ఫిబ్రవరి నెలలో తీవ్ర ఒడిదుడుకులతో ప్రారంభమైన క్రిప్టో మార్కెట్.. ప్రస్తుతం స్థిరత్వం వైపు అడుగులు వేస్తోంది. ఫిబ్రవరి 9 నాటికి బిట్‌కాయిన్ రేటు 70వేల డాలర్ల వద్ద కన్సోలిడేట్ అవుతూ ఇన్వెస్టర్లలో కొత్త ఆశలు రేకెత్తిస్తోంది. గత వారంలో 60వేల డాలర్ల దిగువకు పడిపోయిన బిట్‌కాయిన్.., ప్రస్తుతం 68వేల నుండి 72వేల డాలర్ల మధ్య కదలాడుతోంది. అయితే ఈ పెరుగుదల ఒక స్పష్టమైన ట్రెండ్‌గా కాకుండా.. మార్కెట్ తనను తాను సరిదిద్దుకుంటున్న ఫేజ్ అంటున్నారు ఇన్వెస్ట్మెంట్ నిపుణులు.
టెక్నికల్స్ పరంగా చూస్తే.. 70వేల డాలర్లు అనేది ఒక మానసిక స్థాయిగా మారింది. మార్కెట్ పతనమైతే 68వేల డాలర్ల వద్ద సపోర్ట్ లభిస్తుంది. ఒకవేళ అంతకంటే దిగువకు పడితే 60వేల - 62వేల డాలర్ల జోన్ అత్యంత కీలకమైన డిమాండ్ ఏరియాగా పని చేయనుంది. మరోవైపు ధర పెరగాలంటే 74వేల - 75వేల డాలర్ల వద్ద ఉన్న రెసిస్టెన్స్ అధిగమించాల్సి ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. 80వేల డాలర్ల పైన భారీ సప్లై ఉండటంతో.. గతంలో జరిగిన ర్యాలీలు అక్కడ విఫలమయ్యాయి.
ప్రస్తుత మార్కెట్ పరిస్థితిని ఆన్-చైన్ డేటా విశ్లేషిస్తే.. స్వల్పకాలిక ఇన్వెస్టర్లు ఇంకా నష్టాల్లోనే ఉన్నట్లు తెలుస్తోంది. గతంలో కొన్నవారు ధర పెరిగిన ప్రతిసారీ నష్టాలను తగ్గించుకోవడానికి అమ్మకాలకు దిగుతున్నారు. దీనివల్ల మార్కెట్ పైకి వెళ్లడం కష్టతరంగా మారుతోంది. ఇక ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్ల విషయానికొస్తే.. ఫిబ్రవరి 6న దాదాపు 330 మిలియన్ డాలర్ల నెట్ ఇన్ ఫ్లోలు నమోదయ్యాయి. కానీ ఇది కేవలం వ్యూహాత్మక కొనుగోళ్లే తప్ప.. పూర్తిస్థాయి విశ్వాసం కాదని స్పష్టమవుతోంది.
ఫిబ్రవరి 10-11 తేదీల్లో విడుదలయ్యే అమెరికా సీపీఐ ద్రవ్యోల్బణం, రిటైల్ అమ్మకాల గణాంకాలపై మార్కెట్ కళ్లు ఉన్నాయి. ఒకవేళ ద్రవ్యోల్బణం తగ్గకపోతే, వడ్డీ రేట్ల తగ్గింపు మరింత ఆలస్యం కావచ్చు. ఇది క్రిప్టో వంటి రిస్క్ అసెట్స్‌పై ప్రతికూల ప్రభావం చూపుతుంది. ఇక ఆల్ట్ కాయిన్స్ విషయానికొస్తే.. ఎథీరియం 2వేల డాలర్ల పైన స్థిరంగా ఉండగా, బీఎన్‌బీ, సోలానా కూడా నిలకడగా కొనసాగుతున్నాయి.
మార్కెట్ ప్రస్తుతం రిపేర్ మోడ్‌లో ఉన్నందున.. తొందరపడి ర్యాలీలను ఫాలో అవ్వొద్దని జియోటస్ క్రిప్టో ఎక్స్ఛేంజీ సీఈవో విక్రమ్ సుబ్బురాజ్ హెచ్చరిస్తున్నారు ఇన్వెస్టర్లను. 60వేల - 62వేల డాలర్ల స్థాయికి వచ్చినప్పుడు నెమ్మదిగా పెట్టుబడులు పెట్టడం మంచిది. క్రిప్టో SIP వంటి మార్గాల ద్వారా పెట్టుబడిని యావరేజ్ చేసుకోవడం వల్ల అస్థిరత నుంచి తప్పించుకోవచ్చని ఆయన సూచిస్తున్నారు. మెుత్తానికి కొత్త ఏడాదిలో క్రిప్టోలు బేర్ సైకిల్ లో ఉన్నట్లు చెప్పుకోవచ్చు.
