వామ్మో.. బీజాపూర్ హైవే.. మూడేండ్లలో 125 మరణాలు.. డేంజర్ గా అప్పా జంక్షన్ టు మన్నెగూడ రోడ్డు

వామ్మో.. బీజాపూర్ హైవే.. మూడేండ్లలో 125 మరణాలు.. డేంజర్ గా అప్పా జంక్షన్ టు మన్నెగూడ రోడ్డు
  • 331 ప్రమాదాల్లో 332 మందికి గాయాలు 
  • 46 కిలోమీటర్లలో 40 మలుపులు, 21 బ్లాక్ స్పాట్లు
  • 19 మంది చనిపోయినా కానరాని హైవే అథారిటీ అధికారులు
  • చేవెళ్ల నుంచి ప్రమాదం జరిగిన స్థలం వరకూ గుంతలు పూడ్చిన అధికారులు

హైదరాబాద్ సిటీ, వెలుగు : అప్పా జంక్షన్ నుంచి మన్నెగూడ వరకు ఉన్న 46 కిలోమీటర్ల బీజాపూర్ హైవే (ఎస్ హెచ్ 163) మృత్యుదారిగా మారింది. రెండు రోజుల కిందట బస్సు, టిప్పర్​ప్రమాద ఘటన తర్వాత ఇప్పుడీ రోడ్డుపై రాష్ట్ర వ్యాప్తంగా చర్చ మొదలైంది. అధికారిక లెక్కల ప్రకారం 2023 నుంచి సోమవారం జరిగిన యాక్సిడెంట్​వరకు 331 ప్రమాదాలు జరగ్గా, 125 మంది కన్నుమూశారు. మరో 332 మంది గాయపడ్డారు. అప్పా జంక్షన్ నుంచి మన్నెగూడ వరకు ఈ రోడ్డు ఇరుకుగా ఉండడం, 40 మలుపులు, 21 బ్లాక్ స్పాట్లు, 300కు పైగా గుంతలు ఉండటంతో ఎప్పుడేం ప్రమాదం జరుగుతుందోనని భయపడాల్సి వస్తున్నది. 

మొన్నటి ప్రమాద ఘటన తర్వాత రెండు, మూడు చిన్న యాక్సిడెంట్లు కూడా జరిగాయి. అయినా, ఇప్పటివరకు ఎన్ హెచ్ఏఐ అధికారులు స్పందించలేదు. 19 మంది మరణించిన ఇన్సిడెంట్ లో రోడ్డుపై గుంత కూడా కారణమే అని తెలియడంతో ఆ గుంతతో పాటు చేవెళ్ల నుంచి ప్రమాదం జరిగిన చోటు వరకు ఉన్న గుంతలను మాత్రమే పూడ్చింది. అది కూడా ప్రమాదం జరిగిన రెండు రోజుల తర్వాత మాత్రమే...మిగతా 38 కిలోమీటర్ల పరిధిలో గుంతలను మాత్రమే అలాగే వదిలేసింది. 

ఇరుకు రోడ్డు... కెపాసిటీకి మించి వాహనాలు

అప్పా జంక్షన్ నుంచి మొయినాబాద్ వరకు ఉన్న 10 కిలోమీటర్ల పరిధిలో మాత్రమే డివైడర్లు ఉన్నాయి. తర్వాత మన్నెగూడ వరకు 36 కిలోమీటర్లు రెండు లేన్లుగా ఉంటుంది. మీడియన్ కూడా లేదు. రోడ్డు వెడల్పు కేవలం 25 ఫీట్లు మాత్రమే. దీనిపై వందల గుంతలు ఉన్నాయి. రోడ్డు సైడ్లు కూడా కోతలు పడి ఉన్నాయి. అంతేకాదు, గంటకు 2000 వాహనాలు వెళ్లే ఈ రోడ్డుపై ప్రస్తుతం10 వేల నుంచి 12 వేల వాహనాలు వెళ్తున్నాయంటే ఈ రహదారి ఎంత బిజీగా ఉంటుందో అర్థం చేసుకోవచ్చు. 

మొయినాబాద్ దాటిన తర్వాత మన్నెగూడ వరకు కనీసం ఓవర్​టేక్​చేసే అవకాశం కూడా ఉండదు..ముందు ఓ భారీ వాహనం వెళ్తుంటే దాని వెంట ఎన్ని వాహనాలైనా లైన్​కట్టి వెళ్లాల్సిందే. ఇలా ఓవర్​టేక్​ చేస్తూ ప్రమాదాలు జరిగిన ఘటనలు కూడా ఉన్నాయి. ఇక గుంతలను తప్పించబోయి, గుంతలో వాహనం పడి, ఓవర్ స్పీడ్ కారణంగా యాక్సిడెంట్లు జరిగిన సందర్భాలెన్నో..

మెయింటెనెన్స్ పట్టించుకోలే..

అధికారులు ఈ రోడ్డు మెయింటెనెన్స్ పట్టించుకోకపోవడంతోనే ప్రమాదాలు అధికంగా జరుగుతున్నాయి. కనీసం రోడ్డుపై పడ్డ గుంతలు పూడ్చే ప్రయత్నం కూడా చేయడం లేదు. సైడ్లలో మట్టి పోసి కోతలను కవర్ చేయడం లేదు. 2024 డిసెంబర్​లో  ఆలూరు గేటు వద్ద కూరగాయలు విక్రయిస్తున్న రైతులపైకి లారీ దూసుకెళ్లడంతో ఐదుగురు చనిపోయారు. ఆ  ఘటన తర్వాత వారానికి కొన్ని ప్రాంతాల్లో రోడ్డు సైడ్లను జేసీబీలతో చదును చేసి వదిలేశారు.. తర్వాత అవి వర్షానికి యథావిధిగా మారిపోయాయి. ప్రమాదాలు కొనసాగుతూనే ఉన్నాయి.

రెండు జేసీబీలతోనే పనులు

2018లో ఎన్ హెచ్163గా అప్​గ్రేడ్​అయిన ఈ రోడ్డు పనులకు 2022లో కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ శంకుస్థాపన చేశారు. మన్నెగూడ నుంచి బీజాపూర్ వరకు పనులు పూర్తయినా...900 మర్రి చెట్లను తొలగించవద్దని సేవ్ బనియన్స్ స్వచ్ఛంద సంస్థ ఎన్టీటీలో కేసు వేయడంతో అప్పా జంక్షన్ నుంచి మన్నెగూడ వరకు 46 కిలోమీటర్ల మేర రోడ్డు పనులు ఆగిపోయాయి. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాలతో పరిగి ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డి ఆధ్వర్యంలో ఎన్ హెచ్ ఏఐ అధికారులు పర్యావరణ వేత్తలతో పలుమార్లు చర్చలు జరిపారు. 

కేవలం 130 చెట్లు మాత్రమే తొలగిస్తామని, మిగిలిన చెట్లు కాపాడేలా రీడిజైన్ చేస్తామని చెప్పడంతో వారు కేసు విత్​డ్రా చేయడానికి ఒప్పుకున్నారు. ఈ మేరకు ఎన్జీటీలో జాయింట్ మెమోరాండం సమర్పించడంతో అక్టోబర్ 31న కోర్టు స్టే వెకేట్ చేసింది. అయినప్పటికీ ఎన్​హెచ్ఏఐ  అధికారులు పనులు వేగవంతం చేయడం లేదని, కేవలం రెండు, మూడు జేసీబీలతోనే మొయినాబాద్​ మున్సిపల్​ పరిధిలోని తాజ్​ హోటల్​వద్ద మాత్రమే పనులు చేయిస్తున్నారని స్థానికులు ఆరోపిస్తున్నారు. 

ఇక సోమవారం ప్రమాదం జరగ్గా, చేవెళ్ల నుంచి ప్రమాదం జరిగిన మీర్జాగూడ వరకు మాత్రమే గుంతలను పూడ్చారు. మిగతా గుంతలను గాలికి వదిలేశారు.  ముందు ముందు మరో ప్రమాదం జరగకుండా ప్రస్తుతం ఉన్న రోడ్డుపై మొత్తం గుంతలు పూడ్చాలని స్థానికులు కోరుతున్నారు.