
ఆధార్ కార్డు ఐటెండిఫికేషన్ పై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది.. ప్రభుత్వ, ప్రైవట్ పరంగా వివిధ సేలలు పొందేందుకు ఆధార్ కార్డును ఓ గుర్తింపు కార్డుగా ఉపయోగించ్చు కానీ.. భారత దేశ పౌరసత్వానికి ఇది ఖచ్చితమైన ఫ్రూఫ్ కాదని చెప్పింది భారత అత్యున్నత న్యాయస్థానం. బీహార్‌లో జరుగుతున్న స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (SIR) ఎలక్టోరల్ రోల్స్ వివాదం నేపథ్యంలో ఈ తీర్పు వెలువడింది. ఈ కేసులో సుప్రీంకోర్టు ఆధార్ కార్డు, ఎలక్టోరల్ ఫోటో ఐడెంటిటీ కార్డు (EPIC), రేషన్ కార్డులను పౌరసత్వ రుజువుగా పరిగణించలేమని స్పష్టం చేసింది.
మంగళవారం (ఆగస్టు 12, 2025న) జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ జోయ్‌మల్య బాగ్చీలతో కూడిన సుప్రీంకోర్టు బెంచ్ ఈ కేసును విచారించింది. ఈ విచారణలో ఎన్నికల కమిషన్ ఆధార్ కార్డును పౌరసత్వ రుజువుగా అంగీకరించకపోవడం సరైనదేనని కోర్టు సమర్థించింది. ఎన్నికల కమిషన్ ఆధార్ కార్డును పౌరసత్వానికి ఖచ్చితమైన రుజువుగా అంగీకరించలేమని చెప్పడం సరైనదే. దీనిని ధృవీకరించాల్సిన అవసరం ఉందని జస్టిస్ సూర్యకాంత్ అన్నారు.
ఆధార్ కార్డు వివిధ ప్రభుత్వ, ప్రైవేటు సేవలు పొందేందుకు గుర్తింపు డాక్యుమెంట్‌గా ఉపయోగపడుతుంది..కానీ ఇది ఒక వ్యక్తి జాతీయతను నిర్ధారించే సాక్ష్యం కాదని కోర్టు స్పష్టం చేసింది. ఆధార్ యాక్ట్, 2016లోని సెక్షన్ 9 ప్రకారం.. ఆధార్ కార్డు కేవలం గుర్తింపు ధృవీకరణ కోసం మాత్రమేనని పౌరసత్వ ధృవీకరణకు కాదని కోర్టు తెలిపింది.
పిటిషనర్ల తరఫున సీనియర్ అడ్వొకేట్ కపిల్ సిబల్ వాదిస్తూ.. SIR ప్రక్రియలో ప్రొసీజరల్ అసమానతలు ఉన్నాయని, ఇది పెద్ద సంఖ్యలో ఓటర్లను అనర్హులుగా మార్చే అవకాశం ఉందని వాదించారు. 1950 తర్వాత భారతదేశంలో జన్మించిన వారందరూ పౌరులుగా గుర్తించాలని.. అయితే SIR ప్రక్రియలో ఓటర్లను తొలగించడం అన్యాయమని కపిల్సిబాల్ వాదించారు. బూత్ లెవెల్ ఆఫీసర్లు సరిగ్గా పనిచేయడం లేదని, జీవించి ఉన్న వ్యక్తులను చనిపోయినట్లు జాబితా చేయడంతో 65 లక్షల మంది ఓటర్ల పేర్లను ధృవీకరణ లేకుండా తొలగించడం వంటి సమస్యలను ఆయన కోర్టుముందు ఉంచారు.
ఎన్నికల కమిషన్ తరఫున సీనియర్ అడ్వొకేట్ రాకేష్ ద్వివేదీ వాదిస్తూ..SIR ప్రక్రియ ఎలక్టోరల్ రోల్స్‌ను రివిజన్ చేయడం రాజ్యాంగబద్ధమైన అవసరం,ఆధార్, EPIC, రేషన్ కార్డులు పౌరసత్వాన్ని నిరూపించే డాక్యుమెంట్లుగా చట్టబద్ధత లేనివని వాదించారు. ఈ డాక్యుమెంట్లు గుర్తింపు కార్డులుగా ఉపయోగిస్తున్నప్పటికీ పౌరసత్వాన్ని నిర్ధారించవని ECI తెలిపింది. ఈ ప్రక్రియలో ఎటువంటి పౌరుడి పౌరసత్వాన్ని రద్దు చేయడం జరగదు.. కేవలం ఓటింగ్ అర్హతను మాత్రమే నిర్ధారిస్తున్నామని ECI స్పష్టం చేసింది.
సుప్రీంకోర్టు ఆధార్ కార్డు పౌరసత్వ రుజువుగా చెల్లదని తేల్చడం ద్వారా ఎన్నికల కమిషన్ SIR ప్రక్రియను సమర్థించింది.అయితే ఈ ప్రక్రియ సమయం,విధానంపై ఆందోళనలను కూడా వ్యక్తం చేసింది. ఈ కేసు దేవంలో ఎలక్టోరల్ రిఫార్మ్‌లు ,పౌరసత్వ ధృవీకరణకు సంబంధించిన ముఖ్యమైన చర్చను రేకెత్తించింది.