యాప్తు చేస్తున్నట్లు అధికారులు తెలిపారు.

27 కేసుల్లో తల్లిదండ్రులను గుర్తించామని, మరో 26 కేసుల వివరాలను బాలల సంక్షేమ కమిటీకి అప్పగించామని పేర్కొన్నారు. ఒక కేసులో బాలనేరస్తుడు ఉన్నందున జువైనల్‌‌ జస్టిస్‌‌ బోర్డుకు పంపాల్సి ఉందన్నారు. అమికస్‌‌ క్యూరీ బి.మయూర్‌‌రెడ్డి నివేదికలో నల్గొండ శిశు కేంద్రానికి భద్రతా సిబ్బందితోపాటు పిల్లల సైక్రియాట్రిస్ట్‌‌, వైద్యులు, థెరపిస్టులు క్రమం తప్పకుండా అందుబాటులో ఉండాలని, ఒక్కో చిన్నారికి కేటాయిస్తున్న రూ.2,500ను పెంచాలని సూచించారు. సుమోటో పిల్‌‌ విచారణను అక్టోబర్‌‌ 5కు, వెంకన్న అప్పీల్‌‌ను అక్టోబర్‌‌ 7కు ధర్మాసనం వాయిదా వేసింది.