చిత్ర సీమకు 'భాషా'... రజనీకాంత్

చిత్ర సీమకు 'భాషా'... రజనీకాంత్

బస్ కండక్టర్ శివాజీరావ్ గైక్వాడ్ నుంచి సూపర్ స్టార్ గా ఎదిగిన రజనీకాంత్ నేడు 72వ వసంతంలోకి అడుగుపెట్టారు. తలైవాగా దేశ వ్యాప్తంగా రజనీగా పేరు తెచ్చుకున్నారు. నటనకు అందం అవసరం లేదని, టాలెంట్ ఉంటే ఎక్కడైనా నెగ్గుకురాగలమని నిరూపించిన స్ఫూర్తి ప్రధాత రజనీకాంత్. తన మ్యానరిజంతో, ప్రత్యేకమైన స్టైల్ తో అశేష అభిమానులను రజనీ సొంతం చేసుకున్నారు. తమిళంలోనే కాకుండా తెలుగు చిత్ర సీమ పరిశ్రమలోనూ మొదటి నుంచీ తన సత్తా కొనసాగిస్తూ ఈ రోజుకీ అంతే క్రేజ్ తో, ఫ్యాన్స్ ను సంపాదించుకుని పాపులారిటీతో రజనీ దూసుకుపోతున్నారు.

నేపథ్యం

1950 డిసెంబర్ 12వ తేదీన అప్పటి మైసూరు రాష్ట్రంలోని బెంగళూరులో ఒక మరాఠీ కుటుంబంలో రజనీకాంత్ జన్మించారు. తమిళనాడులోని క్రిష్ణగిరి జిల్లా నచికుప్పమ్ గ్రామంలో రజనీకాంత్ పెరిగారు. జిజాబాయి, రామోజీరావుకి రజనీ నాలుగో సంతానం. తండ్రి గైక్వాడ్ కానిస్టేబుల్. రజనీకాంత్ తన తొమ్మిది సంవత్సరాల వయస్సులోనే తల్లిని కోల్పోయారు. రజనీకి ఇద్దరు అన్నలు. సత్యనారాయణరావు, నాగేశ్వరరావు, అక్క అశ్వత్ బాలూభాయి. ఇక రజినీకాంత్ పాఠశాల చదువంతా బెంగళూరులోని పూర్తిచేడులో ఉన్న ఆచార్య భన్నారగట్టా పాఠశాలలో సాగింది. 

పాఠశాల విద్య పూర్తికాగానే, రజనీకాంత్ కూలీ పనులతో పాటు చాలా ఉద్యోగాలు చేశారు. ఆ తర్వాత బెంగుళూరు ట్రాన్స్‌పోర్ట్ సర్వీస్ (BTS)లో బస్ కండక్టర్‌గా ఉద్యోగం వచ్చింది. దాంతో పాటు స్టేజ్ నాటకాల్లోనూ నటించారు. ఒక ప్రకటనను చూసి మద్రాస్ ఫిల్మ్ ఇన్‌స్టిట్యూట్‌లో నటనలో శిక్షణ తీసుకోవాలని రజనీకాంత్ నిర్ణయించుకున్నారు. అయితే..కుటుంబం నుంచి పూర్తి మద్దతు ఇవ్వనప్పటికీ, స్నేహితుడు సహోద్యోగి రాజ్ బహదూర్ అతన్ని సంస్థలో చేరేలా ప్రోత్సహించారు. శిక్షణా సంస్థలో ఉన్న సమయంలోనే తమిళ చిత్ర దర్శకుడు కె. బాలచందర్ రజనీని గుర్తించారు. అప్పటికే తమిళనాట ప్రజాదరణ పొందిన శివాజీ గణేషన్‌ ఉండడంతో శివాజీ పేరును మారుస్తూ రజనీ కాంత్ పేరును ఖరారు చేశారు. 

జీవిత భాగస్వామి

రజనీకాంత్, లతా రంగాచారిని వివాహం చేసుకున్నారు. ఆమె యతిరాజ్ కాలేజ్ ఫర్ ఉమెన్ విద్యార్థిని. ఒకసారి ఆమె తన కళాశాల మ్యాగజైన్ కోసం రజనీని ఇంటర్వ్యూ చేశారు. వీరి వివాహం 1981 ఫిబ్రవరి 26న ఆంధ్రప్రదేశ్‌లోని తిరుపతిలో జరిగింది. ఈ దంపతులకు ఐశ్వర్య రజనీకాంత్, సౌందర్య రజనీకాంత్ అనే ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. లత "ది ఆశ్రమ్" పేరుతో పాఠశాలను నడుపుతున్నారు.

నటనా శైలి

రజినీకాంత్ ను భారతీయ సినిమా చరిత్రలో అత్యంత ప్రజాదరణ పొందిన నటులలో ఒకరిగా పరిగణిస్తారు. నిజ జీవితంలో నిరాడంబరతను కొనసాగిస్తూనే, విభిన్న పాత్రలతో సూపర్ హీరోగా పేరు తెచ్చుకొని, అదిరిపోయే లుక్స్, స్టైల్ తో అభిమానుల్ని సొంతం చేసుకున్నారు. 2014లో అధికారిక ట్విట్టర్ ఖాతాను తెరిచిన రజనీకాంత్.. 24 గంటల్లోనే 2.1 లక్షల మంది ఫాలోవర్లను అందుకున్నారు. ఎకనామిక్ టైమ్స్ ప్రకారం ఏ భారతీయ సెలబ్రిటీకి అంత వేగంగా ఫాలోవర్లు పెరగలేదు.

సామాజిక సమస్యలపైనా..

రజనీకాంత్ సినిమాల్లోనే కాదు.. సామాజిక సమస్యలపైనా పోరాటం చేశారు. 2002లో తమిళనాడుకు కావేరీ నది నీటిని విడుదల చేయకూడదనే కర్ణాటక ప్రభుత్వ నిర్ణయాన్ని నిరసిస్తూ రజనీకాంత్ ఒక రోజు నిరాహార దీక్ష చేపట్టారు. భారతీయ నదులను అనుసంధానం చేసే ప్రణాళికకు ఒక కోటి రూపాయలు విరాళంగా ఇస్తున్నట్లు కూడా అప్పట్లో ప్రకటించారు. 2008లో హోగెనక్కల్ జలపాతం నీటి వివాదంపై కర్ణాటక వైఖరికి వ్యతిరేకంగా నడిగర్ సంఘం నిర్వహించిన నిరాహారదీక్షలో రజనీకాంత్ పాల్గొని కర్ణాటకలోని రాజకీయ నాయకులకు వ్యతిరేకంగా ప్రసంగించారు. 

అవార్డులు

రజినీకాంత్ నటించిన సినిమాలకు చాలా పురస్కారాలు వచ్చాయి. వీటిలో ఎక్కువ భాగం తమిళ సినిమాలకు వచ్చినవే. 1984లో నల్లవనుకు నల్లవాన్ అనే తమిళ సినిమాకు మొదటిసారిగా ఉత్తమ తమిళ నటుడిగా ఫిల్మ్ ఫేర్ పురస్కారం అందుకున్నారు. ఇప్పటిదాకా ఆయన అందుకున్న ఏకైన ఫిల్మ్ ఫేర్ పురస్కారం కూడా అదే. ఆ తర్వాత శివాజీ (2007), రోబో (2010) సినిమాలకు కూడా ఫిల్మ్ ఫేర్ నామినేషన్లకు ఎంపికయ్యారు. 2014 నాటికి రజినీకాంత్ ఆరు సార్లు తమిళనాడు ప్రభుత్వ సినిమా పురస్కారాలు అందుకున్నారు. చాలామార్లు సినిమా ఎక్స్‌ప్రెస్ పురస్కారాలు, అభిమానుల తరపున సినిమాల్లో, బయట ఆయన చేసిన సేవలకు కూడా పలు పురస్కారాలు అందుకున్నారు.

రజినీకాంత్ తమిళనాడు ప్రభుత్వం నుంచి 1984లో కలైమామణి, 1989లో ఎం.జి.ఆర్ పురస్కారాన్ని అందుకున్నారు. 1995లో దక్షిణ భారత నటీనటుల సంఘం తరపున కలైచెల్వం పురస్కారాన్ని అందుకోగా.. 2016 సంవత్సరానికి పద్మవిభూషణ్ పురస్కారాన్ని భారత ప్రభుత్వం ప్రకటించింది. 2019 సంవత్సరానికి దాదాసాహెబ్ ఫాల్కే అవార్డును రజనీ పొందారు.

బర్త్ డే సందర్భంగా...

కోయంబత్తూర్ చెన్నైలో రజనీకాంత్ నటించిన సినిమాలను ప్రత్యేకంగా ప్రదర్శిస్తున్నారు. డిసెంబర్ 12వ తేదీన రజనీ నటించి.. స్క్రీన్ ప్లే అందించడమే కాకుండా ఆయనే స్వయంగా నిర్మించిన బాబా సినిమాను రీ మాస్టర్ చేసి రిలీజ్ చేస్తున్నారు. ఈ సినిమాతో పాటు శివాజీ 2.0, దర్బార్ వంటి సినిమాలో కూడా ఈరోజు థియేటర్లలో సందడి చేయనున్నాయి. ఇకపోతే రజినీకాంత్ నటించిన నిర్మించిన బాబా ఫోర్ కే రీమాస్టర్ చేసిన ప్రింట్ ఈరోజు చెన్నైలోని సత్యం థియేటర్ లో ప్రత్యేకంగా ప్రివ్యూ వేసి ప్రదర్శించనున్నారు.

విషెస్

రజనీ కాంత్ పుట్టినరోజు సందర్భంగా పలువురు సినీ ప్రముఖులు ఆయనకు బర్త్ డే విషెస్ తెలియజేస్తున్నారు. ఈ సందర్భంగా కమల్ హాసన్, ధనుష్, దుల్కర్ సల్మాన్ పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలియజేశారు. ఆయన మరిన్ని విజయాలను సొంతం చేసుకోవాలని, ఆయురారోగ్యాలతో సంతోషంగా ఉండాలని ప్రార్థిస్తున్నారు.