హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో కాంగ్రెస్ పాలనలో పోలీసుల తీరు చూస్తే రజాకార్ల పాలనను తలపిస్తోందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్.రాంచందర్ రావు ఆరోపించారు. హోంమంత్రి బాధ్యతలు చూస్తున్న సీఎం రేవంత్ రెడ్డికి రాష్ట్రంలో ఏం జరుగుతుందో సోయి లేకుండా పోయిందన్నారు. చాంద్రాయణగుట్ట బార్కాస్‌లో ద్విముఖ హనుమాన్ విగ్రహం ధ్వంసం, రుద్రూరులో మహిళా న్యాయవాదిపై జరిగిన దాడి ఘటనలపై మంగళవారం ఆయన ఓ ప్రకటనలో స్పందించారు.
రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ అదుపు తప్పిందని, హిందువులపై జరుగుతున్న దాడులు యాదృచ్ఛికం కాదని.. సనాతన ధర్మంపై జరుగుతున్న కుట్ర అని ఆయన ఆరోపించారు. చాంద్రాయణగుట్ట బార్కాస్ ప్రాంతంలోని హనుమాన్ ఆలయంపై దాడి చేసి విగ్రహాన్ని ధ్వంసం చేయడం హేయమైన చర్య అని అన్నారు. కాంగ్రెస్ పాలనలో దేవాలయాలపై దాడులు జరుగుతున్నా ప్రభుత్వం మౌనంగా ఉండటం అంటే.. పరోక్షంగా దాడులను సమర్థించడమేనన్నారు. ఇలాంటి ఘటనలలో దోషులను కఠినంగా శిక్షించాల్సింది పోయి.. వాడు పిచ్చోడు అంటూ పోలీసులే నిందితులకు సర్టిఫికెట్లు ఇస్తున్నారని ఎద్దేవా చేశారు.
