రికార్డులన్నీ బద్దలుకొడ్తం... బిహార్‌‌‌‌‌‌‌‌లో భారీ మెజారిటీతో గెలుస్తం: మోదీ

రికార్డులన్నీ బద్దలుకొడ్తం... బిహార్‌‌‌‌‌‌‌‌లో భారీ మెజారిటీతో గెలుస్తం: మోదీ
  • ఎన్డీయేది అభివృద్ధి.. మహాగఠ్‌‌‌‌బంధన్‌‌‌‌ది అవినీతి
  • రాష్ట్రంలో నితీశ్ నాయకత్వంలోనే ఎన్నికలకు వెళ్తున్నాం 
  • సమస్తిపూర్, బెగుసరాయ్ జిల్లాల్లో ప్రధాని ర్యాలీలు  


సమస్తిపూర్/బెగుసరాయ్: బిహార్ అసెంబ్లీ ఎన్నికల్లో రికార్డులన్నీ బద్దలు కొడ్తామని, భారీ మెజారిటీతో ఎన్డీయే కూటమి విజయం సాధిస్తుందని ప్రధాని నరేంద్ర మోదీ ధీమా వ్యక్తం చేశారు. ‘ఫిర్ ఏక్ బార్ ఎన్డీయే సర్కార్.. ఫిర్ ఏక్ బార్ సుశాసన్ సర్కార్’ అంటూ బిహార్ ప్రజలంతా నినదిస్తున్నారని పేర్కొన్నారు. గుజరాత్, మధ్యప్రదేశ్, హర్యానా, మహారాష్ట్రలో తిరిగి అధికారం దక్కించుకున్నట్టుగానే.. బిహార్‌‌‌‌‌‌‌‌లోనూ మళ్లీ పవర్‌‌‌‌‌‌‌‌లోకి వస్తామని ధీమా వ్యక్తం చేశారు. 

బిహార్ అసెంబ్లీ ఎన్నికల ప్రచారాన్ని ప్రధాని మోదీ శుక్రవారం ప్రారంభించారు. సమస్తిపూర్, బెగుసరాయ్ జిల్లాల్లో నిర్వహించిన ర్యాలీల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఎన్డీయే కూటమి ఈసారి గత రికార్డులన్నింటినీ బద్దలు కొడ్తుందని చెప్పారు. ‘మా లీడర్ తేజస్వీ యాదవ్.. మరి మీ లీడర్ ఎవరు?’ అంటూ ప్రతిపక్ష కూటమి మహాగఠ్‌‌‌‌బంధన్ ప్రశ్నించిన నేపథ్యంలో.. జేడీయూ చీఫ్ నితీశ్ కుమార్ నాయకత్వంలోనే అసెంబ్లీ ఎన్నికలకు వెళ్తున్నామని ప్రధాని మోదీ స్పష్టం చేశారు. 

అది అవినీతి కూటమి.. 

ఎన్డీయే, మహాగఠ్‌‌‌‌బంధన్ మధ్య చాలా తేడా ఉందని ప్రధాని మోదీ అన్నారు. ఎన్డీయే అభివృద్ధిపై దృష్టి పెడితే,  మహాగఠ్‌‌‌‌బంధన్ అవినీతిపై దృష్టి పెడుతుందని విమర్శించారు. కాంగ్రెస్, ఆర్జేడీ అతిపెద్ద అవినీతి పార్టీలని.. ఆ పార్టీల నేతలు బెయిళ్లపై బయట ఉన్నారని అన్నారు. ‘‘అది మహాగఠ్‌‌‌‌బంధన్ కాదు.. మహాలఠ్‌‌‌‌బంధన్. వాళ్లలో వాళ్లే కొట్టుకుంటరు” అని కామెంట్ చేశారు.  ‘‘2005 అక్టోబర్‌‌‌‌‌‌‌‌లో మీ పేరెంట్స్ ‘జంగిల్ రాజ్‌‌‌‌’ (ఆర్జేడీ, కాంగ్రెస్ సర్కార్) పాలనకు స్వస్తి పలికారు. సరిగ్గా 20 ఏండ్ల తర్వాత మీపై పెద్ద బాధ్యత ఉన్నది. సుపరిపాలన అందించే ప్రభుత్వాన్ని ఎన్నుకోండి” అని యువతకు పిలుపునిచ్చారు. 

బిహార్‌‌‌‌‌‌‌‌లో ఒకప్పుడు సగం జిల్లాల్లో మావోయిస్టుల ప్రభావం ఉండేదని, ఇప్పుడు వాళ్లను పూర్తిగా కట్టడి చేశామని.. దేశంలో నక్సలిజమే లేకుండా చేస్తామని పేర్కొన్నారు. ‘‘బిహార్ ముద్దు బిడ్డ సీతారాం కేసరిని కాంగ్రెస్ అవమానించింది. అణగారిన వర్గాలకు చెందిన కేసరి.. కాంగ్రెస్ ప్రెసిడెంట్ వరకు ఎదిగారు. కానీ గాంధీ–నెహ్రూ కుటుంబం ఆయనను అవమానించింది” అని మండిపడ్డారు.  

కర్పూరీ ఠాకూర్‌‌‌‌‌‌‌‌కు నివాళి.. 

భారత రత్న అవార్డు గ్రహీత, బిహార్ మాజీ సీఎం కర్పూరీ ఠాకూర్‌‌‌‌‌‌‌‌కు మోదీ నివాళులు అర్పించారు. సమస్తిపూర్‌‌‌‌‌‌‌‌లో ర్యాలీకి ముందు ఠాకూర్ సొంతూరు కర్పూరీ గ్రామానికి ఆయన వెళ్లారు.  తనలాంటి పేదవాళ్లు ఉన్నత స్థాయికి ఎదగడానికి ఠాకూర్ బాటలు వేశారని కొనియాడారు. కాగా, ఆ నాడు కర్పూరీ ఠాకూర్ సర్కార్‌‌‌‌‌‌‌‌ను పడగొట్టిందే బీజేపీ మాతృసంస్థ జన్‌‌‌‌సంఘ్‌‌‌‌ అని కాంగ్రెస్ జనరల్ సెక్రటరీ జైరాం రమేశ్ విమర్శించారు. ‘‘1979లో అప్పటి బిహార్ సీఎం కర్పూరీ ఠాకూర్ ఓబీసీ రిజర్వేషన్లను ప్రవేశపెట్టారు. కానీ ఆయన ప్రభుత్వాన్ని జనసంఘ్ పడగొట్టింది నిజం కాదా?” అని ప్రశ్నించారు.

నవంబర్ 14నే అసలైన దీపావళి: అమిత్ షా 

బిహార్ అసెంబ్లీ ఎన్నికల్లో ఆర్జేడీ, దాని మిత్రపక్షాలకు ఘోర ఓటమి తప్పదని కేంద్ర హోంమంత్రి అమిత్ షా అన్నారు. నవంబర్ 14 (ఎలక్షన్ రిజల్ట్)న బిహార్ ప్రజలు అసలైన దీపావళి జరుపుకుంటారని పేర్కొన్నారు. శుక్రవారం సివాన్, బక్సర్ జిల్లాల్లో నిర్వహించిన ర్యాలీల్లో అమిత్ షా మాట్లాడారు. గ్యాంగ్‌‌‌‌స్టర్ కొడుకుకు ఆర్జేడీ టికెట్ ఇచ్చిందని ఆయన మండిపడ్డారు. రాష్ట్రంలో మళ్లీ జంగల్ రాజ్ తీసుకురావాలని ఆ పార్టీ చూస్తున్నదని ఫైర్ అయ్యారు.