నేటి నుంచి రేషన్‌కు బయోమెట్రిక్ బంద్

నేటి నుంచి రేషన్‌కు బయోమెట్రిక్ బంద్
  • రేషన్ కు ఇక ఐరిస్, ఓటీపీ
  • గ్రేటర్ సహా అన్ని జిల్లాల్లో బయోమెట్రిక్ బంద్
  • 87.44 లక్షల మంది లబ్ధిదారులకు పంపిణీ
  • ఏర్పాట్లు చేసిన సివిల్ సప్లయ్స్ డిపార్ట్ మెంట్

హైదరాబాద్‌‌, వెలుగు: బయోమెట్రిక్ (వేలిముద్ర) లేకుండా రేషన్‌ పంపిణీ చేసేందుకు సివిల్‌ సప్లయ్స్‌‌ డిపార్ట్‌‌మెంట్‌ ఏర్పాట్లు చేసింది. రాష్ట్రంలోని 87.44 లక్షల మంది లబ్ధిదారులకు సోమవారం నుంచి మొబైల్‌ ఓటీపీ, ఐరిస్ ద్వారా రేషన్ పంపిణీ చేయనుంది. బయోమెట్రిక్ పద్ధతిలో లబ్ధిదారుల వేలిముద్రలు తీసుకోవడం ద్వారా.. ఒకరి నుంచి మరొకరికి కరోనా వ్యాపిస్తుందని కొందరు రేషన్‌ డీలర్లు హైకోర్టులో పిటిషన్‌ వేశారు. దీనిపై హైకోర్టు విచారణ చేపట్టి, బయోమెట్రిక్‌‌ పద్ధతిని ఆపేయాలని ఆదేశించింది. దీంతో రాష్ట్ర సర్కార్ గ్రేటర్‌ హైదరాబాద్‌ సహా రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో బయోమెట్రిక్‌‌ నిలిపి వేసింది. ఆధార్ కార్డుకు లింక్ అయి ఉన్న సెల్ నంబర్‌కు వచ్చే వన్ టైమ్ పాస్ వర్డ్ (ఓటీపీ)తో గానీ, ఐరిస్ (కళ్ల
స్కాన్) ద్వారా గానీ లబ్ధిదారులు రేషన్ తీసుకునేలా ఏర్పాట్లు చేసింది.

గ్రేటర్‌‌లోనూ ఐరిస్‌ ..
ఓటీపీ విధానం అమలు చేయాలంటే లబ్ధిదారుల ఆధార్‌ కార్డుకు సెల్‌ నంబర్ లింక్‌‌ అయి ఉండాలి. లింక్‌‌ కాని వారు మీ–సేవా సెంటర్లలో చేసుకోవాలని అధికారులు సూచించారు. ఇక ఐరిస్ విధానంలో లబ్ధిదారుల కళ్లను స్కాన్ చేయనున్నారు. ఇప్పటి వరకు గ్రేటర్ హైదరాబాద్‌లో ఐరిస్ విధానం అమల్లో లేదు. అయితే ఇప్పటి నుంచి గ్రేటర్‌లోనూ అమలు చేయాలని అధికారులు నిర్ణయించారు. సిటీ పరిధిలోని రేషన్‌ డీలర్లకు 632 ఐరిస్‌ డివైజ్‌లను అందజేశారు. వాటి వినియోగంపై శిక్షణ కూడా ఇచ్చారు. సర్కార్ నిర్ణయంతో చాలామందికి ఊరట కలగనుంది. బయోమెట్రిక్ విధానంలో వేలిముద్రలు యాక్సెస్ కాక.. వృద్ధులు, కొంతమంది లబ్ధిదారులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఇప్పుడా సమస్య
తీరనుంది.