బీహార్‌లో స్పైడర్ గర్ల్స్

బీహార్‌లో స్పైడర్ గర్ల్స్

స్పైడర్ మ్యాన్ పిల్లలకు.. పెద్దలకు బాగా తెలిసిన పేరు. సినిమాల్లో మనం స్పైడర్ మ్యాన్ విన్యాసాలు చూస్తుంటాం. గోడలు, పెద్ద పెద్ద బిల్డింగులు టపా టపా మని ఎక్కేస్తూ ఉంటాడు. పిల్లలు కూడా స్పైడర్ మ్యాన్ చేస్తున్న విన్యాసాలు చూసేందుకు చాలా ఇంట్రస్ట్ చూపిస్తుంటారు. అయితే.. తాజాగా మనదేశంలో ఇద్దరు స్పైడర్ గర్ల్స్ కూడా ఇలాగే అద్భుతాలు చేస్తున్నారు. ఎలాంటి సపోర్ట్ లేకుండా 12 అడుగుల గోడను అవలీలగా ఎక్కేస్తున్నారు.  బీహార్‌కు చెందిన ఈ ఇద్దరు అమ్మాయిలు తమ విన్యాసాలతో సోషల్ మీడియాలో దూసుకుపోతున్నారు. 

పాట్నాలో నివసించే 11 ఏళ్ల అక్షితా గుప్తా 'స్పైడర్ మ్యాన్' తరహాలో గోడలు ఎక్కుతుంది. అది కూడా ఎలాంటి శిక్షణ లేకుండానే. అక్షితతో పాటు, ఆమె 9 ఏళ్ల సోదరి కృపిత కూడా దీనిని ప్రాక్టీస్ చేయడం ప్రారంభించింది. అక్షిత,కృపిత ఆదివారం నాడు ఎటువంటి సపోర్టు లేకుండా తమ పాదాల మీద సులభంగా మార్బుల్ గ్రానైట్ గోడపైకి ఎక్కేశారు.  నిలువుగా ఉన్న పిల్లర్‌ను ఎక్కి పడేశారు.  సోదరీమణులు ఇద్దరూ ఎటువంటి మద్దతు లేకుండా స్తంభంపై 12-అడుగుల వరకు ఎక్కారు. ఈ సందర్భంగా ప్రముఖ న్యూస్ ఏజెన్సీ ఏఎన్‌ఐతో మాట్లాడిన అక్షిత, "మా తల్లిదండ్రులు పని కోసం బయటికి వెళ్లినప్పుడు, గోడలు ఎక్కడం చేయాలనే కోరిక నాకు కలిగింది. ప్రాక్టీస్‌తో, నేను గోడలపై వేగంగా నడవడం ప్రారంభించాను." 

"మా అమ్మా నాన్నలు చూసి ఆశ్చర్యపోయారు.. ఇది చాలా రిస్క్ అని హైలైట్ చేస్తూ మొదట మా అమ్మ నన్ను నిషేధించింది, కానీ నేను కొనసాగించాను. ఈ రోజు నేను స్పైడర్ మ్యాన్ లాగా గోడలు ఎక్కడం ఆనందంగా ఉంది మరియు ఆశిస్తున్నాను. త్వరలో హిమాలయాల శిఖరాలను అధిరోహిస్తాను" అని ఆమె చెప్పింది. తన అక్క అక్షితను చూసి పిల్లర్ ఎక్కడం నేర్చుకున్నానని కృపిత కూడా తెలిపింది. తండ్రి అజిత్ కుమార్ గుప్తా ANIతో మాట్లాడుతూ, "నా కుమార్తెల ప్రతిభ చూసి చాలా గర్వపడుతున్నాను. వారు ఏదో ఒక రోజు హిమాలయాల శిఖరాలను అధిరోహిస్తారని.. తమ ప్రతిభను 12 అడుగులకు పరిమితం చేయరని ఆశిస్తున్నాను." అని పేర్కొన్నారు.