- జనం తాకిడితో పులుల్లో పెరుగుతున్న స్ట్రెస్ హార్మోన్లు
- ప్రశాంతత లేమితో.. ఆడ పులుల్లో తగ్గుతున్న సంతానోత్పత్తి సామర్థ్యం
- దెబ్బతింటున్న హార్మోన్ల సమతుల్యత, గర్భధారణకు దూరం
- కోర్ ఏరియాలో ఉండే పులులకే ఎక్కువ ఇబ్బంది
- సీసీఎంబీ రీసెర్చ్ లో పులుల సంతానోత్సత్తికి సంబంధించి షాకింగ్ విషయాలు
- దేశంలోని 5 టైగర్ రిజర్వుల్లో రెండేండ్ల పాటు అధ్యయనం
- టైగర్ సఫారీలో వాహనాల సంఖ్యను, సమయాన్ని తగ్గించాలని సూచన
- లేకపోతే పులుల సంఖ్య తగ్గిపోయే ప్రమాదం ఉందని హెచ్చరిక
హైదరాబాద్, వెలుగు: పులి అడవికి రాజు.. అది గర్జిస్తే వణుకు పుట్టాల్సిందే. కానీ, ఇప్పుడు ఆ పులులే మనుషుల తాకిడికి భయపడుతున్నాయి. అడవిలో ప్రశాంతత కరువై, టూరిస్టుల అరుపులు, వాహనాల సౌండ్లతో తీవ్ర ఒత్తిడికి గురవుతున్నాయి. ఈ ఒత్తిడి ప్రభావం నేరుగా వాటి సంతానోత్పత్తిపై పడుతోందని హైదరాబాద్ లోని సీఎస్ఐఆర్- –సెంటర్ ఫర్ సెల్యులార్ అండ్ మాలిక్యులర్ బయాలజీ (సీసీఎంబీ) శాస్త్రవేత్తల అధ్యయనంలో తేలింది. ఈ పరిస్థితి ఇలాగే కొనసాగితే భవిష్యత్తులో పులులు అంతరించిపోయే ప్రమాదం ఉందని శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు.
రెండేండ్ల పరిశోధన.. 610 నమూనాలు..
సీసీఎంబీకి చెందిన డాక్టర్ జి. ఉమాపతి నేతృత్వంలోని టీమ్ దేశంలోని ఐదు ప్రధాన టైగర్ రిజర్వ్ లు అయిన కార్బెట్, తడోబా- అంధారి, కాన్హా, బాంధవ్ గఢ్, పెరియార్ లలో రెండేండ్ల పాటు ఈ అధ్యయనం నిర్వహించింది.
2020 నుంచి 2023 మధ్య కాలంలో మొత్తం 610 పులుల మల నమూనాలను సేకరించారు. వీటిలో 291 ఆడ పులులు, 185 మగ పులుల నమూనాలు ఉన్నాయి. ఈ నమూనాలను విశ్లేషించినప్పుడు పులుల్లో ఒత్తిడిని సూచించే ‘పీకల్ గ్లూకోకార్టికాయిడ్ మెటాబోలైట్స్’ హార్మోన్లు, సంతానోత్పత్తిని సూచించే ‘పీకల్ ప్రొజెస్టెరాన్ మెటాబోలైట్స్’ హార్మోన్ల స్థాయిలో భారీ మార్పులు ఉన్నట్టు గుర్తించారు.
కోర్ ఏరియాలోనే కష్టాలు ఎక్కువ..
సాధారణంగా అడవి లోపలి భాగం (కోర్ జోన్) సురక్షితంగా ఉంటుందని భావిస్తారు. కానీ, ఈ స్టడీ షాకింగ్ విషయాన్ని బయటపెట్టింది. బఫర్ జోన్లలో తిరిగే పులులు మనుషుల ఉనికికి అలవాటు పడిపోగా, కోర్ ఏరియాలో ఉండే పులులు మాత్రం టూరిస్టుల రాకతో తీవ్ర ఒత్తిడికి లోనవుతున్నాయి. ముఖ్యంగా టూరిజం సీజన్ మొదలవ్వగానే ఈ పులుల్లో స్ట్రెస్ లెవల్స్ అమాంతం పెరుగుతున్నట్టు శాస్త్రవేత్తలు గమనించారు. తడోబా, బాంధవ్‌గఢ్ రిజర్వ్ లలో ఈ ప్రభావం మరీ ఎక్కువగా ఉంది.
పిల్లల్ని కనాలంటే ప్రశాంతత ఉండాల్సిందే..
ఆడ పులులు పిల్లల్ని కనాలంటే అడవిలో చాలా ప్రశాంతమైన వాతావరణం ఉండాలని.. కానీ, టూరిజం వల్ల అడవిలో ప్రశాంతత కరువైందని సీసీఎంబీ చీఫ్ సైంటిస్ట్ ఉమాపతి తెలిపారు. తాడోబా, బాంధవ్‌గఢ్ వంటి రిజర్వ్ లలో ఒత్తిడి వల్ల ఆడ పులులు గర్బధారణకు దూరమవుతున్నాయని, ఒకవేళ పిల్లలు పుట్టినా అవి ఆరోగ్యంగా పెరగడం లేదని ఆయన వివరించారు. తాము టూరిజానికి వ్యతిరేకం కాదని, పులుల సంతతి పెరగాలంటే వాటి ప్రైవసీకి భంగం కలగకూడదని స్పష్టం చేశారు. అందుకే అడవిలో వాహనాల రద్దీని తగ్గించి, జంతువుల శరీరంలో వచ్చే మార్పులకు తగ్గట్టుగా టూరిజం నిబంధనలను మార్చాల్సిన అవసరం ఉందని ఆయన సూచించారు. లేదంటే రేపటి తరం.. పులులను కేవలం బొమ్మల్లోనే చూడాల్సి వస్తుందని హెచ్చరించారు.
వన్యప్రాణుల రక్షణలో ఈ రీసెర్చ్ కీలకం..
వన్యప్రాణుల రక్షణ కోసం మాలిక్యులర్ బయాలజీని ఎలా వాడుకోవచ్చో ఈ రీసెర్చ్ నిరూపించిందని సీసీఎంబీ డైరెక్టర్ డాక్టర్ వినయ్ నందికూరి తెలిపారు. పులులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండానే, వాటి విసర్జితాలను పరీక్షించి అవి ఎంత ఒత్తిడిలో ఉన్నాయో, వాటి సంతానోత్పత్తిఎలా ఉందో కనిపెట్టవచ్చన్నారు. దేశంలో అంతరించిపోతున్న జీవుల సంరక్షణ కోసం సీసీఎంబీలోని లాకోనెస్ ల్యాబ్ నిరంతరం కృషి చేస్తోందని పేర్కొన్నారు. ఈ రీసెర్చ్ లో తేలిన విషయాలు నేషనల్ టైగర్ కన్జర్వేషన్ అథారిటీ, అటవీ శాఖ అధికారులకు టైగర్ రిజర్వ్ ల నిర్వహణలో ఉపయోగపడుతుందని ఆశిస్తున్నట్టు ఆయన వెల్లడించారు.
పరిస్థితి చక్కబడాలంటే ఈ చర్యలు తప్పనిసరి..
పరిస్థితి చక్కబడాలంటే అటవీ శాఖ తక్షణమే కొన్ని చర్యలు తీసుకోవాలని సైంటిస్టులు సూచించారు.
n వాహనాల నియంత్రణ: సఫారీ వాహనాల సంఖ్యను వెంటనే తగ్గించాలి.
n టైమ్ తగ్గించాలి: సఫారీ సమయాన్ని ఉదయం, సాయంత్రం కనీసం గంట పాటు తగ్గించాలి.
n క్రౌడింగ్ వద్దు: పులి కనిపించగానే
వాహనాలన్నీ ఒకే చోట గుమిగూడకుండా చూడాలి.
n నీటి వసతి: టూరిస్టులు వెళ్లని మార్గాల్లో పులుల కోసం ప్రత్యేకంగా నీటి కుంటలు ఏర్పాటు చేయాలి.
n నిరంతర నిఘా: గుర్తించిన ఆడ పులులపై నాన్ –ఇవ్వేసివ్ ఫిజియాలాజికల్ మానిటరింగ్ నిర్వహించాలి.
n హాట్ స్పాట్స్ రక్షణ: సంతానోత్పత్తి హాట్ స్పాట్ లను రక్షించాలి.
