సెప్టెంబర్లోనే CRS ద్వారా.. బర్త్ అండ్ డెత్ సర్టిఫికెట్ల జారీ.. ఖైరతాబాద్ జోన్లో పైలట్ ప్రాజెక్టు

సెప్టెంబర్లోనే CRS ద్వారా.. బర్త్ అండ్ డెత్ సర్టిఫికెట్ల జారీ.. ఖైరతాబాద్ జోన్లో పైలట్ ప్రాజెక్టు

 హైదరాబాద్ సిటీ, వెలుగు:  సెంట్రల్ గవర్నమెంట్ సివిలియన్ రిజిస్ట్రేషన్ సిస్టమ్ (సీఆర్ఎస్) ద్వారా బర్త్ అండ్ డెత్ సర్టిఫికెట్లను జారీ చేసే విషయంలో బల్దియా స్పీడ్​పెంచింది. ఈ నెలలోనే ఈ విధానాన్ని అమల్లోకి తీసుకువచ్చేందుకు అధికారులు కసరత్తు చేస్తున్నారు. ఇందుకు సంబంధించి ఇప్పటికే కేంద్ర ప్రభుత్వ అధికారులతో బల్దియా అధికారులు రెండుసార్లు సమావేశమయ్యారు. మంగళవారం మరోసారి  సమావేశమయ్యారు. 

ఈ సమావేశంలో బల్దియా ఆఫీసర్లకు పలు గైడ్ లైన్స్ జారీ చేశారు. ఈ గైడ్​లైన్స్​ను సర్కిల్, జోనల్, హెడ్ ఆఫీసు ఉద్యోగులకు బల్దియా ఉన్నతాధికారులు వివరించనున్నారు. ఇప్పటివరకు జీహెచ్ఎంసీ జారీ చేసిన 93లక్షల బర్త్ అండ్ డెత్ సర్టిఫికెట్ల డేటాను డైరెక్టర్ ఆఫ్ హెల్త్ విభాగంలోని ఆఫీస్ ఆఫ్ రిజిస్ట్రార్ జనరల్ ఆఫ్ ఇండియా(ఓఆర్జీఐ) ఆధ్వర్యంలోని సీఆర్ఎస్​ పోర్టల్ కు ట్రాన్స్​ఫర్​చేయనున్నారు.  వెంటనే గ్రేటర్ లోని ఖైరతాబాద్ జోన్ లోని ఓ సర్కిల్​లో పైలట్ ప్రాజెక్టు కింద  సర్టిఫికెట్లు ఇష్యూ చేస్తారు. ఈ క్రమంలో ఏమైన లోటుపాట్లుంటే సరి చేసుకొని నగరవ్యాప్తంగా సీఆర్ఎస్ విధానాన్ని అమల్లోకి తీసుకువస్తారు.

17వ రాష్ట్రంగా తెలంగాణ

ఇప్పటికే దేశ వ్యాప్తంగా 16 రాష్ట్రాలు, మరో 7 కేంద్రపాలిత ప్రాంతాల్లో  సీఆర్ఎస్ ద్వారా  బర్త్, డెత్ సర్టిఫికెట్లు జారీ అవుతున్నాయి.  జీహెచ్ఎంసీలో కూడా అందుబాటులోకి  వస్తే సీఎస్​ఆర్​ద్వారా సర్టిఫికెట్లు ఇచ్చే 17వ రాష్ట్రంగా తెలంగాణ నిలుస్తుంది. ఇప్పటి వరకైతే మిగతా ప్రాంతాల్లో ఇబ్బందులు ఏవీ లేవని, కొత్త విధానం ద్వారా అక్రమాలకు చెక్ పడడం ఖాయమని చెప్తున్నారు. బల్దియాలో నెలకి 17 వేల బర్త్, 6 నుంచి 7 వేల వరకు డెత్ సర్టిఫికెట్లు జారీ చేస్తున్నారు. ఇందులో 30 శాతం సర్టిఫికెట్ల పేర్లలో మార్పులు కావాలంటూ తిరిగి దరఖాస్తు చేసుకుంటున్నారు. గతంలో ఎక్కువగా తప్పులు జరిగింది ఇలాంటి సర్టిఫికెట్లలోనే.. కొత్త విధానంలో డేటా కేంద్రం దగ్గర ఉంటుంది కాబట్టి ఇలాంటి తప్పులు జరిగే అవకాశం ఉండదంటున్నారు. ఎటువంటి తప్పు జరిగినా పైనుంచి మానిటరింగ్ ఉంటుందని చెప్తున్నారు.  

పక్కాగా లాగిన్ ఐడీల జారీ..

నగరంలో ఫేక్ సర్టిఫికెట్లు ఎక్కువగా హాస్పిటల్స్ నుంచే  జారీ అవుతున్నాయి. గ్రేటర్ లో 1823 లాగిన్లను జీహెచ్ఎంసీ జారీ చేశారు.   ఎలాంటి డాక్యుమెంట్లు లేకుండానే, ఆఫీసర్లను, సిబ్బందిని మేనేజ్ చేసుకుని ఫేక్ సర్టిఫికెట్లు జారీ అయినట్లు ఇటీవల అధికారులు గుర్తించారు.  ఇలా ఓ దవాఖాన నుంచి 63 ఫేక్ సర్టిఫికెట్లు జారీ అయినట్లు గుర్తించిన అధికారులు యజమాన్యంపై క్రిమినల్ కేసు నమోదు చేసింది. ఆ తర్వాత బర్త్ అండ్ డెత్ కి సంబంధించిన రిజిస్ర్టేషన్ లాగిన్ ఐడీలు పొంది ఇన్ యాక్టివ్ గా ఉన్న  510 హాస్పిటల్స్ కి సంబంధించిన లాగిన్ ఐడీలను రద్దు చేశారు. కొత్త సిస్టం అమల్లోకి వచ్చిన తర్వాత హాస్పిటల్స్ లాగిన్లు పకడ్భంధీగా జారీ చేయనున్నారు.