బీహార్‏ సెకండ్ ఫేజ్ పోలింగ్: 11 గంటల వరకు 31.38 శాతం పోలింగ్ నమోదు

బీహార్‏ సెకండ్ ఫేజ్ పోలింగ్: 11 గంటల వరకు 31.38 శాతం పోలింగ్ నమోదు

పాట్నా: బీహార్ అసెంబ్లీ ఎన్నికల చివరి దశ పోలింగ్ ప్రశాంతంగా కొనసాగుతోంది. మంగళవారం (నవంబర్ 11) ఉదయం 7 గంటలకు పోలింగ్ ప్రారంభం కాగా ఓటు హక్కు వినియోగించుకునేందుకు ఓటర్లు పోలింగ్ బూత్‎లకు క్యూ కట్టారు. ఉదయం 11 గంటల వరకు 31.38 శాతం ఓటింగ్ నమోదైనట్లు ఈసీ ప్రకటించింది. ఓటర్లకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా ఈసీ అన్ని ఏర్పాట్లు చేసింది. సాయంత్రం 6 గంటల వరకు పోలింగ్ జరగనుంది. బీహార్‎లో మొత్తం 243 అసెంబ్లీ స్థానాలు ఉండగా తొలి దశలో భాగంగా 2025, నవంబర్ 6న 121 సీట్లకు పోలింగ్ జరిగిన విషయం తెలిసిందే.

సెకండ్ ఫేజ్‎లో భాగంగా దాదాపు 20 జిల్లాల్లో విస్తరించి ఉన్న 122 అసెంబ్లీ నియోజకవర్గాలకు పోలింగ్ జరుగుతోంది. 1,302 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. నితీశ్ కేబినెట్‎లోని సగానికి పైగా మంత్రులు పోటీ చేస్తున్న నియోజకవర్గాల్లో పోలింగ్ నిర్వహిస్తున్నారు. మొత్తం 3.70 కోట్ల మంది ఓటర్లు చివరి దశలో తమ ఓటు హక్కు వినియోగించుకోనున్నారు. వెస్ట్ చంపారన్, ఈస్ట్ చంపారన్, సీతామర్హి, మధుబని, సుపౌల్, అరారియా, కిషన్ గంజ్‎తో పాటు నేపాల్ బార్డర్​లో ఉన్న జిల్లాల్లో పోలింగ్ జరగనున్నది. 

4 లక్షల మంది ఉద్యోగులు ఎన్నికల విధుల్లో పాల్గొంటారని ఈసీ ప్రకటించింది. సమస్యాత్మక ప్రాంతాల్లో భారీ బందోబస్తు ఏర్పాటు చేసింది. 50 వేల మంది కేంద్ర బలగాలు, 60 వేల మంది స్టేట్ పోలీసులు, రిజర్వ్ బెటాలియన్ల నుంచి 2 వేల మంది, 30 వేల మంది బిహార్ స్పెషల్ ఆర్మ్​డ్ పోలీసులు, 20 వేల హోంగార్డులు, 19 వేల మంది ట్రైనీ కానిస్టేబుళ్లు, 1.50 లక్షల మంది చౌకీదార్లు విధుల్లో ఉంటారు.

పోలింగ్ జరుగుతోన్న 122 నియోజకవర్గాల్లో అత్యధికంగా సీమాంచల్ రీజియన్‏లోనే ఉన్నాయి. జేడీయూ సీనియర్ నేత, స్టేట్ కేబినెట్ సీనియర్ మెంబర్ బిజేంద్ర ప్రసాద్ సుపౌల్ సెగ్మెంట్ నుంచి పోటీ చేస్తున్నారు. వరుసగా 8వ సారి తన అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. మరో సీనియర్ మినిస్టర్ ప్రేమ్ కుమార్.. గయా టౌన్ నుంచి పోటీ చేస్తున్నారు.

రూరల్ ఏరియాలో 40,073 పోలింగ్ స్టేషన్లు

122 స్థానాల్లో ఎన్నికల కోసం 45,399 పోలింగ్ స్టేషన్లు ఏర్పాటు చేశారు. వీటిలో 40,073 పోలింగ్ స్టేషన్లు రూరల్ ఏరియాలో ఉన్నాయి. 8,491 క్రిటికల్ పోలింగ్ స్టేషన్లుగా గుర్తించారు. 3.70 మంది ఓటర్లలో సగానికి కంటే ఎక్కువ మంది(2.28 కోట్లు) 30 నుంచి 60 ఏండ్ల మధ్యే ఉన్నారు. 7.69 లక్షల మంది మాత్రమే 18 నుంచి 19 ఏండ్ల వారున్నారు. 1.75 కోట్ల మంది మహిళా ఓటర్లున్నారు. నవాడా జిల్లాలోని హిసౌవా స్థానంలో అత్యధికంగా 3.67 లక్షల మంది తమ ఓటు హక్కు వినియోగించుకోనున్నారు.