V6 News

భారత్ లో పెరుగనున్న కోటీశ్వరులు

భారత్ లో పెరుగనున్న కోటీశ్వరులు

కోటీశ్వరుల సంఖ్యను పెంచుకోవడంలో ఇండియా అగ్రస్థానంలో ఉందని నైట్ ఫ్రాంక్ వెల్త్ రిపోర్టు వెల్లడించింది. వచ్చే ఐదేళ్లలో ఇండియాలో కోటీశ్వరుల సంఖ్య 39 శాతం మేర పెరగనున్నట్టు అంచనావేసింది. ఇండియా తర్వాత ఫిలిప్పీన్స్ 38 శాతం, చైనా 35 శాతం కోటీశ్వరుల సంఖ్యను పెంచుకోనున్నాయని పేర్కొంది. 2013-–18 మధ్య కాలంలో భారత్‌ లో కోటీశ్వరుల(ఆల్ట్రా హై నెట్ వర్త్ ఇండివిజ్యువల్) జనాభా 116 శాతం మేర వృద్ధి సాధించినట్టు రిపోర్టు వెల్లడించింది. 2019లో ఎన్నికల అనిశ్చితి ఉన్నప్పటికీ, వచ్చే ఐదేళ్లలో మాత్రం ఇండియన్ కోటీశ్వరులు 2,697కు పెరగనున్నారు. అంటే కొత్తగా ఇండియాలో 750 మంది బిలీనియర్స్ చేరనున్నారు. ఇప్పటి వరకు 1,947 మంది కోటీశ్వరులున్నారు. ఇండియా నగరాల్లో కూడా బెంగళూరులో వీరి సంఖ్య విపరీతంగా పెరగబోతోంది. రిపోర్టు ప్రకారం ఈ సిటీలో కోటీశ్వరుల జనాభా 40 శాతం వృద్ధిని సాధించనుంది. దీంతో ప్రపంచంలో టాప్ 5 ఫ్యూచర్ సిటీల్లో బెంగళూరులో మొదటి స్థానాన్ని దక్కించుకోబోతుంది. ప్రొఫిషినల్ సర్వీసెస్‌ లో వృద్ధి, ఇన్నోవేషన్సే ఈ నగరానికి కీలకంగా నిలువబోతున్నాయని రిపోర్టు అంచనావేసింది.

బెంగళూరు తర్వాత ముంబై, ఢిల్లీలో వచ్చే ఐదేళ్లలో 38 శాతం చొప్పున కోటీశ్వరుల సంఖ్యను పెంచుకోనున్నాయని నైట్ ఫ్రాంక్ రిపోర్టు అంచనావేస్తోంది. ప్రపంచంలో కెల్లా ఆసియాలోనే కోటీశ్వరుల సంఖ్య అత్యధికంగా పెరుగుతోంది. చైనా–అమెరికాల మధ్య ట్రేడ్ వార్ ఆందోళనలతో ఆర్థిక అనిశ్చిత పరిస్థితులున్పప్పటికీ… వచ్చే ఐదేళ్లలో ఆసియాలో కోటీశ్వరుల జనాభా వేగంగా పెరుగుతుందని నైట్ ఫ్రాంక్ వెల్త్ రిపోర్టు వెల్లడించింది. 2018 నుంచి 2023 మధ్య కాలంలో ఆసియా కోటీశ్వరుల సంఖ్య 27 శాతం వృద్ధిచెంది కొత్తగా1,003 చేరతారని తెలిపింది. అంటే ప్రపంచం మొత్తం మీద ఉన్న కోటీశ్వరుల సంఖ్యలో వీరు మూడింతలు పైననే. ప్రపంచవ్యాప్తంగా కోటీశ్వరులు 2,696 పెరుగుతారని రిపోర్టు తెలిపింది. ఉత్తర అమెరికా, యూరప్‌‌‌‌‌‌‌‌లలో కోటీశ్వరుల వృద్ధి 17 శాతం, 18 శాతంగా ఉండనుంది. 2013–18 కాలాన్ని తీసుకుంటే, కోటీశ్వరుల జనాభా వృద్ధి కాస్త తక్కువగానే ఉంది.

క్యాష్‌ గానే సంపదను కూడబెడుతున్నారు..
ఆసియాలో కోటీశ్వరుల సంఖ్య పెరుగుతున్నారని వెల్లడించిన నైట్ ఫ్రాంక్ పలు ఆసక్తికర విషయాలను వెలుగులోకి తీసుకొచ్చింది. కోటీశ్వరులు తమ సంపదను ఎక్కువగా క్యాష్‌ గానే ఉంచాలని ప్లాన్ చేస్తున్నారని, తక్కువ మొత్తాన్ని ఆస్తుల రూపంలో కూడబెడుతున్నట్టు పేర్కొంది. చైనా ఆర్థిక వ్యవస్థ చాలా నిదానంగా ఉండనుందని, వర్ధమాన మార్కెట్లలో ఇండియా, ఫిలిప్పీన్స్ రాబోయే కాలంలో బలమైన వృద్ధిని సాధించనున్నాయని నైట్‌‌‌‌‌‌‌‌ఫ్రాంక్ ఆసియా పసిఫిక్ రీసెర్చ్ హెడ్ నికోలస్ హాల్ట్ చెప్పారు.