- హింసాత్మకంగా మారిన బంద్
- సివాన్‌లో పోలీసులు గాల్లోకి కాల్పులు, ఎస్పీకి గాయాలు
పాట్నా: నీట్ ప్రశ్నపత్రం లీకేజీ వివాదంపై కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా కోరుతూ లెఫ్ట్ విద్యార్థి సంఘాలు తలపెట్టిన 'బిహార్ బంద్' తీవ్ర హింసాత్మకంగా మారింది. సివాన్‌లో నిరసనకారులు రాళ్లదాడి చేయడంతో ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. దీంతో గుంపును చెదరగొట్టేందుకు పోలీసులు గాల్లోకి 10 రౌండ్లు కాల్పులు జరిపారు.
ఈ ఘర్షణలో సివాన్ ఎస్పీ పూరన్ ఝాతో పాటు పలువురు పోలీసులకు గాయాలయ్యాయి. పాట్నా, సరన్, భాగల్‌పూర్ సహా పలు జిల్లాల్లోనూ రాళ్లదాడి ఘటనలు చోటుచేసుకున్నాయి. సరన్‌లో ప్రభుత్వ భవనంపై దాడి చేయగా, పాట్నాలో ఆందోళనకు మద్దతు తెలిపిన మాజీ మంత్రి తేజ్ ప్రతాప్ యాదవ్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. నీట్ పేపర్ లీక్ ఆందోళనల నేపథ్యంలో రాష్ట్రవ్యాప్తంగా సున్నితమైన ప్రాంతాల్లో దాదాపు 70,000 మంది అదనపు పోలీసులను మోహరించి బిహార్‌ను హైఅలర్ట్‌లో ఉంచారు. మరోవైపు, గురువారం జరిగిన నిరసనకు సంబంధించి సీపీఐ-ఎంఎల్ ఎమ్మెల్యే సందీప్ సౌరభ్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. జెహనాబాద్‌లో కలెక్టర్నివాసంపై ఆందోళనకారులు రాళ్లు రువ్వడంతో పోలీసులు అక్కడ కూడా 30 రౌండ్లు గాల్లోకి కాల్పులు జరిపి పరిస్థితిని అదుపులోకి తెచ్చారు
