
తెలంగాణలో రోజు రోజుకీ కరోనా వైరస్ విజృంభిస్తోంది. గడిచిన 24 గంటల్లో రికార్డు స్థాయిలో 199 కొత్త కేసులు నమోదయ్యాయి. ఒక్క రోజులో కరోనాతో ఐదుగురు మరణించారు. రాష్ట్రంలో కరోనా పరిస్థితిపై ఆదివారం రాత్రి 8 గంటలకు బులిటెన్ విడుదల చేసింది ఆరోగ్య శాఖ. రాష్ట్రంలో శనివారం సాయంత్రం ఐదు గంటల నుంచి ఆదివారం సాయంత్రం ఐదు గంటల మధ్య నమోదైన కేసులు మరణాల వివరాలను వెల్లడించింది. ఈ 24 గంటల వ్యవధిలో రాష్ట్రానికి చెందిన లోకల్స్ లో 196 మందికి, మరో ముగ్గురు వలస కార్మికులకు కరోనా పాజిటివ్ వచ్చింది. దీంతో రాష్ట్రంలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 2698కి చేరింది. ఇందులో స్థానికులు 2264 మంది, విదేశాల నుంచి తిరిగి వచ్చినవారు, వలస కూలీలు 434 మంది ఉన్నారు.
గడిచిన 24 గంటల్లో అత్యధికంగా జీహెచ్ఎంసీలో 122 కరోనా కేసులు నమోదయ్యాయి. రంగారెడ్డి జిల్లాలో 40, మేడ్చల్ లో 10, ఖమ్మంలో 9, మహబూబ్ నగర్ జిల్లాలో 3, జగిత్యాలలో 3, మెదక్ లో 3, వరంగల్ అర్బన్ లో 2, సూర్యాపేట, నిర్మల్, జనగామ, యాదాద్రి జిల్లాల్లో ఒక్కొక్క కేసు చొప్పున నమోదయ్యాయి.
ఈ ఒక్క రోజులో ఐదుగురు కరోనాకు బలయ్యారు. దీంతో ఇప్పటి వరకు కరోనా మరణాల సంఖ్య 82కు చేరింది. ఇప్పటి వరకు 1428 మంది కరోనా నుంచి పూర్తిగా కోలుకుని డిశ్చార్జ్ అయ్యారు. ప్రస్తుతం 1188 మంది ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు.