- బీఎంసీపై పట్టు కోల్పోయిన థాకరే బ్రదర్స్..73 స్థానాలకే పరిమితం
- ముంబై సహా 29 మున్సిపల్ కార్పొరేషన్లలో ఎలక్షన్స్..
- 28 చోట్ల మహాయుతి విజయం..
- లాతూర్ మున్సిపల్ కార్పొరేషన్‌ను కైవసం చేసుకున్న కాంగ్రెస్
- జాల్నా కార్పొరేషన్‌లో గౌరీ లంకేశ్ హత్య కేసు నిందితుడి గెలుపు
ముంబై: బృహన్ ముంబై మున్సిపల్ కార్పొరేషన్ (బీఎంసీ) ఎన్నికల ఫలితాల్లో బీజేపీ-–శివసేన (షిండే) కూటమి భారీ విజయం సాధించింది. గత 25 ఏండ్లుగా ముంబైపై ఆధిపత్యం చలాయిస్తున్న థాకరే ఫ్యామిలీకి ఈ ఫలితాలు గట్టి షాక్ ఇచ్చాయి. బీజేపీ నేతృత్వంలోని మహాయుతి కూటమి 119 స్థానాల్లో విజయం సాధించింది.
ఇందులో బీజేపీ 88, ఏక్‌నాథ్ షిండే నేతృత్వంలోని శివసేన 28 వార్డుల్లో సత్తా చాటాయి. రెండు దశాబ్దాల తర్వాత చేతులు కలిపిన ఉద్ధవ్ థాకరే(శివసేన యూబీటీ), రాజ్ థాకరే (ఎంఎన్‌ఎస్) కూటమి ఆశించిన ఫలితాలను సాధించలేకపోయింది. ముంబైని తమ కంచుకోటగా భావించే థాకరే ప్యామిలీ పార్టీలు 73 స్థానాలకే పరిమితమయ్యాయి. ఉద్ధవ్ సేన 67 వార్డుల్లో, ఎంఎన్‌ఎస్ కేవలం 6 వార్డుల్లో మాత్రమే గెలుపొందాయి.
తొమ్మిదేండ్ల విరామం తర్వాత ఎలక్షన్స్
దేశంలోనే అత్యంత సంపన్నమైన మున్సిపల్ బాడీ బీఎంసీ ఎన్నికల్లో 227 స్థానాలకు 1,700 మంది అభ్యర్థులు పోటీ పడ్డారు. అనేక వాయిదాల తర్వాత.. దాదాపు తొమ్మిదేండ్ల విరామం అనంతరం ఈ ఎన్నికలు జరిగాయి. గతంలో 2017లో జరిగిన ఎన్నికల్లో ఉమ్మడి శివసేన తన పట్టును నిలుపుకున్నది. మహారాష్టలోని ముంబై, పుణెతోపాటు పింప్రి -చించ్వాడ్, కొల్హాపూర్, వసాయ్-విరార్, కల్యాణ్– -డోంబివిలి, నాగ్‌పూర్, సోలాపూర్, అమరావతి, థానే, పర్బనీ తదితర మున్సిపాలిటీలకు గురువారం ఎన్నికలు జరిగాయి. మొత్తం 893 వార్డుల్లోని 2,869 సీట్ల కోసం ఈ ఎలక్షన్స్ నిర్వహించారు. ఎన్నికల బరిలో మొత్తం 15,931 మంది అభ్యర్థులు నిలిచారు.
వీరిలో ముంబై నుంచి 1,700 మంది, పుణె నుంచి 1,166 మంది క్యాండిడేట్స్ పోటీలో ఉన్నారు. గురువారం ఎన్నికలు జరగ్గా 52.94% పోలింగ్ నమోదైంది. శుక్రవారం ఉదయం నుంచే ఎన్నికల ఫలితాల కౌంటింగ్‌ను ప్రారంభించారు. మహారాష్ట్రలోని మొత్తం 28 మున్సిపల్ కార్పొరేషన్లలో కూడా బీజేపీ కూటమే పైచేయి సాధించింది.
బీజేపీ మొత్తం 1,440 వార్డుల్లో, షిండే సేన 404 వార్డుల్లో గెలుపొందాయి. పుణె మున్సిపల్ కార్పొరేషన్‌లో బీజేపీ 123 స్థానాలు గెలుచుకోగా, అజిత్ పవార్-–శరద్ పవార్ నేతృత్వంలోని ఎన్సీపీ కూటమి కేవలం 24 స్థానాలకే పరిమితమైంది. ఇక పార్టీలవారీగా చూస్టే కాంగ్రెస్ మూడో స్థానంలో ఉంది. భీవండి– నిజాంపూర్, నాగపూర్, కొల్హాపూర్‌లాంటి ప్రాంతాల్లో కలిపి మొత్తం 318 స్థానాల్లో ఆ పార్టీ విజయం సాధించింది.
లాతూర్ మున్సిపల్ కార్పొరేషన్ కాంగ్రెస్ కైవసం
రాష్ట్రవ్యాప్తంగా జయకేతనం ఎగరేసిన బీజేపీ లాతూర్‌లో మాత్రం ఓడిపోయింది. ఇక్కడి మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ గెలుపొందింది. మొత్తం 70 స్థానాలకుగానూ 43 చోట్ల కాంగ్రెస్ సత్తా చాటింది. బీజేపీ 22 స్థానాలకే పరిమితమైంది. వంచిత్ బహుజన్ అఘాడీ 4, ఎన్సీపీ ఒక సీటు సాధించాయి.
ఎన్నికల ప్రచార సమయంలో ఇదే ప్రాంతానికి చెందిన మాజీ సీఎం విలాస్‌రావ్ దేశ్‌ముఖ్‌పై బీజేపీ స్టేట్ చీఫ్ చేసిన వివాదాస్పద వ్యాఖ్యలే పార్టీ ఓటమికి కారణమని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. కాగా, పింప్రి -చించ్వాడ్‌లో బీజేపీ 84 స్థానాల్లో, అజిత్ పవార్ నేతృత్వంలోని ఎన్సీపీ 37 స్థానాల్లో విజయం సాధించాయి. నాగపూర్‌లో బీజేపీ 102 స్థానాలు గెలుపొందగా.. కాంగ్రెస్ 33 స్థానాలకే పరిమితమైంది.
గౌరీ లంకేశ్ హత్య కేసు నిందితుడు గెలుపు
జాల్నా కార్పొరేషన్ ఎన్నికల ఫలితాల్లో సంచలనం చోటుచేసుకున్నది. ప్రముఖ జర్నలిస్టు గౌరీ లంకేశ్ హత్య కేసులో నిందితుడిగా ఉన్న శ్రీకాంత్ పాంగార్కర్.. ఓ వార్డు నుంచి స్వతంత్ర అభ్యర్థిగా పోటీచేసి, గెలుపొందాడు. 13 వార్డునుంచి శ్రీకాంత్ పోటీ చేయగా.. ఇక్కడ బీజేపీతోపాటు ఇతర పార్టీ అభ్యర్థులు పోటీ పడ్డారు.
అయితే, ఏక్‌నాథ్ షిండే నేతృత్వంలోని శివసేన మాత్రం క్యాండిడేట్‌ను బరిలో దింపలేదు. 2001,2006లో పాంగార్కర్ శివసేన తరఫున జాల్నా మున్సిపల్ కౌన్సిల్ సభ్యుడిగా ఉన్నాడు. 2011లో పార్టీ టికెట్ నిరాకరించడంతో హిందూ జనజాగృతి సమితిలో చేరాడు. గౌరీ లంకేశ్ హత్య కేసులో 2024లో కర్నాటక హైకోర్టు పాంగార్కర్‌కు బెయిల్ మంజూరుచేసింది. అంతకుముందు 2018లో బాంబులు, ఆయుధాలు లభ్యమైన కేసులో మహారాష్ట్ర యాంటీ -టెర్రరిజం స్క్వాడ్ ఆయన్ను అరెస్టు చేయడం గమనార్హం.
