డాడీ..లే..ఇంటికి పోదాం

డాడీ..లే..ఇంటికి పోదాం
  •  బైక్ ను ఢీకొట్టిన డీసీఎం 
  • స్పాట్ లో తండ్రి మృతి.. కొడుకుకు గాయాలు  
  • అబ్దుల్లాపూర్ మెట్ వద్ద  ఘటన

అబ్దుల్లాపూర్ మెట్,వెలుగు:టిఫిన్, పాల ప్యాకెట్ తెచ్చేందుకు   బైక్  వెళ్లగా.. జరిగిన యాక్సిడెంట్ లో తండ్రి మృతిచెందాడు. కొడుకు గాయపడ్డాడు.  తండ్రి డెడ్ బాడీని పట్టుకుని లే డాడీ..లే.. ఇంటికి పోదాం.. అంటూ బాబు పెట్టిన రోదనలు స్థానికులను  కంటతడి పెట్టించాయి. రంగారెడ్డి జిల్లా ఇనాంగూడ కమాన్ వద్ద కుటుంబంతో నివసించే శెట్టి కనకప్రసాద్(35) ప్రైవేట్ ఉద్యోగి.

గురువారం ఉదయం 7 గంటల సమయంలో పాల ప్యాకెట్, టిఫిన్ తెచ్చేందుకు  బైక్ పై కనకప్రసాద్ కొడుకు శివకుమార్(2)తో కలిసి అబ్దుల్లాపూర్ మెట్ కు వెళ్లారు.  వాటిని తీసుకుని తిరిగి ఇంటికి వెళ్తూ.. విజయవాడ హై వేపై రోడ్డు దాటేందుకు యూటర్న్ తీసుకుంటుండగా డీసీఎం(ఏపీ28టీఏ 5229) వచ్చి బైక్ ను ఢీకొట్టింది. దీంతో కనకప్రసాద్ స్పాట్ లో మృతి చెందగా.. బాలుడు గాయపడ్డాడు.

తండ్రి డెడ్ బాడీ ని పట్టుకుని గాయపడిన బాలుడు లే డాడీ ఇంటికిపోదాం.. అంటూ రోదించగా  స్థానికులు కూడా కంటతడి పెట్టారు. మృతుడు ఏపీలోని రాజమండ్రి జిల్లా కొవ్వూరు మండలం అతివదుల గ్రామస్తుడు. వెంటనే డీసీఎం డ్రైవర్ పరారయ్యాడు. బాధిత కుటుంబీకుల ఫిర్యాదుతో కేసు నమోదు చేశామని అబ్దుల్లాపూర్ మెట్  సీఐ అంజిరెడ్డి తెలిపారు.