- ఎప్ స్టీన్ ఫైల్స్ వ్యవహారంలో ఒప్పుకున్న బిల్ గేట్స్
- ఆ ఇద్దరు మహిళలు ఎప్ స్టీన్ బాధితులు కాదని వెల్లడి
- ఎప్ స్టీన్‌తో సమావేశమై తప్పు చేశా..
- ఫౌండేషన్ విలువలకు విరుద్ధమని వెల్లడి
వాషింగ్టన్: లైంగిక నేరగాడు, ఫైనాన్షియర్ జెఫ్రీ ఎప్‌స్టీన్‌తో తనకున్న సంబంధాలపై మైక్రోసాఫ్ట్ సహవ్యవస్థాపకుడు బిల్‌గేట్స్ తాజాగా క్లారిటీ ఇచ్చారు. గేట్స్ ఫౌండేషన్ ఉద్యోగులతో జరిగిన టౌన్‌హాల్ మీటింగ్‌లో మాట్లాడుతూ.. ఇద్దరు రష్యన్ మహిళలతో తనకు సంబంధం ఉండేదని అంగీకరించారు. అయితే, వారు ఎప్ స్టీన్ బాధితులు కాదన్నారు. ఆ ఇద్దరిలో ఒకరు బ్రిడ్జి ప్లేయర్ కాగా, మరొకరు న్యూక్లియర్ ఫిజిసిస్ట్ అని చెప్పారు. ఎప్ స్టీన్ తో పరిచయానికి ముందే వీరిద్దరితో తనకు బంధం ఉండేదని వివరించారు. ఏదేమైనా ఎప్ స్టీన్ తో తాను పలుమార్లు సమావేశం కావడం, అతడి ప్రైవేట్ జెట్ లో ప్రయాణించడం తప్పిదమేనని అన్నారు. తాను ఎలాంటి నేరాలకు పాల్పడలేదని, ఎప్ స్టీన్ నేరాలతో తనకు సంబంధం లేదని బిల్ గేట్స్ ఈ సందర్భంగా స్పష్టతనిచ్చారు. అతడిని తాను పలుమార్లు కలిసినప్పటికీ ఎన్నడూ రాత్రంతా ఉండలేదని చెప్పారు.
ఎప్ స్టీన్ తో తాను ఎలాంటి ఆర్థిక లావాదేవీలు నిర్వహించలేదని, అతడిని తన ఫౌండేషన్ లో ఉద్యోగిగా నియమించలేదని స్పష్టం చేశారు. ఈ వ్యవహారంలో తన తప్పిదం వల్ల ఇతరులు ఇబ్బంది పడ్డారని, వారందరికీ క్షమాపణలు చెబుతున్నానని గేట్స్ పేర్కొన్నారు. ఎప్‌స్టీన్‌తో సమావేశాలకు ఫౌండేషన్ అధికారులను కూడా తీసుకెళ్లడం పొరపాటేనని బిల్‌గేట్స్ వ్యాఖ్యానించారు. అమెరికా జస్టిస్ డిపార్ట్‌మెంట్ విడుదల చేసిన పత్రాల్లో గేట్స్, ఎప్‌స్టీన్ మధ్య జరిగిన పలు సమావేశాల వివరాలు వెలుగులోకి రావడంతో ఈ వివాదం మళ్లీ తెరపైకి వచ్చింది. మహిళలతో బిల్‌గేట్స్ ఫొటోలు దిగిన డాక్యుమెంట్లు కూడా ఆ ఫైల్స్‌లో ఉన్నాయి. ఫొటోలో కనిపించిన మహిళలు ఎప్‌స్టీన్ సహాయకులేనని, మీటింగ్ అనంతరం అతడి అభ్యర్థనపై ఫొటోలు దిగినట్టు బిల్‌గేట్స్ వివరించారు. ప్రపంచ ఆరోగ్య సంస్థకు భారీగా నిధులు అందించే సంస్థలలో ఒకటైన గేట్స్ ఫౌండేషన్ ప్రతిష్టకు ఈ వ్యవహారం సున్నితమైన అంశమని బిల్‌గేట్స్ వ్యాఖ్యానించినట్టు అమెరికన్ మీడియా సంస్థలు వెల్లడించాయి.
