దశాబ్దం తర్వాత మళ్లీ కాంగ్రెస్​లోకి బీరేన్​

దశాబ్దం తర్వాత మళ్లీ కాంగ్రెస్​లోకి బీరేన్​

న్యూఢిల్లీ: కేంద్ర మాజీ మంత్రి బీరేందర్ సింగ్ దంపతులు మంగళవారం కాంగ్రెస్ లో చేరారు. బీరేందర్ సింగ్, ఆయన భార్య ప్రేమలత  దశాబ్దం తర్వాత తిరిగి సొంత గూటికి చేరుకున్నారు. ఏఐసీసీ జనరల్ సెక్రటరీ రణ్ దీప్ సూర్జేవాలా, పవన్ ఖేరా, మకుల్ వాస్నిక్ ఇతర సీనియర్ నాయకుల సమక్షంలో వారు కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు. ఈ సందర్భంగా బీరేందర్ సింగ్ మాట్లాడారు. ‘‘ప్రజాస్వామ్యాన్ని కాపాడాలంటే ప్రభుత్వానికి వ్యతిరేకంగా గళం విప్పాలి. ప్రభుత్వం అనుసరిస్తున్న తప్పుడు విధానాల వల్ల దేశంలో మార్పు కనిపిస్తోంది. 

కాంగ్రెస్ అధిష్టానాన్ని చికాకు పెట్టేలా నేను గతంలో రాజకీయాలు చేశాను. రైతుల ఆందోళన సందర్భంగా వారి సమస్యలను పరిష్కరించడానికి నేను ప్రయత్నించాను. ఆర్థిక సంస్కరణలు తెచ్చి 33 ఏండ్లయినా రైతులు, పేదలకు న్యాయం జరగలేదు. బీజేపీ వాస్తవానికి దూరంగా ఉంది. ఆ పార్టీ నుంచి ఏమీ ఆశించకూడదు. వారు పేదల కోసం కృత్రిమ కన్నీళ్లు కారుస్తారు” అని బీరేందర్ సింగ్ ఆరోపించారు. కాగా, కేంద్రంలో ప్రధాని మోదీ నేతృత్వంలోని తొలి ప్రభుత్వంలో బీరేందర్ సింగ్ కేంద్ర స్టీల్ శాఖకు మంత్రిగా పని చేశారు.